తమిళనాడులో సంక్షోభానికి తెర
చెన్నై: తమిళనాడులో కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎం కుర్చీ కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పోటీ పడడంతో సంక్షోభం మొదలైంది. శశికళకు జైలుకు వెళ్లడంతో తన స్థానంలో పళనిస్వామిని ఆమె తెర మీదకు తెచ్చారు. ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం వైపు వెళ్లకుండా ఆమె కట్టడి చేయగలిగారు.
శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తగినంత సమయం లభించినప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో పన్నీర్ విఫలమయ్యారు. చివరకు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో బలం నిరూపించుకునేందుకు గడువు ఇచ్చారు. మరోవైపు పన్నీర్ సెల్వం తన ప్రయత్నాలు ఆపలేదు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు.