
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి స్థానాన్ని దక్కించుకునేందుకు ఆధిపత్యపోరు మొదలైంది. ఒకవైపు శశికళ మద్దతు కూడగడుతుండగా మరోవైపు దివంగత జయలలిత మేనకోడలు దీపకు తమిళనాడు దక్షిణాది జిల్లాల నేతలు బాసటగా నిలుస్తున్నారు. శశికళకు పార్టీలోని దేవర్ సామాజిక వర్గం మద్దతు పలుకుతుండగా, నాడార్లు అవకాశం కోసం చూస్తున్నారు.
తంబిదురై నేతృత్వంలో 49 మంది పార్టీ ఎంపీలు మంగళవారం శశికళను కలిసి సంఘీభావం తెలిపారు. 21న పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది.
జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించండి..: దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అపోలో ఆసుపత్రిని ప్రతివాదులుగా చేర్చింది. ఆమె ఆసుపత్రిలో ఉన్న కాలంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ జరపాలని కోరింది.