
పెరంబూరు: నటులు నటనతో సరిపెట్టుకోవాలని పార్లమెంట్ డిప్యూటీ స్వీకర్ తంబిదురై చురకలు వేశారు. కరూర్ సమీపంలోని ఎన్ పుత్తూర్, అన్నానగర్, సెవందియాపట్టి ప్రాంతాల్లో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తంబిదురై, మంత్రి ఎంఆర్.విజయభాస్కర్‌లు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు తమ బాధ్యతలను సరిగా నిర్వహించకపోవడం వల్లే నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరి అడగ్గా రాజకీయవాదుల ప్రశ్నలకే బదులివ్వడం జరుగుతుందని, నటులు నటనతో సనిపెట్టుకోవాలని, వారి వ్యాఖ్యలకు బదులివ్వాల్సిన అవసరం లేదని తంబిదురై అన్నారు. కడైమడై ప్రాంతాలకు నీరు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్న విషయానికి డిప్యూటీ స్వీకర్ స్పందిస్తూ ఆరోపణలు ఎవరైనా చేయవచ్చునని, అయితే ప్రజాపనుల శాఖ బాధ్యతలు నిర్వమిస్తున్న ముఖ్యమంత్రినే అందుకు రైతులకు నీరు అందిస్తున్నట్లు చెప్పారని అన్నారు.