చిన్నమ్మే వారసురాలు!
- ప్రధాన కార్యదర్శి పదవికి శశికళే అర్హురాలన్న సెల్వం
- ఆమెకు మద్దతుగా నిలుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేదెవరోనని పార్టీ కేడర్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ‘అమ్మ’ రాజకీయ వారసురాలు చిన్నమ్మ శశికళే నని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశారుు. తమిళ నాడు సీఎం పన్నీరుసెల్వం, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు నేతలందరూ తమకిక చిన్నమ్మే దిక్కని ముక్తకంఠంతో ప్రకటించారు. సీఎం పన్నీరు సెల్వం, మంత్రుల బృందం ఆదివారం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని శశికళతో సమావేశమయ్యారు. చిన్నమ్మే ప్రధానకార్యదర్శి పగ్గాలు చేప ట్టాలని 31 మంది మంత్రులు మద్దతు పలకడమేగాక, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
సమావేశానంతరం మీడియా ముందుకొచ్చిన మంత్రులు అమ్మకు నీడగా ఉన్న శశికళకు పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు శశికళకున్నాయని సీఎం పన్నీరుసెల్వం తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘అమ్మ’కు ఎదురైన కష్టనష్టాల్లో పాలు పంచుకున్న చిన్నమ్మకు మద్దతుగా ఐక్యతతో అందరం ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కొన్నిచోట్ల కేడర్ నుంచి ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శశికళకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకొచ్చి మరీ తమ నిరసన తెలుపుతున్నారు.
మెరీనాకు పోటెత్తిన జనం
ఆదివారం సెలవుదినం కావడంతో ఇక్కడి మెరీనా తీరంలోని ‘అమ్మ’ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి వి.జయరామన్, మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్.పి. వేలుమణితో పాటు 500 మంది అన్నాడీఎంకే సభ్యులు ఆదివారం గుండు గీరుుంచుకుని తమ విధేయత చాటుకున్నారు. సినీ నటి త్రిష ఆదివారం ఉదయాన్నే తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి జయలలిత సమాధిని దర్శించుకుని నివాళి ఘటించారు. ఇదిలావుంటే.. జయలలిత మృతిని తట్టుకోలేక షాక్‌తో ఇంత వరకూ 470 మంది మరణించారని అన్నాడీఎంకే ఆదివారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పేర్కొంది.