పన్నీర్ జోష్
► ఆనందోత్సాహాల్లో మద్దతుదారులు
► గ్రీన్ వేస్ రోడ్డులో అభిమాన తాకిడి
► సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం
ఆపద్ధర్మ సీఎం పన్నీరు శిబిరం ఆనందోత్సాహాలతో మునిగింది. బల నిరూపణకు చాన్స్ ఇస్తే, నెగ్గి తీరుతామన్న ధీమా మద్దతుదారుల్లో పెరిగింది. పన్నీరుకు మద్దతుగా ఎంపీలు, ఓ మంత్రి తమ శిబిరంలోకి చేరడంతో, బలం మరింత పెరగడం ఖాయం అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ వేస్ రోడ్డుకు అభిమాన తాకిడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుతున్నాయి.
సాక్షి, చెన్నై : సీఎం కుర్చీకోసం చిన్నమ్మ శశికళ, పన్నీరుసెల్వం మధ్య సాగుతున్న సమరంలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ఎత్తుగ డలో నువ్వా..నేనా అన్నట్టుగా ఇరువురూ ముం దుకు దూసుకెళుతున్నారు. ఈ సమయంలో శనివా రం పన్నీరుసెల్వం శిబిరాన్ని ఆనందకర క్షణాలు మెండుగా ఆవహించాయి. ఇందుకు కారణం ఒకే రోజు ముగ్గురు ఎంపీలు కదలి రావడం, ఓ మంత్రి, పార్టీ సీనియర్‌నాయకుడు సైతం మద్దతు ప్రకటించడం వెరసి ఆ శిబిరంలో ఆనందాన్ని నింపా యి. నామక్కల్ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్, తిరుప్పూర్ ఎంపీ సత్యభామా, తిరువణ్ణామలై ఎంపీ వనరోజా తమ మద్దతును ప్రకటించినానంతరం చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరంలో మరింత జోష్ నింపాయి.
పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మినహా తక్కిన ఎంపీలు అందరూ పన్నీరు వెంట నడవడం ఖాయం అని వారు చేసిన వ్యాఖ్యలతో ఆ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. అలాగే, నిన్నటి వరకు చిన్నమ్మ వెంట ఉన్న విద్యాశాఖ మంత్రి పాండియరాజన్, పార్టీ సీనియర్ నాయకుడు పొన్నయ్యన్ సైతం పన్నీరుకు మద్దతుగా ముందుకు రావడం మహదానందమే. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లో పన్నీరు సమక్షంలో మద్దతు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారని పాండియరాజన్ చేసిన వ్యాఖ్యలు, కోటిన్నర మంది అన్నాడీఎంకే కేడర్ పన్నీరు వెంట నడవబోతున్నారన్న పొన్నయ్యన్ ప్రకటన ఆ శిబిరాన్ని ఆనందపు జల్లుల్లో ముంచింది. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తే, పన్నీరు నెగ్గడం ఖాయం అన్న ధీమాను వ్యక్తం చేసే మద్దతుదారుల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.
ఎమ్మెల్యేలు తప్పకండా పన్నీరుకు అండగా నిలబడి తీరుతారని మాజీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తరలి వచిచ మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అభిమానతాకిడి క్రమంగా గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతుండడంతో ఆ పరిసరాల్లో భద్రతను మరింతగా పెంచారు. వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రోడ్డు కిక్కిరిసింది. ఇక, అమ్మ జయలలిత బాల్య మిత్రులు , స్కూల్ మెంట్స్ శ్రీమతి అయ్యంగార్, శాంతినీ పంకజ్, పదర్ సయ్యద్ సైతం పన్నీరుకే తమ ఓటు అని ఓ మీడియా ముందు ప్రకటించడాన్ని మద్దతుదారులు ఆహ్వానిస్తున్నారు.
ఇక, చిన్నమ్మ శిబిరం నుంచి మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, కేటీ రాజేంద్ర బాలాజీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ జంప్ అయ్యారన్న సమాచారంతో, వారు తప్పకుండా తమ శిబిరంలోకి అడుగు పెడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. కాగా, పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదానిలయంను అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దాలన్న నినాదంతో పన్నీరుసెల్వం సంతకాల సేకరణకు శ్రీకారంచుట్టడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడానికి మద్దతుదారులు పరుగులు తీసే పనిలో పడ్డారు.
సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం : పన్నీరు శిబిరాన్ని ఆనందం ఆవహిస్తే, చిన్నమ్మ శిబిరం సందిగ్ధంలో పడింది. జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుండడంతో పన్నీరు శిబిరం వైపుగా ఉత్కంఠతో ఎదురు చూసే చిన్నమ్మ సేనలు పెరుగుతున్నారు. ఆగమేఘాలపై చిన్నమ్మ కువత్తూరు క్యాంప్‌కు పరుగులు పెట్టడం, ఎమ్మెల్యేలతో సమాలోచన సాగించే పనిలో పడడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురుచూపుల్లో మద్దతుదారులు ఉన్నారు. గవర్నర్ తీరుపై చిన్నమ్మ ఆగ్రహాన్ని వ్యక్తంచేసి ఉండడం, తదుపరి తమ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడడంటూ ఆమె స్పందించి ఉన్న దృష్ట్యా, ఆదివారం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.