
తంబి పరుగు!
► గవర్నర్‌తో భేటీ
► స్టాలిన్ ఫిర్యాదులకు వివరణ
► అవన్నీ పగటి కలలే
► నాలుగేళ్లు పాలన కొనసాగుతుంది
► అమ్మ ప్రతినిధి స్పష్టీకరణ
తమ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం లక్ష్యంగా ప్రతిపక్షాలు నినాదాన్ని అందుకున్న నేపథ్యంలో ఆదివారం రాజ్ భవన్ వైపుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై పరుగులు తీశారు. ఇన్‌చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులకు ఆయన వివరణ ఇచ్చుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి బల పరీక్ష మద్దతుగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీనిని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. శనివారం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు.
ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసలే అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో దినకరన్ రూపంలో ఇంటిపోరు సాగుతున్న నేపథ్యంలో తాజాగా, ప్రతిపక్షాలు ఇరకాటంలో పెట్టే నినాదాన్ని అందుకోవడంతో సీఎం పళనిస్వామి ప్రభుత్వం సందిగ్ధంలో పడ్డట్టు అయింది. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుకు వివరణ ఇచ్చుకునే రీతిలో అమ్మ శిబిరం ప్రతినిధిగా,పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు పరుగులు తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గవర్నర్‌తో భేటీ :
ఉదయాన్నే రాజ్‌భవన్‌కు చేరుకున్న తంబిదురై గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావుతో భేటీ అయ్యారు. అర గంట పాటుగా సాగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు తంబి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తుండడం, వారి ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్న విజ్ఞప్తిని చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పాలన భేష్‌గా ఉందని బయటకు వచ్చిన తంబి మీడియాతో డీఎంకేపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అవన్నీ పగటి కలలు :
తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. చిన్న అస్త్రం దొరికినా, దానిని భూతద్దంలో చూపెట్టి రాద్దాంతం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తుచేశారు. అవన్నీ పట్టించుకోకుండా, కేవలం ఓ సీడీని చేతిలో పెట్టుకుని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, చర్చల మీద చర్చలు, విచారణలకు పట్టుబట్టే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని డీఎంకే ఐదేళ్లు పాలనను కొనసాగించినప్పుడు, ప్రస్తుతం మరో నాలుగేళ్లు తామూ ప్రభుత్వాన్ని నడిపించగలమని ధీమా వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. ఈ సమయంలో ఎవరూ పార్టీ విప్‌ను ధిక్కరించబోరని «ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎన్ని కుట్రలు చేసినా, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, ఆయన పగటి కలలు ఇప్పట్లో నెరవేరవని హితవు పలికారు.