మంగళవారం పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం కూడా అనుమతించలేదు. వరుసగా ఏడోసారీ సభ సజావుగా లేదన్న కారణాన్ని చూపారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, టీడీపీ నుంచి తోట నర్సింహం, కేశినేని నాని, కింజారపు రామ్మోహన్‌నాయుడు, జయదేవ్ గల్లా, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం నుంచి పి.కరుణాకరన్, మహ్మద్ సలీం, ఆర్‌ఎస్‌పీ నుంచి ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి పీకే కున్‌హలికుట్టి, కేరళ కాంగ్రెస్ నుంచి జోస్ కె.మణి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను సభాపతి మధ్యాహ్నం 12.07 గంటలకు ప్రస్తావించారు. అంతకుముందు కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల బలం అవసరం.
ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మేం చర్చ నుంచి పారిపోవడంలేదు. చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’.. అని చెప్పారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకుంటూ.. ‘మోదీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. మాకు సభలో విశ్వాసం ఉంది. బయటా విశ్వాసం ఉంది. అవిశ్వాస తీర్మానం ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిపోయింది. ఒక చిన్న పార్టీగా మారిపోయింది. ఖర్గే దీనిపై అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది’.. అని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాలను సభాపతి ప్రస్తావిస్తున్న సందర్భంలో పోడియం వద్ద ఏఐఏడీఎంకే సభ్యులు కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో సభాపతి .. ‘అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాలంటే అందుకు అవసరమైన 50 మంది సభ్యుల బలాన్ని లెక్కించేందుకు సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించాలో లేదో నిర్ణయించగలను. అందువల్ల సభ్యులు తమ తమ స్థానాలకు వెళ్లాలి’.. అని కోరారు.
సభ్యుల సంఖ్యనూ పట్టించుకోని స్పీకర్
అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, జేఎంఎం, సీపీఐ, ఎంఐఎం, ఆర్‌ఎస్ పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, తదితర పార్టీల సభ్యులందరూ లేచి నిల్చున్నా రు. తీర్మానం ప్రవేశపెట్టేందుకు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య 50 కంటే ఎక్కువగా ఉందని చెప్పేందుకు వీలుగా విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో లేచి నిలబడి తమ మద్దతు సంఖ్యను ప్లకార్డు ద్వారా ప్రదర్శించారు. ఒకటి నుంచి మొదలుకొని వందకు పైగా నెంబర్లను ఒకొక్క సభ్యుడు ప్రదర్శించారు. అయినా, సభాపతి పట్టించుకోలేదు. సభ సజావుగా లేనందున సభ్యుల మద్దతును లెక్కించలేకపోతు న్నానంటూ అవిశ్వాస తీర్మానాలను అనుమతించకుండానే సభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, వాయిదా అనంతరం సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్.. ఏఐఏడీఎంకే–బీజేపీ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని వ్యాఖ్యానించడం తో ఏఐఏడీఎంకే సభ్యులు కాంగ్రెస్ సభ్యుల వైపు దూసుకెళ్లారు. ఈ సందర్భంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఏఐఏడీఎంకే సభ్యులను నిలువరించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో వివిధ పార్టీల సీనియర్ నేతలు వచ్చి బుజ్జగించడంతో ఏఐఏడీఎంకే సభ్యులు శాంతించారు.
ఎనిమిదోసారి వైఎస్సార్‌సీపీ నోటీసులు
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభాపతి అనుమతించని నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఎనిమిదోసారి నోటీసులు ఇచ్చారు. బుధవారం నాటి సభా కార్యక్ర మాల జాబితాలో అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కోరారు. అలాగే, అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ సభ్యులు సభాపతి సుమిత్రా మహాజన్‌ను ఆమె కార్యాలయం లో కలిసి వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఆందోళన
అంతకుముందు.. ఉ.10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాద రావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. హోదా వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని, పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడితే తాము రాజీనామా చేస్తామని చెప్పారు. టీడీపీ సభ్యులు తమతోపాటు రాజీనామా చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
రాజ్యసభలోనూ అంతే..
మరోవైపు.. రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక్కడ 40మంది సభ్యులు రిటైరవుతున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు అవకాశం చిక్కలేదు. వీరి అనుభవాలు తెలుసుకుని, వారు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపేందుకు వీలుగా సభకు సహకరించాలని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు కోరారు. అయినప్పటికీ, కావేరీ అంశంపై ఇక్కడా ఏఐఏడీఎంకే సభ్యులు సభకు అంతరాయం కల్గించారు. దీంతో చైర్మన్ జోక్యం చేసుకుని.. రిటైరవుతున్న సభ్యులపట్ల కనీస మర్యాద లేదన్నారు. ‘మనం నిస్సహాయులమా’.. అని ఆయన కాంగ్రెస్ పక్ష నేత గులామ్‌నబీ ఆజాద్, బీజేపీ నేత అరుణ్ జెట్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం సభను పావుగంటపాటు వాయిదా వేసి ఆయా పార్టీల నేతలతో చైర్మన్ సమావేశమయ్యారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా.. ఏఐఏడీఏంకే సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ సజావుగా సాగకపోవడంతో వెంకయ్యనాయుడు సభను అకస్మాత్తుగా రేపటికి వాయిదా వేశారు. దీంతో సభలోనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సభ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment