Palanisamy
-
సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. -
‘అమ్మ’కు వారసులు లేరా?
సాక్షి, చెన్నై: దివంగత అమ్మ జయలలితకు కుటుంబ వారసులు లేరని స్వయంగా సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె మేన కోడలు దీప పేర్కొన్నారు. ఆదివారం వీడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలితకు ఆమె అన్న కుమార్తె గా తాను, కుమారుడిగా తన సోదరుడు దీపక్ వారసులుగా ఉన్నామని గుర్తు చేశారు. మేనత్త జీవించి ఉన్న కాలంలో తమకు చేయాల్సిన వన్నీ చేస్తూ వచ్చారని, అయితే, దురదృవష్టవశాత్తు అందర్నీ వీడి ఆమె అనంత లోకాలకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం తర్వాత సీఎం కుర్చీలో పళనిస్వామిని కొందరు కూర్చోబెట్టి వేడుక చూశా రని ఎద్దేవా చేశారు. అయితే, ప్రస్తుతం సీఎం పళనిస్వామి అమ్మకు కుటుంబ వారసులు లేరని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వారసులం తాము ఉన్నామని, ఇకపై వారసుల గురించి మాట్లాడే అధికారం సీఎంకు లేదన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసుల విషయంగా మరికొన్ని పార్టీ లు నినాదాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తూ, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తా!
సాక్షి , చెన్నై: ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని తిరుచ్చిరాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్‌చేసి సీఎం పళనిస్వామిని కిడ్నాప్ చేయబోతున్నట్లు 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. చెన్నైలోని కంట్రోలు రూంకు వెళ్లిన ఆ ఫోన్ కాల్ వెళ్లగ...అక్కడి అధికారులు వెంటనే చెన్నై ఎగ్మూరు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆగంతకుడిని పట్టుకోవాల్సిందిగా ఆ జిల్లా పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కేసులో తిరుచ్చిరాపల్లి శాస్త్రి రోడ్డులోని ఒక హోటల్లో పరోటా మాస్టర్‌గా పనిచేసే రహ్మతుల్లా (45) అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తెలియకుండా ఫోన్ చేశానని రహ్మతుల్లా అంగీకరించాడు. శనివారం ఉదయం అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి తిరుచ్చిరాపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. -
దినకరన్ రాజీ ఫార్ములా!
సాక్షి, చెన్నై: అధికార అన్నాడీఎంకేలో విలీనమయ్యేందుకు సిద్ధమని బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. తన డిమాండ్లను నెరవేరిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వంలో చేరతానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. పళనిస్వామి మంత్రివర్గంలో తాను సూచించిన ఆరుగురిని తొలగించాలన్నారు. అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తే అన్నాడీఎంకేలో విలీనం అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. దినకరన్ డిమాండ్లపై పళనిస్వామి సర్కారు స్పందించాల్సివుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత దినకరన్ దూకుడు పెంచారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని శపథం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే అన్నాడీఎంకేలో విలీనమవుతామని ముందునుంచి ఆయన చెబుతున్నారు. తన వెంటవున్న 18 మంది ఎమ్మెల్యేలపై పళని సర్కారు అనర్హత వేటు వేయడంతో ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఆర్కే నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి దినకరన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు సమానదూరం పాటిస్తూ ఆయన తన గళం విన్పిస్తున్నారు. -
మోదీతో అరగంట పాటు పన్నీర్‌సెల్వం భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాలు విలీనంపై చర్చ జరిగినట్లు సమాచారం. అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ప్రధాన మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే పళనిస్వామి సర్కార్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. రెండు వర్గాల విలీనంపై మీడియా ప్రతినిధులు... పన్నీర్ సెల్వంను ప్రశ్నించగా... ‘మీకు కావాల్సినట్లు మీరు ఊహించుకుంటారు’ అని సమాధానం ఇచ్చారు. తమిళనాడు ప్రజలతో పాటు, పార్టీ కేడర్ కోరుకునే విధంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. కాగా పన్నీర్‌సెల్వంతో పాటు అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ కూడా ప్రధాని భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు, అన్నాడీఎంకే వర్గాల విలీనంపై ప్రధానంగా చర్చ జరిగిందని, అయితే మరొక పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఉండదని ప్రధాని స్పష్టం చేసినట్లు మైత్రేయన్ వెల్లడించారు. కాగా మోదీ భేటీ అనంతరం పన్నీర్ సెల్వం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాబా సన్నిధి నుంచి ఢిల్లీకి.. చెన్నై నుంచి ముంబయి మీదుగా షిర్డీ చేరుకున్న పన్నీరు సెల్వం ఆదివారం ప్రత్యేక పూజల్లో లీనం అయ్యారు. తన శిబిరం మద్దతు నేతలు కేపీ మునుస్వామి, సెమ్మలై, మైత్రేయన్లతో కలిసి షిర్డి సాయినాథుడ్ని దర్శించుకున్నారు. అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, శని భగవానుని ఆలయంలో విశిష్ట పూజలు చేయడం గమనార్హం. ఈ పూజల అనంతరం నేరుగా ముంబయి చేరుకుని సాయంత్రం ఢిల్లీలో పన్నీరు అడుగు పెట్టారు. పదవుల పందేరం విషయంగా త్యాగాలకు పళని మెట్టు దిగడం లేదన్న విషయాన్ని పన్నీర్ సెల్వం ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాల విలీనానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజీ ప్రయత్నాలు సాగించినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధానితో భేటీ అయ్యారు. ఇప్పటికే అమ్మ శిబిరం తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను సాగనంపగా, ఎన్నికల కమిషన్ నుంచి వెలువడే నిర్ణయం మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి పళని, పన్నీరు వేర్వేరుగా వెళ్లినా, విలీనం విషయగా ఏ ప్రకటన వెలువడ లేదు. అదే సమయంలో పళని మాత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అయ్యారు. -
శశికళ చుట్టూ బిగిసిన ఉచ్చు
►రోజుకో చర్చ ►చిన్నమ్మకు ఇంటి భోజనం ►ఆ మంత్రి ఎవరో ? ►విచారణలోనిగ్గు తేలుతుందన్న పళని పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. రోజుకో అంశం తెర మీదకు వస్తుండడంతో రాష్ట్రంలో చర్చ ఊపందుకుంది. హోసూరు నుంచి అంబులెన్స్‌లో శశికళకు అన్ని రకాల వస్తువులు సరఫరా సాగినట్టు మంగళవారం సమాచారం అందింది. అయితే, ఓ మంత్రి ఇంటి నుంచి అన్నాడీఎంకే నాయకుడి పర్యవేక్షణలో ఈ అంబులెన్స్ వెళ్లి ఉండడంతో ఆ మంత్రి, ఆ నాయకుడు ఎవరో అన్న ప్రశ్న మొదలైంది. చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు పరప్పన అగ్రహార చెరలో లగ్జరీ సౌకర్యాల వ్యవహారం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ పరిస్థితుల్లో విచారణ తమిళనాడు చుట్టూ తిరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే సమాచారాలు విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటక డీజీపీ మొదలు అందరూ అధికారులకు ఆకాశ రామన్న ఉత్తరం ఒకటి చేరడం, అందులో ఉన్న అంశాలు వెలుగులోకి రావడంతో తమిళనాట చర్చ మరింతగా ఊపందుకుంది. ఇక, చిన్నమ్మ చుట్టూ ఉచ్చు మరింతగా బిగిసినట్టుగా ఆ ఉత్తరం స్పష్టం చేస్తుండటం ఆలోచించ దగ్గ విషయం. ఆ ఉత్తరం మేరకు నల్ల ధనం కేసులో కర్ణాటకలో పట్టుబడ్డ పలువురు ప్రముఖులు శశికళకు సౌకర్యాల కల్పనలో రాయబారాలు అధికారులతో సాగించినట్టు వివరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, పరప్పన అగ్రహార చెరలో పనిచేస్తున్న ఎస్ఐ స్థాయి అధికారి ఒకరు కేవలం వీఐపీల సౌకార్యాల కల్పన మీదే పూర్తిస్థాయిలో మునిగి ఉన్నట్టు, ఆ అధికారి శశికళకు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్టు ఆకాశ రామన్న ఉత్తరంలో పేర్కొని ఉంది. అలాగే, హోసూరుకు చెందిన ఓ అన్నాడీఎంకే నేత అంబులెన్స్‌లో చిన్నమ్మకు కావాల్సినవన్నీ పరప్పన అగ్రహార చెరకు తరలించినట్టు, ప్రత్యేకంగా వంటకాలు రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరి ఇంటి నుంచి వెళ్లినట్టుగా ఆరోపణలు గుప్పించి ఉండటంతో ఆ ఇద్దరు ఎవరో అన్న చర్చ బయలు దేరింది. ఇక, డీఐజీ రూపా సైతం రోజుకో వివరాలను బయటపెడుతూ రావడంతో, ఈ ఇతివృత్తంతో సినిమా తీసే అవకాశాలు ఉన్నట్టుగా కర్ణాటక నుంచి సంకేతాలు వస్తుండటంతో అందర్నీ ముక్కుమీద వేలు వేసుకునేలా చేస్తున్నాయి. కాగా, ఇన్నాళ్లు శశికళ విషయంలో నోరు మెదపని సీఎం పళని స్వామి ఢిల్లీ వేదికగా ప్రపథమంగా గళం విప్పడం గమనార్హం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం పళని స్వామి తమిళనాడు భవన్లో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శశికళ లగ్జరీ సౌకర్యాల గురించి ప్రశ్నించగా, ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణ సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణ మేరకు అన్ని విషయాలు నిగ్గు తేలుతాయని వ్యాఖ్యానించారు. -
గవర్నర్ ను కలిసిన తంబిదురై
చెన్నై : పళనిస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలన్న నినాదాన్ని ప్రతిపక్షాలు అందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆదివారం రాజ్‌భవన్ వైపు పరుగులు తీశారు. ఇన్చార్జి గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావుతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు. మరోవైపు ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర గంటసేపు జరిగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తున్నదని, ఆ పార్టీ ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్నట్లు తెలుస్తోంది. అవన్నీ పగటి కలలు అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదు అని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేవలం ఓ సీడీని పట్టుకుని విచారణకు పట్టుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు సుపరి పాలన అందించి ప్రజల మెప్పును పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
అతను శశికళ బినామీ
► సీఎం ఎడపాడిపై పన్నీర్ సెల్వం తీవ్ర ఆరోపణలు టీనగర్: ‘శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలతో అన్నాడీఎంకే విలీనం చర్చలకు ఎలాంటి సూచనలు కనిపించకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కాంచీపురం ఈస్ట్ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశం కొట్టివాక్కం వైఎంసీఏ మైదానంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న పన్నీర్ సెల్వం మాట్లాడుతూ కాంచీపురం జిల్లాలో ధర్మయుద్ధం మొదటి సమావేశం ప్రారంభించామన్నారు. తాము తలపెట్టిన ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. సుమారు 74 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుంటారని భావించామని, అయితే ఆమె మరణించిన వార్త ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ప్రపంచ తమిళుల గుండెల్లో కలత రేకెత్తించిందన్నారు. ఆమెను కాపాడుకోలేకపోయామన్న ఆవేదన ఉందని, జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీని కోసమే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీగా ఉండాలంటూ ఎంజీఆర్, జయలలిత లక్ష్యం ఏర్పాటుచేసుకున్నారని, అలాంటి పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లోకి వెళ్లకూడదని చెప్పారు. ప్రస్తుతం సీఎం ఎడపాడి పళనిస్వామి వేరొక మార్గంలో పయనిస్తున్నారని, ఇంకా ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఉన్నారన్నారు. ప్రజలు మోసపోయారని, శశికళ వర్గం కపట నాటకంగా గ్రహించగలరని తెలిపారు. శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి అని, తమరు ఎవరి పిడికిట్లో ఉంటూ పాలన సాగిస్తున్నారో అక్కడి నుంచి బయటికి రావాలని కోరారు. స్థానిక ఎన్నికలకు మునుపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేందుకు అవకాశాలున్నాయని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు కాంచీపురం ఈస్ట్ జిల్లా జయలలిత పేరవై మాజీ కార్యదర్శి పెరుంబాక్కం రాజశేఖర్ వెండి కరవాలాన్ని బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే వీఎన్‌పీ వెంకట్రామన్ నిలువెత్తు రాజదండం అందజేశారు. కార్యక్రమంలో సైదై ఎంఎం బాబు సహా పలువురు పాల్గొన్నారు. ఇదిలావుండగా త్వరలో ఎన్నికలు వస్తాయంటూ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రులు జయకుమార్, దిండుగల్ శ్రీనివాసన్ ఎద్దేవా చేశారు. -
రైతులను పట్టించుకోకుండా ఉప ఎన్నికల గోలేంటి?
-
రైతులను పట్టించుకోకుండా.. ఉప ఎన్నికల గోలేంటి?
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వైపు తమిళనాడు రైతులు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి నిరసనలు తెలియజేస్తుంటే.. వాళ్ల విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి ఆర్కే నగర్ ఉప ఎన్నికలలో బిజీ బిజీగా గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న తమిళ రైతులను సీపీఐ నాయకుడు రాజాతో కలిసి ఆయన పరామర్శించారు. ఆ రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా దాదాపు మూడోవంతు పొలాల్లో వరి నాట్లు వేయలేదు. రాష్ట్రానికి కనీసం 40 వేల కోట్ల రూపాయల కరువు సహాయ నిధి మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయని స్టాలిన్ విమర్శించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే ఢిల్లీ వచ్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించాల్సింది పోయి ఉప ఎన్నికల పేరు చెప్పి హడావుడి చేస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి రైతులను కలిసిన ఒక్కరోజు తర్వాత స్టాలిన్ రావడం గమనార్హం. -
ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోమంకోసం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అనేక అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళని స్వామి పరిపాలనలో, కార్యనిర్వహణలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.అమ్మ బాటలోనే తాను పయనిస్తున్నానంటూ ప్రజా సంక్షేమం కోసం ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన పళనిస్వామి ఇపుడు ఉద్యోగుల సంక్షేమం దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 7వ కేంద్ర వేతన కమిషన్ సిఫారసులపై ఒక కమిటీ వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ మేరకు అధికారుల సంఘానికి నిర్దేశించారు. పే కమిషన్ సిఫారసుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ పునశ్చరణ కోసం ఓ కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. అదనపు చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) కె షణ్ముగం నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్యానెల్ నియమించినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ హోం కార్యదర్శి అపూర్వ వర్మతో ఇతర సభ్యులుగా ఉన్న ఈ కమిటీని 7 వ వేతన సంఘం చేసిన సవరించిన వేతన స్కేలు సిఫార్సులపై అధ్యయనం చేయాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కేల్ పై కేంద్ర ప్రభుత్వం సిఫారసులపై కూడా అధ్యయనం చేసిన తగిన సూచనలు సలహాలన అందించాలని కోరినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వివిధ అలవెన్సులను సమీక్షించి సంబంధిత సలహాలను అందించాల్సింది నిర్దేశించామన్నారు. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి జూన్ 30దాకా గడువు ఇచ్చినట్టు చెప్పారు. -
31మంది మంత్రులతో పళనిస్వామి కేబినెట్
-
శశికళ తనయుడికి మంత్రి పదవి!
-
శశికళ తనయుడికి మంత్రి పదవి!
చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన పళనిస్వామి మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. తన కేబినెట్ లో కొత్త ముఖాలకు చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. శశికళకు సన్నిహితులైన వారికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శశికళ తనయుడు(అక్క కుమారుడు) దినకరన్, సెంగొట్టయ్యన్ లకు కేబినెట్ బెర్తులు ఖాయమంటున్నారు. సీఎం సహా 33 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పోయెస్ గార్డెన్ ముఖ్యనేతలతో కేబినెట్ కూర్పుపై పళనిస్వామి చర్చించారు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి రాజ్ భవన్ కు బయలుదేరారు. మంత్రుల పేర్లతో కూడిన లిస్టును గవర్నర్ ను అందించారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. -
తమిళనాడులో సంక్షోభానికి తెర
-
తమిళనాడులో సంక్షోభానికి తెర
చెన్నై: తమిళనాడులో కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎం కుర్చీ కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పోటీ పడడంతో సంక్షోభం మొదలైంది. శశికళకు జైలుకు వెళ్లడంతో తన స్థానంలో పళనిస్వామిని ఆమె తెర మీదకు తెచ్చారు. ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం వైపు వెళ్లకుండా ఆమె కట్టడి చేయగలిగారు. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తగినంత సమయం లభించినప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో పన్నీర్ విఫలమయ్యారు. చివరకు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో బలం నిరూపించుకునేందుకు గడువు ఇచ్చారు. మరోవైపు పన్నీర్ సెల్వం తన ప్రయత్నాలు ఆపలేదు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
-
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నా డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీరు సెల్వం తప్ప పార్టీకి చెందిన మిగతా 134 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించడంపై తంబిదురై స్పందిస్తూ.. చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. పన్నీరు సెల్వానికి ఇక పార్టీతో సంబంధం లేదని చెప్పారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
రిసార్ట్‌లో శశకళ వర్గీయుల సంబరాలు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో శశికళ శిబిరం కళకళలాడుతోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరినా గవర్నర్ వేచిచూడటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు సెల్వం వర్గంలోకి చేరుతుండటం, ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడటం, బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లడంతో ఆమె వర్గీయులు ఢీలాపడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్.. పళనిస్వామిని ఆహ్వానించడంతో శశికళ వర్గీయులకు కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది. కాగా పళనిస్వామి అప్పుడే సీఎం అయినట్టు కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరిబలమెంత అన్నది అసెంబ్లీలో బలపరీక్షలో తేలనుంది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
ఈ రోజే గవర్నర్ నిర్ణయం తమిళనాట ఉత్కంఠ
-
ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ విధేయుడు పళనిస్వామిని ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాట సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్న (బుధవారం) తొలుత పళనిస్వామి, ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇద్దరూ గవర్నర్‌తో సమావేశమయ్యారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా అవకాశం ఇవ్వాలని ఇద్దరూ గవర్నర్‌ను కోరారు. దీంతో సంఖ్యారీత్యా పళనిస్వామికి ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున గవర్నర్ ఆయన్నే ఆహ్వానిస్తారని విశ్వసనీయ సమాచారం. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినందువల్ల గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని రాజకీయనాయకులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఊహించని, అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఎంపీలు, ప్రజల మద్దతు లభిస్తున్నా.. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రావడం లేదు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే
శశికళ చెన్నై నగరాన్ని వీడి బెంగళూరుకు అలా బయల్దేరారో లేదో.. ఆమె మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. శశికళతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మంత్రి పళనిసామి మీద కూడా కలిపి ఈ కేసు నమోదు చేశారు. తనను వీళ్లిద్దరూ కలిసి కిడ్నాప్ చేశారంటూ దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూవత్తూరు పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే ఇంతకుముందు చెన్నై పోలీసులు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ తాము ప్రతి ఎమ్మెల్యేతోను మాట్లాడామని, మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్ఛందంగానే వచ్చినట్లు చెప్పారంటూ హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఫిర్యాదు ఎలా వచ్చిందో చూడాలి. కాగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యే శరవణన్ పారిపోయి బయటకు వచ్చారు. ఆయన పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు. -
చీలిక దిశగా అన్నాడీఎంకే!
తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే.. మరోసారి చీలిక దిశగా వెళ్తోంది. 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీని ఆయన తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు జయలలిత ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మరోసారి చీలిపోయేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. తనకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించిన తర్వాత.. పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిసామిని శశికళ ప్రతిపాదించారు. ఇది నిజానికి పార్టీలో చాలామందికి మింగుడుపడట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే పళనిసామిపై అవినీతి ఆరోపణలున్నాయని, అందువల్ల అలాంటి వ్యక్తి కంటే.. అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం అయితేనే మేలని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో శశికళ బెంగళూరు బయల్దేరి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతు విషయంలో పునరాలోచన చేసుకుంటారని.. అప్పుడే ఎవరి వెంట ఎంతమంది ఉన్నారన్నది కచ్చితంగా తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే తమిళనాడులో బేరసారాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మద్దతివ్వాలంటే ఎంత ఇస్తారంటూ కొందరు ఎమ్మెల్యేలు బేరాలకు దిగుతున్నట్లు సమాచారం. ఇక పార్టీపై పట్టు విషయంలో కూడా రెండు వర్గాలుగా నేతలు చీలిపోయారు. ఎలాగైనా తన కుటుంబ సభ్యులందరినీ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్లను అగ్రస్థానాల్లో కూర్చోబెట్టాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తీవ్ర ఆర్థిక ఆరోపణలున్న తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇదే దినకరన్‌ను ఇంతకుముందు జయలలిత పోయెస్ గార్డెన్తో పాటు పార్టీ నుంచి కూడా తరిమేశారు. అయితే ఇప్పుడు తన వాళ్లందరినీ తీసుకురావడం ద్వారా పార్టీపై తన పట్టు బిగించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న మధుసూదనన్, మైత్రేయన్, పాండియన్, పాండియరాజన్ తదితరులు మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేక.. పన్నీర్ సెల్వం శిబిరం వైపు వచ్చేస్తున్నారు. దాంతో పార్టీలో స్పష్టమైన చీలిక ఇప్పటికే కనిపిస్తోంది. అసెంబ్లీలో బలపరీక్ష తర్వాత ఇది పూర్తిస్థాయిలో బయటపడుతుందని, అప్పటికి శశికళ వర్గం లో ఎంతమంది ఉన్నారు, పన్నీర్ వర్గంలో ఎంతమంది ఉన్నారన్న విషయం తేలిపోతుందని.. అప్పుడే ఇక పార్టీ గుర్తు, అధికారిక గుర్తింపు లాంటి అంశాలపై ఈసీ వరకు పోరాటం వెళ్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇలాంటి పరిణామాల వల్ల రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఎక్కువ లబ్ధిపొందే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్నాళ్లూ ఒక్కటిగా ఉన్న పార్టీలో చీలిక వస్తే.. ఓట్లు కూడా చీలుతాయని, అది డీఎంకేకు తప్పనిసరిగా అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
పళనిస్వామే ఎందుకు!
తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే కొత్త శాసనసభ పక్ష నేతగా పీడబ్ల్యూడీ మంత్రి ఎడపాడి కె పళనిస్వామిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వ్యూహం ఏమిటనే ప్రశ్నకు కులం ప్రధాన కారణమనే జవాబు వినిపిస్తోంది. సొంత (తేవర్) కులానికి కాకుండా మరో పెద్ద సామాజిక వర్గానికి (గౌండర్) ప్రాధాన్యం ఇచ్చారనే ‘ఇమేజ్’ సంపాదించడానికి ఆమె ఈ పనిచేశారని భావిస్తున్నారు. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు సామాజిక వర్గాల వారు బలమైనవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. దివంగత సీఎం జయలలిత, ప్రస్తుతం ఓపీఎస్ కేబినెట్లలో తేవర్లకు 9 మంత్రి పదవులు లభించగా, గౌండర్లకు ఐదే దక్కాయి. పాలకపక్షంలో 19 మంది ఎమ్మెల్యేలున్న బీసీ వర్గమైన వన్నియార్లకు కూడా 5 పదవులే లభించాయి. 1967లో డీఎంకే, మళ్లీ 1977లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఈ రెండు ద్రవిడ పార్టీలు బ్రాహ్మణేతర సీఎంల పాలనలో ప్రధాన కులాల ఆధిపత్యం లేకుండా రాజకీయాలు నడిచాయి. 1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ ఏఐఏడీఎంకే పాలనలో తేవర్లకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణేతరులకు సామాజిక న్యాయం, తమిళానికి ప్రాధాన్యం వంటి నినాదాలతో బలమైన ద్రవిడ సైద్ధాంతిక బలం ఉన్న డీఎంకే నేత ఎం.కరుణానిధిని జయలలిత విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అనేక కులాలతో బలమైన సామాజిక సంకీర్ణం నిర్మించి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కులానికి అతీతంగా ఆమె గట్టి పునాదివర్గాన్ని పార్టీకి ఏర్పాటుచేశారు. గౌండర్లు గెలిపించారు ఓటర్లు ప్రతి అయిదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే సంప్రదాయం 1989 నుంచీ బలపడిన తమిళనాట గతేడాది (2016) అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించారు. స్వల్ప మెజారిటీతో విజయం సాధించడానికి జయలలిత వెనుక పశ్చిమ ప్రాంతం (కొంగునాడు) గట్టిగా నిలబడింది. ఈ ప్రాంతంలోని దాదాపు 50 సీట్లలో అన్నాడీఎంకే కైవసం చేసుకున్న 44 సీట్లే మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 118ని దాటి 135 స్థానాలు సాధించడానికి ఇక్కడి ఆధిపత్యవర్గమైన గౌండర్లు తోడ్పడ్డారు. నమ్మిన తేవర్ తిరుగుబాటు చేశాక గౌండర్! జయ తర్వాత ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే విషయంలో ఒక దశలో గౌండర్ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి వైపు మొగ్గుచూపారని, అదే కులానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై పేరును కూడా శశికళ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. చివరికి గతంలో జయ రెండుసార్లు తన బదులు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఓపీఎస్‌నే శశికళ ఎంపిక చేయడంతో రెండు ప్రధాన పదవులు తేవర్ల చేతుల్లోకి వచ్చాయని వాదన వినిపించింది. తాను కోరినట్టు రెండు నెలలకే రాజీనామా చేసిన ఓపీఎస్ వారం లోపే తిరుగుబాటు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ వ్యూహం మార్చారు. అసంతృప్తిగా ఉన్న గౌండర్ల మద్దతు పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నా డీఎంకే నిలుస్తుందా? దాదాపు రెండు దశాబ్దాల క్రితం(1988) ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోయింది. రెండు చీలిక వర్గాలూ ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 27 సీట్లు గెల్చుకున్న జయలలిత వర్గంలో ఎంజీఆర్ భార్య వీఎన్ జానకి నేతృత్వంలోని పార్టీ విలీనమైంది. ఎంజీఆర్ తర్వాత అంతటి జనాకర్షక నేతగా జయలలిత రుజువు చేసుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడీఎంకే మరోసారి చీలిపోతే, జయలలితలా పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ జనాదరణ సంపాదించే సత్తా ఉన్న నేతలెవరూ రెండు వర్గాల్లో లేరు. శశికళ, ఓపీఎస్, తంబిదురై, పళనిస్వామి, ఇ మధుసూదనన్.. వీరిలో ఎవరికీ అంతటి శక్తియుక్తులు లేవు. చీలిక తర్వాత రెండు వర్గాలు పూర్తిగా దెబ్బతింటే ఆ శూన్యాన్ని మరో కొత్త ద్రవిడ రాజకీయ పార్టీతో పూరించవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే రెండు చీలిక వర్గాలు, డీఎంకే మధ్య ఓట్లు చీలితే పూర్వ వైభవం సాధించవచ్చని భావించిన కాంగ్రెస్‌కు 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే మరోసారి చీలితే బీజేపీకి లబ్ధిపొందే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్‌తో ముగిసిన పళనిస్వామి భేటి
-
తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇచ్చినా లేదా అన్నా డీఎంకే శాసన సభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఎన్నికైన పళనిస్వామిని ఆహ్వానించినా.. సభలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేకిత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే.. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 235. వీరిలో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కాగా 234 మంది నేరుగా ఎన్నికైన వారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 మంది, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నారు. మెజార్టీ మార్క్ 117 సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకేకు మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది పన్నీరు సెల్వంకు మద్దతు ఇస్తారు? ఎంతమంది పళనిస్వామి వెంట నిలుస్తారు? అన్నది తేలాల్సివుంది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 225 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గంలో అంటే పళనిస్వామికి మద్దతుగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అన్నాడీఎంకే తమకు ప్రత్యిర్థి పార్టీ అని, తాము మద్దతు ఇవ్వబోమని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీదీ ఇదే వైఖరి. ఏం జరగకవచ్చు..? ఈ నేపథ్యంలో మెజార్టీ మార్క్ 117 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంట నిలుస్తారా లేదా పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ వైపు వస్తారని చెబుతున్న పన్నీరు సెల్వం వర్గీయుల మాట నిజమవుతుందా లేదా త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన స్టాలిన్ అన్నంతపనీ చేస్తారా లేదా ఎవరూ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఎవరీ పళనిస్వామి..?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలుశిక్ష పడటంతో ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు ఈ విషయం తెలియజేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. పళనిస్వామి గురించి తెలుసుకోవాలంటే.. పన్నీరు సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ.. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించినట్టు సమాచారం. అయితే అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పళనిస్వామి చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం?