
గవర్నర్ ను కలిసిన తంబిదురై
చెన్నై : పళనిస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలన్న నినాదాన్ని ప్రతిపక్షాలు అందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆదివారం రాజ్‌భవన్ వైపు పరుగులు తీశారు. ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావుతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు. మరోవైపు ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర గంటసేపు జరిగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తున్నదని, ఆ పార్టీ ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్నట్లు తెలుస్తోంది.
అవన్నీ పగటి కలలు
అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదు అని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తు చేశారు.
కేవలం ఓ సీడీని పట్టుకుని విచారణకు పట్టుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు సుపరి పాలన అందించి ప్రజల మెప్పును పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.