అమ్మ చెప్పింది.. చిన్నమ్మే వారసురాలు!
శశికళను స్వయంగా జయలలిత గుర్తించారు: తంబిదురై
కోయంబత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు ఎవరు, ఆమె స్థానంలో అధికార అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతాంటే.. ఆమె నిచ్చెలి శశికళ పేరు వినిపిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు సీఎం ఓ పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళను కోరగా.. తాజాగా మరో సీనియర్ నాయకుడు కూడా వారితో గొంతు కలిపారు. అన్నాడీఎంకేలో బలమైన నేతగా పేరొందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై కూడా చిన్నమ్మ శశికళకే ఓటేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నమ్మ కు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని పేర్కొన్నారు.
'చిన్నమ్మ అమ్మ (జయలలిత)తో కలిసి 35 ఏళ్లు గడిపారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. రాజకీయ విరోధం కారణంగా ఆమెపై నకిలీ కేసులు నమోదుచేశారు. జైలుకు కూడా పంపారు. ఎన్నో ముప్పుల నుంచి అమ్మను చిన్నమ్మ కాపాడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో అమ్మకు సలహాలు ఇచ్చింది' అని తంబిదురై అన్నారు. చిన్నమ్మ సలహాల ప్రకారం నడుచుకోవాలని జయలలిత తనకు ఎన్నోసార్లు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ‘జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ‘పురచ్చితలైవీ అమ్మ’ అని పిలిచేవారు. శశికళ అమ్మతో చాలాకాలంగా ఉండటంతో మేం ఆమెని ‘చిన్నమ్మ’ అని పిలిచేవాళ్లం. దీనిని అమ్మ గుర్తించడమే కాదు ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. అన్నాడీఎంకే వారసురాలు చిన్నమేనని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని తంబిదురై పేర్కొన్నారు.