
సాక్షి, చెన్నై : కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వరుస ఆరోపణలతో సతమతమౌతున్న బీజేపీ ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ ఎదురైంది. తమ డిమాండ్లపై స్పందించకపోతే అవిశ్వాసానికి రెడీ అంటూ ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఇప్పటికే లోక్‌సభలో ఏపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీల వరుస అవిశ్వాస తీర్మానాలతో సతమతమౌతున్న బీజేపీకి ఇది ఊహించని దెబ్బే. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేక ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమో నిర్ణయిస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఘాటుగా స్పందించారు.