Thambidurai
-
సీనియర్ నేత తంబిదురైకు గుండెపోటు
సాక్షి, చెన్నై: రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురైకు బుధవారం గుండెనొప్పి వచ్చింది. ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తంబిదురైకి యాంజియోగ్రామ్ చికిత్స అందించారు. ప్రస్తుతం తంబిదురై ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
నటనతో సరిపెట్టుకోండి..
పెరంబూరు: నటులు నటనతో సరిపెట్టుకోవాలని పార్లమెంట్ డిప్యూటీ స్వీకర్ తంబిదురై చురకలు వేశారు. కరూర్ సమీపంలోని ఎన్ పుత్తూర్, అన్నానగర్, సెవందియాపట్టి ప్రాంతాల్లో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తంబిదురై, మంత్రి ఎంఆర్.విజయభాస్కర్‌లు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు తమ బాధ్యతలను సరిగా నిర్వహించకపోవడం వల్లే నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరి అడగ్గా రాజకీయవాదుల ప్రశ్నలకే బదులివ్వడం జరుగుతుందని, నటులు నటనతో సనిపెట్టుకోవాలని, వారి వ్యాఖ్యలకు బదులివ్వాల్సిన అవసరం లేదని తంబిదురై అన్నారు. కడైమడై ప్రాంతాలకు నీరు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్న విషయానికి డిప్యూటీ స్వీకర్ స్పందిస్తూ ఆరోపణలు ఎవరైనా చేయవచ్చునని, అయితే ప్రజాపనుల శాఖ బాధ్యతలు నిర్వమిస్తున్న ముఖ్యమంత్రినే అందుకు రైతులకు నీరు అందిస్తున్నట్లు చెప్పారని అన్నారు. -
బీజేపీకి ఏఐఏడీఎంకే ఊహించని షాక్..
సాక్షి, చెన్నై : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వరుస ఆరోపణలతో సతమతమౌతున్న బీజేపీ ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ ఎదురైంది. తమ డిమాండ్లపై స్పందించకపోతే అవిశ్వాసానికి రెడీ అంటూ ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఇప్పటికే లోక్‌సభలో ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీల వరుస అవిశ్వాస తీర్మానాలతో సతమతమౌతున్న బీజేపీకి ఇది ఊహించని దెబ్బే. కావేరీ మేనేజ్మెంట్ బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేక ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమో నిర్ణయిస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఘాటుగా స్పందించారు. -
తంబి పరుగు!
► గవర్నర్‌తో భేటీ ► స్టాలిన్ ఫిర్యాదులకు వివరణ ► అవన్నీ పగటి కలలే ► నాలుగేళ్లు పాలన కొనసాగుతుంది ► అమ్మ ప్రతినిధి స్పష్టీకరణ తమ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం లక్ష్యంగా ప్రతిపక్షాలు నినాదాన్ని అందుకున్న నేపథ్యంలో ఆదివారం రాజ్ భవన్ వైపుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై పరుగులు తీశారు. ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులకు ఆయన వివరణ ఇచ్చుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి బల పరీక్ష మద్దతుగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీనిని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. శనివారం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు. ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసలే అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో దినకరన్ రూపంలో ఇంటిపోరు సాగుతున్న నేపథ్యంలో తాజాగా, ప్రతిపక్షాలు ఇరకాటంలో పెట్టే నినాదాన్ని అందుకోవడంతో సీఎం పళనిస్వామి ప్రభుత్వం సందిగ్ధంలో పడ్డట్టు అయింది. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుకు వివరణ ఇచ్చుకునే రీతిలో అమ్మ శిబిరం ప్రతినిధిగా,పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు పరుగులు తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్‌తో భేటీ : ఉదయాన్నే రాజ్‌భవన్‌కు చేరుకున్న తంబిదురై గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావుతో భేటీ అయ్యారు. అర గంట పాటుగా సాగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు తంబి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తుండడం, వారి ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్న విజ్ఞప్తిని చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పాలన భేష్‌గా ఉందని బయటకు వచ్చిన తంబి మీడియాతో డీఎంకేపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవన్నీ పగటి కలలు : తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. చిన్న అస్త్రం దొరికినా, దానిని భూతద్దంలో చూపెట్టి రాద్దాంతం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తుచేశారు. అవన్నీ పట్టించుకోకుండా, కేవలం ఓ సీడీని చేతిలో పెట్టుకుని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, చర్చల మీద చర్చలు, విచారణలకు పట్టుబట్టే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని డీఎంకే ఐదేళ్లు పాలనను కొనసాగించినప్పుడు, ప్రస్తుతం మరో నాలుగేళ్లు తామూ ప్రభుత్వాన్ని నడిపించగలమని ధీమా వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. ఈ సమయంలో ఎవరూ పార్టీ విప్‌ను ధిక్కరించబోరని «ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎన్ని కుట్రలు చేసినా, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, ఆయన పగటి కలలు ఇప్పట్లో నెరవేరవని హితవు పలికారు. -
గవర్నర్ ను కలిసిన తంబిదురై
చెన్నై : పళనిస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలన్న నినాదాన్ని ప్రతిపక్షాలు అందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆదివారం రాజ్‌భవన్ వైపు పరుగులు తీశారు. ఇన్చార్జి గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావుతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు. మరోవైపు ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర గంటసేపు జరిగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తున్నదని, ఆ పార్టీ ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్నట్లు తెలుస్తోంది. అవన్నీ పగటి కలలు అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదు అని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేవలం ఓ సీడీని పట్టుకుని విచారణకు పట్టుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు సుపరి పాలన అందించి ప్రజల మెప్పును పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
మాటల తూటాలు
► స్వరం పెంచిన శిబిరాలు ► పన్నీరు వైపు 12 మంది మంత్రులు ► 32 మంది ఎమ్మెల్యేలు ► సెమ్మలై వ్యాఖ్యతో పళని శిబిరంలో చర్చ ► పన్నీరు మునిగే నావ.. జయకుమార్ ► ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ: ఎంపీ తంబిదురై సాక్షి, చెన్నై : సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు శిబిరాలు స్వరం పెంచి సై...అంటే సై..అన్నట్టుగా విమర్శల దాడిలో మునిగాయి. తమ వైపు వచ్చేందుకు 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై తూటా పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, పన్నీరు ఓ మునిగే నావ అని, చిల్లులు పడ్డ ఆ నావలోకి ఎక్కేవాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమని పళని శిబిరం మంత్రి జయకుమార్ స్వరం పెంచడం గమనార్హం. అన్నాడీఎంకేలో ఏకమయ్యే విషయంగా సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఇప్పట్లో నిర్ణయాలు తీసుకోవడం అనుమానమే. అదిగో...ఇదిగో చర్చలు అంటూ ఇన్నాళ్లు కాలయాపన సాగింది. ఇప్పుడు ఆ ఊసే లేదు. రెండు రోజుల క్రితం పన్నీరుసెల్వం కాస్త దూకుడు పెంచి స్థానిక సమరానికి ముందే అసెంబ్లీకి ఎన్నికలు తథ్యం అని సంచలన ప్రకటన చేసి చర్చకు తెర లేపారు. ఇక, సోమవారం పన్నీరు శిబిరానికి చెందిన మాజీ మంత్రి కే మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ చర్చల విషయంగా ఇద్దరు మంత్రులు అడ్డు పడుతున్నారని తీవ్రంగా విరుచుకు పడ్డారు.ఆ ఇద్దరు పేర్లను సైతం ప్రకటించారు. ఇది కాస్త ఆ మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, జయకుమార్‌లకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో ఈ పుండు మీద మరింత కారం చల్లే రీతిలో పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై కొత్త బాంబును పేల్చారు. తమ వైపుగా 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు చూస్తున్నారని, పన్నీరు సెల్వం సీఎం పదవి చేపట్టాలన్న కాంక్షతో వాళ్లు ఉన్నట్టు వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, శశికళకు పదవీ ఆశ, దినకరన్‌కు డబ్బు ఆశ మరీ ఎక్కువేనని శివాలెత్తారు.అందుకే ఒకరు పరప్పన అగ్రహారం, మరొకరు తీహార్ జైలుకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. తమకు ఏ ఆశ లేదని అందుకే ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని, కేడర్ తమ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సెమ్మలై వ్యాఖ్యలతో పళని శిబిరం స్వరం పెంచే వాళ్లు పెరిగారు. పన్నీరు మునిగే నావ: పళని శిబిరం మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు ఓ మునిగే నావ అని ధ్వజమెత్తారు. ఇప్పటికే అందులో చిల్లులు మరీ ఎక్కువయ్యాయని, అందులో ఎక్కిన వాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమన్నారు. చిల్లుల్ని ఉప్పుతో పూడ్చినట్టుగా సెమ్మలై వ్యాఖ్యలు ఉన్నాయని విరుచుకు పడ్డారు. చర్చలకు రమ్మంటే, తమ మీద నిందల్ని వేస్తూ, అబద్దాల కోరు అని నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఇక, ఆ శిబిరానికి చెందిన అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అన్భళగన్ పేర్కొంటూ, తామరలోకి రెండాకుల్ని ఇమడ్చడానికి పన్నీరు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబి దురై పేర్కొంటూ, పన్నీరు చెప్పినట్టుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. చర్చలు సామరస్యంగా సాగాలన్నదే తన అభిమతం అని, అయితే, పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. ఇక, మరో మంత్రి కామరాజ్ అయితే, మరో అడుగు ముందుకు వేసి, పన్నీరు సీఎంగా ఉన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సాగించిన అవినీతి బండారం ఇప్పుడు తెరమీదకు వచ్చి తమ మెడకు చుట్టుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిని పరిచయం చేసింది, తెర మీదకు తెచ్చింది పన్నీరుసెల్వమేనని ఆయన ఆరోపిస్తున్నారు. -
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
-
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
తమిళనాట వేడిక్కిన రాజకీయం చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో శశికర, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
-
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నా డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీరు సెల్వం తప్ప పార్టీకి చెందిన మిగతా 134 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించడంపై తంబిదురై స్పందిస్తూ.. చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. పన్నీరు సెల్వానికి ఇక పార్టీతో సంబంధం లేదని చెప్పారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
పన్నీర్ జోష్
► ఆనందోత్సాహాల్లో మద్దతుదారులు ► గ్రీన్ వేస్ రోడ్డులో అభిమాన తాకిడి ► సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం ఆపద్ధర్మ సీఎం పన్నీరు శిబిరం ఆనందోత్సాహాలతో మునిగింది. బల నిరూపణకు చాన్స్ ఇస్తే, నెగ్గి తీరుతామన్న ధీమా మద్దతుదారుల్లో పెరిగింది. పన్నీరుకు మద్దతుగా ఎంపీలు, ఓ మంత్రి తమ శిబిరంలోకి చేరడంతో, బలం మరింత పెరగడం ఖాయం అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ వేస్ రోడ్డుకు అభిమాన తాకిడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుతున్నాయి. సాక్షి, చెన్నై : సీఎం కుర్చీకోసం చిన్నమ్మ శశికళ, పన్నీరుసెల్వం మధ్య సాగుతున్న సమరంలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ఎత్తుగ డలో నువ్వా..నేనా అన్నట్టుగా ఇరువురూ ముం దుకు దూసుకెళుతున్నారు. ఈ సమయంలో శనివా రం పన్నీరుసెల్వం శిబిరాన్ని ఆనందకర క్షణాలు మెండుగా ఆవహించాయి. ఇందుకు కారణం ఒకే రోజు ముగ్గురు ఎంపీలు కదలి రావడం, ఓ మంత్రి, పార్టీ సీనియర్‌నాయకుడు సైతం మద్దతు ప్రకటించడం వెరసి ఆ శిబిరంలో ఆనందాన్ని నింపా యి. నామక్కల్ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్, తిరుప్పూర్ ఎంపీ సత్యభామా, తిరువణ్ణామలై ఎంపీ వనరోజా తమ మద్దతును ప్రకటించినానంతరం చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరంలో మరింత జోష్ నింపాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మినహా తక్కిన ఎంపీలు అందరూ పన్నీరు వెంట నడవడం ఖాయం అని వారు చేసిన వ్యాఖ్యలతో ఆ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. అలాగే, నిన్నటి వరకు చిన్నమ్మ వెంట ఉన్న విద్యాశాఖ మంత్రి పాండియరాజన్, పార్టీ సీనియర్ నాయకుడు పొన్నయ్యన్ సైతం పన్నీరుకు మద్దతుగా ముందుకు రావడం మహదానందమే. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లో పన్నీరు సమక్షంలో మద్దతు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారని పాండియరాజన్ చేసిన వ్యాఖ్యలు, కోటిన్నర మంది అన్నాడీఎంకే కేడర్ పన్నీరు వెంట నడవబోతున్నారన్న పొన్నయ్యన్ ప్రకటన ఆ శిబిరాన్ని ఆనందపు జల్లుల్లో ముంచింది. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తే, పన్నీరు నెగ్గడం ఖాయం అన్న ధీమాను వ్యక్తం చేసే మద్దతుదారుల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఎమ్మెల్యేలు తప్పకండా పన్నీరుకు అండగా నిలబడి తీరుతారని మాజీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తరలి వచిచ మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అభిమానతాకిడి క్రమంగా గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతుండడంతో ఆ పరిసరాల్లో భద్రతను మరింతగా పెంచారు. వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రోడ్డు కిక్కిరిసింది. ఇక, అమ్మ జయలలిత బాల్య మిత్రులు , స్కూల్ మెంట్స్ శ్రీమతి అయ్యంగార్, శాంతినీ పంకజ్, పదర్ సయ్యద్ సైతం పన్నీరుకే తమ ఓటు అని ఓ మీడియా ముందు ప్రకటించడాన్ని మద్దతుదారులు ఆహ్వానిస్తున్నారు. ఇక, చిన్నమ్మ శిబిరం నుంచి మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, కేటీ రాజేంద్ర బాలాజీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ జంప్ అయ్యారన్న సమాచారంతో, వారు తప్పకుండా తమ శిబిరంలోకి అడుగు పెడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. కాగా, పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదానిలయంను అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దాలన్న నినాదంతో పన్నీరుసెల్వం సంతకాల సేకరణకు శ్రీకారంచుట్టడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడానికి మద్దతుదారులు పరుగులు తీసే పనిలో పడ్డారు. సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం : పన్నీరు శిబిరాన్ని ఆనందం ఆవహిస్తే, చిన్నమ్మ శిబిరం సందిగ్ధంలో పడింది. జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుండడంతో పన్నీరు శిబిరం వైపుగా ఉత్కంఠతో ఎదురు చూసే చిన్నమ్మ సేనలు పెరుగుతున్నారు. ఆగమేఘాలపై చిన్నమ్మ కువత్తూరు క్యాంప్‌కు పరుగులు పెట్టడం, ఎమ్మెల్యేలతో సమాలోచన సాగించే పనిలో పడడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురుచూపుల్లో మద్దతుదారులు ఉన్నారు. గవర్నర్ తీరుపై చిన్నమ్మ ఆగ్రహాన్ని వ్యక్తంచేసి ఉండడం, తదుపరి తమ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడడంటూ ఆమె స్పందించి ఉన్న దృష్ట్యా, ఆదివారం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే. -
చిన్నమ్మ ఉపదేశం!
► ఎమ్మెల్యేలకు ఆంక్షలు ► మంత్రులకే అవకాశం ► తంబిదురైను అనుసరించాల్సిందే ► ఎంపీలకు హితవు సాక్షి, చెన్నై: పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చిన్నమ్మ శశికళ క్లాస్ పీకారు. అసెంబ్లీలో, పార్లమెంట్, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విధానాలపై ఉపదేశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇవ్వొద్దని, మంత్రులు మాత్రమే స్పందించాలని సూచించా రు. ఇక, ఢిల్లీలో పార్టీ సీనియర్ ఎంపీ తంబిదురైను అనుసరించి ఇతర ఎంపీలు ముందుకు సాగాలని సూచించడం గమనార్హం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం పార్టీ మీద పట్టు సాధించేందుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే కసరత్తులు చేస్తూ వస్తున్నారు. జిల్లాల వారీగా సమాలోచనలు ముగించిన చిన్నమ్మ ఇక, ఎంపీలు, ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో ఉంచుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీకొట్టేందుకు, రాష్ట్రంలోని తమ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఉభయ సభల్లో ఢీకొట్టే రీతిలో ఎంపీలను సిద్ధం చేస్తూ ప్రత్యేక క్లాసుతో ఉపదేశాలు ఇచ్చి ఉండడం గమనించాల్సిన విషయం. చిన్నమ్మ ఉపదేశం: పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకి చిన్నమ్మ నిర్ణయించారో లేదో, ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఆగమేఘాలపై శుక్రవారం సాయంత్రం చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం పన్నీరుసె ల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చిన్నమ్మకు ఎదురుగా కూర్చోక తప్పలేదు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ తో కలిసి ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రత్యేక క్లాసు తీసుకున్నారు. ప్రతి పక్షాలు సంధించే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇవ్వకూడదన్న ఆంక్షలు విధించి ఉండడం గమనార్హం. ఎలాంటి ప్రశ్నకైనా సరే, ఆధారాలు, పూర్తి వివరాలతో ప్రధాన ప్రతిపక్షం నోరు మూయించే విధంగా మంత్రులు అసెంబ్లీలో ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే, వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని, సమస్యల్ని తెలుసుకుని, ఆయా జిల్లాల మంత్రుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పార్టీ బలోపేతం లక్ష్యంగా శరవేగంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని, మంత్రులు ఎవరైనా, ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలపై దృష్టి సారించని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలన్న సూచనను సైతం చిన్నమ్మ ఇచ్చి ఉండడం గమనార్హం. సీఎం పన్నీరు సెల్వంతో పాటు 131 మంది ఎమ్మెల్యేలు, పార్టీలో ముఖ్యులుగా, చిన్నమ్మకు విధేయులుగా ఉన్న మాజీ మంత్రులు వలర్మతి, గోకులఇందిర సైతం ఈ సమావేశానికి హాజరు కావడం ఆలోచించదగ్గ విషయమే. ఈ సమావేశానంతరం వ్యాసార్పాడికి చెందిన అరుణ్, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తెకు జయశ్రీ అని, తిరువేర్కాడుకు చెందిన మరో దంపతుల కుమార్తెకు జయ సంధ్య అని పేరును చిన్నమ్మ పెట్టారు. తంబిదురైను అనుసరించాల్సిందే: సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ ముగించుకుని రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో పోయెస్ గార్డెన్ కు చేరుకున్న చిన్నమ్మ తదుపరి ఎంపీలతో భేటీ కావడం విశేషం. పార్టీ ఎంపీలు 50 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ సీనియర్ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సూచనల మేరకు ఢిల్లీలో ప్రతి ఎంపీ వ్యవహరించాలని ప్రత్యేకంగా క్లాసు పీకినట్టు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో పార్లమెంట్, రాజ్యసభల వేదికగా ఢీకొట్టేందుకు తగ్గ అ స్రా్తలను సైతం చిన్నమ్మ రచించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్, రాజ్యసభల్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన సమస్యలను, సందర్భానుచితంగా వ్యవహరించాల్సిన అంశాలను, ఇతర వ్యవహారాలపై చర్చించి, తంబిదురై డైరెక్షన్ ను అనుసరిస్తూ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో ముందుకు సాగాలన్న సూచనల్ని ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈనెల 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఎవరెవరు ఏఏ అంశాలపై ప్రశ్నలు సంధించాలన్న విషయాన్ని సైతం చిన్నమ్మే సూచించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, శనివారం చిన్నమ్మ శశికళ అపాయింట్మెంట్ కోసం పోయెస్ గార్డెన్ లో మేళ్ మరువత్తూరు ఆది పరాశక్తి ఆలయం వర్గాలు, ఎమ్మెల్యేల కరుణాష్తో పాటు, వివిధ జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే కార్యదర్శులు కుటుంబాలతో తరలిరావడం విశేషం. -
పరామర్శల హోరు
మెరుగ్గా కరుణ ఆరోగ్యం సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అలాగే, అధినేత ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన వద్దంటూ కేడర్‌కు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. శ్వాస సమస్య, గొంతు ఇన్ఫెక్ష¯ŒSతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మరో మారు ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఆసుపత్రి వర్గాలు తీవ్ర చికిత్స అందిస్తూ వచ్చాయి. నాలుగో రోజు ఆదివారం కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటిం చాయి. సహజరీతిలో శ్వాస తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజు ల్లో డిశ్చార్జ్ అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. కరుణ ఆరోగ్యం మెరుగుపడడంతో పార్టీ కార్యక్రమాలపై డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దృష్టి పెట్టారు. ఆదివారం నామక్కల్‌లో యువజన విభాగం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ అధినేత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు సూచించారు. ఇక, ఆ కార్యక్రమం వేదికగా యువత, విద్యార్థులు రాజకీయాల వైపు మొగ్గు చూపించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, వర్తక సమాఖ్య నేత విక్రమరాజా, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కాంగ్రెస్ నేతలు కేవీ తంగబాలు, కుమరి ఆనందన్, వ్యవసాయ సంఘం నేత పీఆర్.పాండియన్, దక్షిణ భారత నటీ నటుల సంఘం కార్యదర్శి విశాల్, హాస్య నటుడు వడివేలు పరామర్శించారు. ఆసుపత్రి ఆవరణలో కరుణ గారాల పట్టి కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత, కరుణ పెద్దకుమారుడు అళగిరిల వద్ద ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. వైద్యులతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియాతో నారాయణస్వామి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కరుణానిధి ప్రజాసేవకు మళ్లీ అంకితం కావాలని ఆకాంక్షించారు. వైద్యుల్ని సంప్రదించామని, రెండు, మూడు రోజుల్లో ఆయన ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ మాట్లాడుతూ ఆరోగ్యంగా కరుణానిధి ఉన్నారని, ప్రజలకు, డీఎంకేకు ఆయన సేవలు కొనసాగాలని, వంద శాతం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే తరఫున రాష్ట్ర మంత్రి జయకుమార్, ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆసుపత్రికి వచ్చి విచారించడం ఆరోగ్యకర, నాగరికతతో కూడిన రాజకీయ వాతావరణానికి నాందిగా డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఇందుకుగాను చిన్నమ్మ శశికళను అభినందించారు. ఇక, కరుణానిధిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఎండీఎంకే నేత వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న సమాచారంతో స్టాలిన్ విచారం వ్యక్తం చేయడాన్ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ఆహ్వానించారు. -
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి స్థానాన్ని దక్కించుకునేందుకు ఆధిపత్యపోరు మొదలైంది. ఒకవైపు శశికళ మద్దతు కూడగడుతుండగా మరోవైపు దివంగత జయలలిత మేనకోడలు దీపకు తమిళనాడు దక్షిణాది జిల్లాల నేతలు బాసటగా నిలుస్తున్నారు. శశికళకు పార్టీలోని దేవర్ సామాజిక వర్గం మద్దతు పలుకుతుండగా, నాడార్లు అవకాశం కోసం చూస్తున్నారు. తంబిదురై నేతృత్వంలో 49 మంది పార్టీ ఎంపీలు మంగళవారం శశికళను కలిసి సంఘీభావం తెలిపారు. 21న పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించండి..: దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అపోలో ఆసుపత్రిని ప్రతివాదులుగా చేర్చింది. ఆమె ఆసుపత్రిలో ఉన్న కాలంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ జరపాలని కోరింది. -
చిన్నమ్మే వారసురాలు..!
-
చిన్నమ్మే వారసురాలు!
- ప్రధాన కార్యదర్శి పదవికి శశికళే అర్హురాలన్న సెల్వం - ఆమెకు మద్దతుగా నిలుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేదెవరోనని పార్టీ కేడర్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ‘అమ్మ’ రాజకీయ వారసురాలు చిన్నమ్మ శశికళే నని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశారుు. తమిళ నాడు సీఎం పన్నీరుసెల్వం, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు నేతలందరూ తమకిక చిన్నమ్మే దిక్కని ముక్తకంఠంతో ప్రకటించారు. సీఎం పన్నీరు సెల్వం, మంత్రుల బృందం ఆదివారం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని శశికళతో సమావేశమయ్యారు. చిన్నమ్మే ప్రధానకార్యదర్శి పగ్గాలు చేప ట్టాలని 31 మంది మంత్రులు మద్దతు పలకడమేగాక, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సమావేశానంతరం మీడియా ముందుకొచ్చిన మంత్రులు అమ్మకు నీడగా ఉన్న శశికళకు పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు శశికళకున్నాయని సీఎం పన్నీరుసెల్వం తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘అమ్మ’కు ఎదురైన కష్టనష్టాల్లో పాలు పంచుకున్న చిన్నమ్మకు మద్దతుగా ఐక్యతతో అందరం ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కొన్నిచోట్ల కేడర్ నుంచి ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శశికళకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకొచ్చి మరీ తమ నిరసన తెలుపుతున్నారు. మెరీనాకు పోటెత్తిన జనం ఆదివారం సెలవుదినం కావడంతో ఇక్కడి మెరీనా తీరంలోని ‘అమ్మ’ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి వి.జయరామన్, మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్.పి. వేలుమణితో పాటు 500 మంది అన్నాడీఎంకే సభ్యులు ఆదివారం గుండు గీరుుంచుకుని తమ విధేయత చాటుకున్నారు. సినీ నటి త్రిష ఆదివారం ఉదయాన్నే తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి జయలలిత సమాధిని దర్శించుకుని నివాళి ఘటించారు. ఇదిలావుంటే.. జయలలిత మృతిని తట్టుకోలేక షాక్‌తో ఇంత వరకూ 470 మంది మరణించారని అన్నాడీఎంకే ఆదివారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పేర్కొంది. -
అమ్మ చెప్పింది.. చిన్నమ్మే వారసురాలు!
శశికళను స్వయంగా జయలలిత గుర్తించారు: తంబిదురై కోయంబత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు ఎవరు, ఆమె స్థానంలో అధికార అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతాంటే.. ఆమె నిచ్చెలి శశికళ పేరు వినిపిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు సీఎం ఓ పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళను కోరగా.. తాజాగా మరో సీనియర్ నాయకుడు కూడా వారితో గొంతు కలిపారు. అన్నాడీఎంకేలో బలమైన నేతగా పేరొందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై కూడా చిన్నమ్మ శశికళకే ఓటేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నమ్మ కు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని పేర్కొన్నారు. 'చిన్నమ్మ అమ్మ (జయలలిత)తో కలిసి 35 ఏళ్లు గడిపారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. రాజకీయ విరోధం కారణంగా ఆమెపై నకిలీ కేసులు నమోదుచేశారు. జైలుకు కూడా పంపారు. ఎన్నో ముప్పుల నుంచి అమ్మను చిన్నమ్మ కాపాడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో అమ్మకు సలహాలు ఇచ్చింది' అని తంబిదురై అన్నారు. చిన్నమ్మ సలహాల ప్రకారం నడుచుకోవాలని జయలలిత తనకు ఎన్నోసార్లు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ‘జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ‘పురచ్చితలైవీ అమ్మ’ అని పిలిచేవారు. శశికళ అమ్మతో చాలాకాలంగా ఉండటంతో మేం ఆమెని ‘చిన్నమ్మ’ అని పిలిచేవాళ్లం. దీనిని అమ్మ గుర్తించడమే కాదు ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. అన్నాడీఎంకే వారసురాలు చిన్నమేనని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని తంబిదురై పేర్కొన్నారు. -
రూ.3వేల కోట్లు ప్లీజ్
► కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీల వేడుకోలు ► సహకారం కోసం వినతి ► సీఎం జయలలిత ఆదేశం సాక్షి, చెన్నై: తమిళనాడు సహకార సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో ఆగిన సేవల పునరుద్ధరణకు రూ.3 వేల కోట్లను కేటారుుంచాలని కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. తమ అమ్మ జయలలిత ఆదేశాల మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. రూ.500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా, కేంద్ర సహకార సంఘాల పరిధిలోని బ్యాం కుల్లో సేవలు నిలిచిపోరుున విషయం తెలిసిందే. రైతు సంక్షేమం లక్ష్యంగా, గ్రామీణ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ బ్యాంకుల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నల్లధనం కట్టడి నిర్ణయం ఇరకాటంలో పడేసింది. ఈ బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచిపోయారుు. ఈ సేవల పునరుద్ధరణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులకు నగదు మార్పిడి, రుణాల పంపిణీ, బకారుుల వసూళ్లకు తగ్గ సేవలు చేపట్టాలంటే, కొత్త నోట్లు తప్పనిసరి అయ్యారుు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీల బృందం ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సహకార సంస్థలు, సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో ఆగిన సేవలు, ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ వినతి పత్రంలో పొందుపరిచారు. తమిళనాడులో 23 కేంద్ర సహకార బ్యాంకులు, 32 జిల్లా సహకార బ్యాంకులు, 4,480 ప్రాథమిక పరపతి సంఘాలు ఉన్నట్టు వివరించారు. ఎన్నికల వాగ్దానం మేరకు సహకారం సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ. 5,780 కోట్ల రుణాల్ని మాఫీ చేశారని వివరించారు. కావేరి డెల్టా రైతుల సంక్షేమార్థం ప్రస్తుతం రూ.64 కోట్లను ప్రకటించారని పేర్కొన్నారు. ఈ సహకార సంస్థల ద్వారా సాగుతున్న రైతు అభ్యున్నతిని కాంక్షించే రుణాల పంపిణీ ప్రస్తుతం ఆగిపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా సేవలు నిలిచిపోయాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా, కేంద్ర సహకార సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో నిలిచిపోరుున సేవలను పునరుద్ధరించాలంటే, రూ.3 వేల కోట్ల మేరకు కొత్త నోట్లు అవసరం అని పేర్కొన్నారు. ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవడంతో పాటుగా, డిపాజిట్లు, రుణాల చెల్లింపులకు పాత నోట్లను స్వీకరించేందుకు తగ్గ అనుమతులు ఇవ్వాలని, బీమా చెల్లింపులు చెక్కుల రూపంలో జారీకి తగ్గ చర్యలకు అవకాశం కల్పించాలని విన్నవించారు. ఇలా ఉండగా అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో ఆర్థిక మంత్రితో భేటీ అయ్యేందుకు ముందుగా రైతులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. ఆ మేరకు ప్రాథమిక సహకార బ్యాంకుల్లో సభ్యులుగా ఉన్న వాళ్ల పేరిట జిల్లా, కేంద్ర సహకర బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం మేరకు జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల ఖాతాల్లో నగదు బదిలీ తదితర వ్యవహారాలకు తగిన నమోదులు సాగే విధంగా చర్యలకు అధికారుల్ని ఆదేశించారు -
కూలీల కాల్చివేతపై సీబీఐ విచారణ జరపాలి
లోక్‌సభలో కేంద్రానికి డిప్యూటీ స్పీకర్ తంబిదురై డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మంది తమిళ కూలీలను దారుణంగా కాల్చి చంపారని.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం.తంబిదురై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘చనిపోయినవారంతా గిరిజనులు. నిరాయుధులు. ఇది అంతర్రాష్ట్ర సమస్య. తమిళనాడుకు చెందిన 20 మందిని ఊచకోత కోశారు. కేంద్ర హోంమంత్రి ఇక్కడే ఉన్నారు. వారు దీనిపై సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి. సీబీఐ విచారణ జరిపిస్తున్నారో లేదో స్పష్టం చేయాలి...’’ అని ప్రశ్నించారు. తరువాత 377 నిబంధన కింద రామంతపురం ఎంపీ ఎ.అన్వర్ రజా మాట్లాడుతూ శేషాచలం సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారంతా నిరుపేదలేనని, కేంద్రం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అంతకుముందు.. ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ (కేరళ) ఇ.అహ్మద్ శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది కూలీల మరణంతో పాటు, తెలంగాణలో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు పోలీసు కాల్పుల్లో మృతిచెందిన ఘటనను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘దేశంలో కొన్ని వర్గాల ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అభాగ్యుల మొర విన్నవించేందుకు పార్లమెంటు మినహా మరే వేదికా లేకపోవడంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నా. జరగిన సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తెలంగాణలో పోలీసుల చేతిలో మృతిచెందిన వారు కేసుల్లో ఉండి ఉండొచ్చు. కానీ పోలీసు కస్టడీలో ఉన్నవారిని చంపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలా అమాయకులను చంపడం సిగ్గుపడాల్సిన చర్య. ప్రజలు జ్యుడిషియల్ విచారణ గానీ, సీబీఐ విచారణ గానీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు నిజంగా నేరం చేసినా ఇలా ఎలా చంపేస్తారు? ఏ పార్టీ పాలిస్తుందన్నది కాదు ఇక్కడ. రాముడు పాలిస్తున్నాడా? రావణుడు పాలిస్తున్నాడా? అన్నది ముఖ్యం కాదు. మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోంది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి...’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీల ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, జాయిస్ జార్జి, డాక్టర్ ఎ.సంపత్, పి.కె.బిజు, ఎం.బి.రాజేశ్, శంకర్‌ప్రసాద్ దత్తలు.. తాము అహ్మద్ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్టు స్పీకర్‌కు తెలిపారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభలో నేరుగా ఈ అంశాన్ని లేవనెత్తటం పట్ల స్పీకర్ సుమిత్రామహాజన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడాలనుకుంటే తనను అడగవచ్చని, నేరుగా హోంమంత్రితో మాట్లాడరాదని పేర్కొన్నారు. ఆ తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘ఎన్కౌంటర్ల’పై ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రం నివేదికలు కోరిందని.. సమాధానం వచ్చాక సభ్యులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఆయన సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.