governmentemployees
-
హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న పీఆర్సీలో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తగ్గిస్తూ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏను యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు హెచ్ఆర్ఏ 30 శాతం ఉండగా దాన్ని 24 శాతానికి తగ్గిస్తూ పీఆర్సీ సిఫారసు చేసింది. అలాగే 2 లక్షల జనాభా కంటే ఎక్కువున్న పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 17 శాతానికి తగ్గించింది. ఇక 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 14.5 శాతం హెచ్ఆర్ఏ ఉండగా దాన్ని 13 శాతానికి, మండల కేంద్రాలు, గ్రామాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 11 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఆర్ఏ తగ్గింపు వల్ల తమకు చేకూరాల్సిన ప్రయోజనం రాకుండా పోతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుతం హెచ్ఆర్ఏను యథావిధిగా కొనసా గించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. దానిపై ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, పాత పీఆర్సీలో హెచ్ఆర్ఏ గరిష్టంగా రూ. 15 వేల వరకే సీలింగ్ ఉంది. దీని ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఒకవేళ రూ. 15 వేలకు మించినా రూ. 15 వేలే ఇస్తారు. కానీ ప్రస్తుత పీఆర్సీలో ఆ సీలింగ్ లేదు. అయితే రూ. 15 వేల కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న వారికి మాత్రం హెచ్ఆర్ఏలో తగ్గుదల తప్పదు. -
ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోమంకోసం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అనేక అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళని స్వామి పరిపాలనలో, కార్యనిర్వహణలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.అమ్మ బాటలోనే తాను పయనిస్తున్నానంటూ ప్రజా సంక్షేమం కోసం ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన పళనిస్వామి ఇపుడు ఉద్యోగుల సంక్షేమం దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 7వ కేంద్ర వేతన కమిషన్ సిఫారసులపై ఒక కమిటీ వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ మేరకు అధికారుల సంఘానికి నిర్దేశించారు. పే కమిషన్ సిఫారసుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ పునశ్చరణ కోసం ఓ కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. అదనపు చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) కె షణ్ముగం నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్యానెల్ నియమించినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ హోం కార్యదర్శి అపూర్వ వర్మతో ఇతర సభ్యులుగా ఉన్న ఈ కమిటీని 7 వ వేతన సంఘం చేసిన సవరించిన వేతన స్కేలు సిఫార్సులపై అధ్యయనం చేయాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కేల్ పై కేంద్ర ప్రభుత్వం సిఫారసులపై కూడా అధ్యయనం చేసిన తగిన సూచనలు సలహాలన అందించాలని కోరినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వివిధ అలవెన్సులను సమీక్షించి సంబంధిత సలహాలను అందించాల్సింది నిర్దేశించామన్నారు. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి జూన్ 30దాకా గడువు ఇచ్చినట్టు చెప్పారు.