► ఎమ్మెల్యేలకు ఆంక్షలు
► మంత్రులకే అవకాశం
► తంబిదురైను అనుసరించాల్సిందే
► ఎంపీలకు హితవు
సాక్షి, చెన్నై: పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చిన్నమ్మ శశికళ క్లాస్ పీకారు. అసెంబ్లీలో, పార్లమెంట్, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విధానాలపై ఉపదేశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇవ్వొద్దని, మంత్రులు మాత్రమే స్పందించాలని సూచించా రు. ఇక, ఢిల్లీలో పార్టీ సీనియర్ ఎంపీ తంబిదురైను అనుసరించి ఇతర ఎంపీలు ముందుకు సాగాలని సూచించడం గమనార్హం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం పార్టీ మీద పట్టు సాధించేందుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే కసరత్తులు చేస్తూ వస్తున్నారు. జిల్లాల వారీగా సమాలోచనలు ముగించిన చిన్నమ్మ ఇక, ఎంపీలు, ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో ఉంచుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీకొట్టేందుకు, రాష్ట్రంలోని తమ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఉభయ సభల్లో ఢీకొట్టే రీతిలో ఎంపీలను సిద్ధం చేస్తూ ప్రత్యేక క్లాసుతో ఉపదేశాలు ఇచ్చి ఉండడం గమనించాల్సిన విషయం.
చిన్నమ్మ ఉపదేశం: పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకి చిన్నమ్మ నిర్ణయించారో లేదో, ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఆగమేఘాలపై శుక్రవారం సాయంత్రం చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం పన్నీరుసె ల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చిన్నమ్మకు ఎదురుగా కూర్చోక తప్పలేదు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ తో కలిసి ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రత్యేక క్లాసు తీసుకున్నారు. ప్రతి పక్షాలు సంధించే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇవ్వకూడదన్న ఆంక్షలు విధించి ఉండడం గమనార్హం. ఎలాంటి ప్రశ్నకైనా సరే, ఆధారాలు, పూర్తి వివరాలతో ప్రధాన ప్రతిపక్షం నోరు మూయించే విధంగా మంత్రులు అసెంబ్లీలో ముందుకు దూసుకెళ్లాలని సూచించారు.
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే, వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని, సమస్యల్ని తెలుసుకుని, ఆయా జిల్లాల మంత్రుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పార్టీ బలోపేతం లక్ష్యంగా శరవేగంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని, మంత్రులు ఎవరైనా, ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలపై దృష్టి సారించని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలన్న సూచనను సైతం చిన్నమ్మ ఇచ్చి ఉండడం గమనార్హం. సీఎం పన్నీరు సెల్వంతో పాటు 131 మంది ఎమ్మెల్యేలు, పార్టీలో ముఖ్యులుగా, చిన్నమ్మకు విధేయులుగా ఉన్న మాజీ మంత్రులు వలర్మతి, గోకులఇందిర సైతం ఈ సమావేశానికి హాజరు కావడం ఆలోచించదగ్గ విషయమే. ఈ సమావేశానంతరం వ్యాసార్పాడికి చెందిన అరుణ్, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తెకు జయశ్రీ అని, తిరువేర్కాడుకు చెందిన మరో దంపతుల కుమార్తెకు జయ సంధ్య అని పేరును చిన్నమ్మ పెట్టారు.
తంబిదురైను అనుసరించాల్సిందే: సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ ముగించుకుని రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో పోయెస్ గార్డెన్ కు చేరుకున్న చిన్నమ్మ తదుపరి ఎంపీలతో భేటీ కావడం విశేషం. పార్టీ ఎంపీలు 50 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ సీనియర్ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సూచనల మేరకు ఢిల్లీలో ప్రతి ఎంపీ వ్యవహరించాలని ప్రత్యేకంగా క్లాసు పీకినట్టు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో పార్లమెంట్, రాజ్యసభల వేదికగా ఢీకొట్టేందుకు తగ్గ అ స్రా్తలను సైతం చిన్నమ్మ రచించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్, రాజ్యసభల్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన సమస్యలను, సందర్భానుచితంగా వ్యవహరించాల్సిన అంశాలను, ఇతర వ్యవహారాలపై చర్చించి, తంబిదురై డైరెక్షన్ ను అనుసరిస్తూ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో ముందుకు సాగాలన్న సూచనల్ని ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఈనెల 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఎవరెవరు ఏఏ అంశాలపై ప్రశ్నలు సంధించాలన్న విషయాన్ని సైతం చిన్నమ్మే సూచించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, శనివారం చిన్నమ్మ శశికళ అపాయింట్‌మెంట్ కోసం పోయెస్ గార్డెన్ లో మేళ్ మరువత్తూరు ఆది పరాశక్తి ఆలయం వర్గాలు, ఎమ్మెల్యేల కరుణాష్‌తో పాటు, వివిధ జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే కార్యదర్శులు కుటుంబాలతో తరలిరావడం విశేషం.