ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోమంకోసం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అనేక అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళని స్వామి పరిపాలనలో, కార్యనిర్వహణలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.అమ్మ బాటలోనే తాను పయనిస్తున్నానంటూ ప్రజా సంక్షేమం కోసం ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన పళనిస్వామి ఇపుడు ఉద్యోగుల సంక్షేమం దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 7వ కేంద్ర వేతన కమిషన్ సిఫారసులపై ఒక కమిటీ వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ మేరకు అధికారుల సంఘానికి నిర్దేశించారు.
పే కమిషన్ సిఫారసుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ పునశ్చరణ కోసం ఓ కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. అదనపు చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) కె షణ్ముగం నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్యానెల్ నియమించినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ హోం కార్యదర్శి అపూర్వ వర్మతో ఇతర సభ్యులుగా ఉన్న ఈ కమిటీని 7 వ వేతన సంఘం చేసిన సవరించిన వేతన స్కేలు సిఫార్సులపై అధ్యయనం చేయాల్సిందిగా కోరినట్టు చెప్పారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కేల్ పై కేంద్ర ప్రభుత్వం సిఫారసులపై కూడా అధ్యయనం చేసిన తగిన సూచనలు సలహాలన అందించాలని కోరినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వివిధ అలవెన్సులను సమీక్షించి సంబంధిత సలహాలను అందించాల్సింది నిర్దేశించామన్నారు. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి జూన్ 30దాకా గడువు ఇచ్చినట్టు చెప్పారు.