
మాటల తూటాలు
► స్వరం పెంచిన శిబిరాలు
► పన్నీరు వైపు 12 మంది మంత్రులు
► 32 మంది ఎమ్మెల్యేలు
► సెమ్మలై వ్యాఖ్యతో పళని శిబిరంలో చర్చ
► పన్నీరు మునిగే నావ.. జయకుమార్
► ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ: ఎంపీ తంబిదురై
సాక్షి, చెన్నై : సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు శిబిరాలు స్వరం పెంచి సై...అంటే సై..అన్నట్టుగా విమర్శల దాడిలో మునిగాయి. తమ వైపు వచ్చేందుకు 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై తూటా పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, పన్నీరు ఓ మునిగే నావ అని, చిల్లులు పడ్డ ఆ నావలోకి ఎక్కేవాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమని పళని శిబిరం మంత్రి జయకుమార్ స్వరం పెంచడం గమనార్హం.
అన్నాడీఎంకేలో ఏకమయ్యే విషయంగా సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఇప్పట్లో నిర్ణయాలు తీసుకోవడం అనుమానమే. అదిగో...ఇదిగో చర్చలు అంటూ ఇన్నాళ్లు కాలయాపన సాగింది. ఇప్పుడు ఆ ఊసే లేదు. రెండు రోజుల క్రితం పన్నీరుసెల్వం కాస్త దూకుడు పెంచి స్థానిక సమరానికి ముందే అసెంబ్లీకి ఎన్నికలు తథ్యం అని సంచలన ప్రకటన చేసి చర్చకు తెర లేపారు. ఇక, సోమవారం పన్నీరు శిబిరానికి చెందిన మాజీ మంత్రి కే మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ చర్చల విషయంగా ఇద్దరు మంత్రులు అడ్డు పడుతున్నారని తీవ్రంగా విరుచుకు పడ్డారు.ఆ ఇద్దరు పేర్లను సైతం ప్రకటించారు. ఇది కాస్త ఆ మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, జయకుమార్‌లకు పుండుమీద కారం చల్లినట్టు అయింది.
అదే సమయంలో ఈ పుండు మీద మరింత కారం చల్లే రీతిలో పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై కొత్త బాంబును పేల్చారు. తమ వైపుగా 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు చూస్తున్నారని, పన్నీరు సెల్వం సీఎం పదవి చేపట్టాలన్న కాంక్షతో వాళ్లు ఉన్నట్టు వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, శశికళకు పదవీ ఆశ, దినకరన్‌కు డబ్బు ఆశ మరీ ఎక్కువేనని శివాలెత్తారు.అందుకే ఒకరు పరప్పన అగ్రహారం, మరొకరు తీహార్ జైలుకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. తమకు ఏ ఆశ లేదని అందుకే ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని, కేడర్ తమ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సెమ్మలై వ్యాఖ్యలతో పళని శిబిరం స్వరం పెంచే వాళ్లు పెరిగారు.
పన్నీరు మునిగే నావ: పళని శిబిరం మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు ఓ మునిగే నావ అని ధ్వజమెత్తారు. ఇప్పటికే అందులో చిల్లులు మరీ ఎక్కువయ్యాయని, అందులో ఎక్కిన వాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమన్నారు. చిల్లుల్ని ఉప్పుతో పూడ్చినట్టుగా సెమ్మలై వ్యాఖ్యలు ఉన్నాయని విరుచుకు పడ్డారు. చర్చలకు రమ్మంటే, తమ మీద నిందల్ని వేస్తూ, అబద్దాల కోరు అని నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఇక, ఆ శిబిరానికి చెందిన అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అన్భళగన్ పేర్కొంటూ, తామరలోకి రెండాకుల్ని ఇమడ్చడానికి పన్నీరు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబి దురై పేర్కొంటూ, పన్నీరు చెప్పినట్టుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. చర్చలు సామరస్యంగా సాగాలన్నదే తన అభిమతం అని, అయితే, పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. ఇక, మరో మంత్రి కామరాజ్ అయితే, మరో అడుగు ముందుకు వేసి, పన్నీరు సీఎంగా ఉన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సాగించిన అవినీతి బండారం ఇప్పుడు తెరమీదకు వచ్చి తమ మెడకు చుట్టుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిని పరిచయం చేసింది, తెర మీదకు తెచ్చింది పన్నీరుసెల్వమేనని ఆయన ఆరోపిస్తున్నారు.