
రైతులను పట్టించుకోకుండా.. ఉప ఎన్నికల గోలేంటి?
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వైపు తమిళనాడు రైతులు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి నిరసనలు తెలియజేస్తుంటే.. వాళ్ల విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి ఆర్కే నగర్ ఉప ఎన్నికలలో బిజీ బిజీగా గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న తమిళ రైతులను సీపీఐ నాయకుడు రాజాతో కలిసి ఆయన పరామర్శించారు. ఆ రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా దాదాపు మూడోవంతు పొలాల్లో వరి నాట్లు వేయలేదు. రాష్ట్రానికి కనీసం 40 వేల కోట్ల రూపాయల కరువు సహాయ నిధి మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయని స్టాలిన్ విమర్శించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే ఢిల్లీ వచ్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించాల్సింది పోయి ఉప ఎన్నికల పేరు చెప్పి హడావుడి చేస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి రైతులను కలిసిన ఒక్కరోజు తర్వాత స్టాలిన్ రావడం గమనార్హం.