ఇక చిన్నమ్మ సేన
సాక్షి, చెన్నై : అమ్మ సేనలు అన్న పేరు మరుగున పడి, ఇక చిన్నమ్మ సేన తెర మీదకు రానుంది. అమ్మ జయలలిత రాజకీయ వారసురాలు శశికళ అన్న విషయాన్ని పార్టీ పెద్దలు తేల్చడంతో అభిమానాన్ని చాటుకునే పనిలో అత్యుత్సాహం ప్రదర్శించడంలో సేనలు దూసుకెళుతున్నారు. చిన్నమ్మ ఫొటోలు, పేర్లతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఏ మేరకు ద్వితీయ, తృతీయశ్రేణి కేడర్ ఉత్సాహాన్ని చూపుతున్నదో అదే స్థాయిలో వ్యతిరేకత అనేక చోట్ల వ్యక్తం అవుతోంది. పురట్చితలైవి జయలలిత మీద అన్నాడీఎంకే వర్గాలకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మరణం ఆ పార్టీ వర్గాలకు తీరని లోటే. అందుకే ఆ లోటును చిన్నమ్మ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. నాయకులు ఎందరో ఉన్నా, పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం సాగించేంత కీలక వ్యక్తి అన్నాడీఎంకేలో లేరు. ఈ దృష్ట్యా, జయలలితకు నీడలా ఉంటూ, ఆమె కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పోయెస్ గార్డెన్ వేదికగా రాజకీయ వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్న చిన్నమ్మే ఇక, తమకు అమ్మ అన్న నిర్ణయానికి అన్నాడీఎంకే పెద్దలు వచ్చేశారు. చిన్నమ్మే దిక్కు అంటూ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
సోమవారం అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నగర, పట్టణ, గ్రామ కమిటీల కార్యదర్శులు పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు చిన్నమ్మా...పగ్గాలు చేపట్టమ్మా అంటూ వేడుకుంటుంటే, జిల్లా మొదలు గ్రామ స్థారుు నాయకులు ఇక చిన్నమ్మే....తమ అమ్మా అని చాటుకునే విధంగా పరుగులు తీయడానికి సిద్ధం అవుతుండడం గమనార్హం. సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులు, ఎంపీలు అందరూ చిన్నమ్మే ఇక అమ్మ రాజకీయ వారసురాలు అని స్పష్టం చేయడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ ఉత్సాహాన్ని, అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. పత్రికల్లో చిన్నమ్మకు ఆహ్వానం పలికే రీతిలో ప్రకటనల్ని హోరెత్తిస్తున్నారు.
ఇన్నాళ్లు అమ్మ సేనలం అని చెప్పకుంటున్న వాళ్లు, ఇక ఆ పేరును తెర మరుగు చేసి చిన్నమ్మ సేనలుగా తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక, ఎంజీఆర్, జయలలిత తదుపరి, చిన్నమ్మే అంటూ వారి ముఖ చిత్రాలతో ఫ్లెక్సీలను హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అమ్మ మార్గంలో మా చిన్నమ్మా...!, నాడు...నేడు..రేపు , భూమి ఉన్నంత వరకు అమ్మే..! అన్న నినాదాలతో ఈ హోర్డింగ్‌లు హోరెత్తుతున్నాయి. ఇన్నాళ్లు జయలలిత హోర్డింగ్‌లు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండడంతో, వాటిని తొలగించడం లక్ష్యంగా కోర్టులో పెద్ద సమరమే చేసిన ఘనత సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి దక్కుతుంది. ఇక, చిన్నమ్మ ఫ్లెక్సీల భరతం పట్టే విధంగా ట్రాఫిక్ ఉరకలు తీసినా తీయొచ్చేమో...!. కాగా, కొందరు చిన్నమ్మ మీద భక్తిని చాటుకునే విధంగా పరుగులు తీస్తుంటే, అదే స్థాయిలో మరెందరో తమ అమ్మ స్థానంలో మరొకర్ని సహించబోమన్నట్టుగా నిరసనలు వ్యక్తం చేస్తుండడం ఆలోచించాల్సిందే. మెజారిటీ శాతం చిన్నమ్మకు మద్దతుగా పెద్దల పయనం సాగుతున్నా, కింది స్థాయి కేడర్‌లో మాత్రం ఆ స్పందన కరువైనట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. కొందరు అయితే, చిన్నమ్మకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకు వస్తుండడం కొసమెరుపు.
చిన్నమ్మకు వ్యతిరేకత : చిన్నమ్మకు వ్యతిరేకంగా పుదుచ్చేరి అన్నాడీఎంకే సీనియర్, మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్ గళం విప్పారు. అమ్మ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్న విషయాన్ని మరచి, ప్రస్తుతం నాయకుల తీరు ఉన్నదని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శిగా మరొకర్ని నియమించడానికి వీలు లేదని, అమ్మే ఆ పదవికి శాశ్వతం అని పేర్కొన్నారు. మరొకర్ని ఆ పదవిలో నియమిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, శశికళను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే ప్రయత్నాలను ఖండించారు. ఆ పదవికి ఆమె అనర్హురాలుగా వ్యాఖ్యానించారు. అలాగే, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, శశికళ పగ్గాలు చేపట్టిన పక్షంలో అన్నాడీఎంకే రెండుగా చీలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు అమ్మ జయలలితకు కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చిన సేనలు, ప్రస్తుతం చిన్నమ్మ కాళ్ల మీద పడే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో పలువురు నేతల సాష్టాంగ నమస్కారాల వీడియో వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి.