
అతను శశికళ బినామీ
► సీఎం ఎడపాడిపై పన్నీర్ సెల్వం తీవ్ర ఆరోపణలు
టీనగర్: ‘శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలతో అన్నాడీఎంకే విలీనం చర్చలకు ఎలాంటి సూచనలు కనిపించకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కాంచీపురం ఈస్ట్ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశం కొట్టివాక్కం వైఎంసీఏ మైదానంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న పన్నీర్ సెల్వం మాట్లాడుతూ కాంచీపురం జిల్లాలో ధర్మయుద్ధం మొదటి సమావేశం ప్రారంభించామన్నారు.
తాము తలపెట్టిన ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. సుమారు 74 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుంటారని భావించామని, అయితే ఆమె మరణించిన వార్త ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ప్రపంచ తమిళుల గుండెల్లో కలత రేకెత్తించిందన్నారు. ఆమెను కాపాడుకోలేకపోయామన్న ఆవేదన ఉందని, జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీని కోసమే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు.
అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీగా ఉండాలంటూ ఎంజీఆర్, జయలలిత లక్ష్యం ఏర్పాటుచేసుకున్నారని, అలాంటి పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లోకి వెళ్లకూడదని చెప్పారు. ప్రస్తుతం సీఎం ఎడపాడి పళనిస్వామి వేరొక మార్గంలో పయనిస్తున్నారని, ఇంకా ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఉన్నారన్నారు. ప్రజలు మోసపోయారని, శశికళ వర్గం కపట నాటకంగా గ్రహించగలరని తెలిపారు. శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి అని, తమరు ఎవరి పిడికిట్లో ఉంటూ పాలన సాగిస్తున్నారో అక్కడి నుంచి బయటికి రావాలని కోరారు.
స్థానిక ఎన్నికలకు మునుపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేందుకు అవకాశాలున్నాయని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు కాంచీపురం ఈస్ట్ జిల్లా జయలలిత పేరవై మాజీ కార్యదర్శి పెరుంబాక్కం రాజశేఖర్ వెండి కరవాలాన్ని బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే వీఎన్‌పీ వెంకట్రామన్ నిలువెత్తు రాజదండం అందజేశారు. కార్యక్రమంలో సైదై ఎంఎం బాబు సహా పలువురు పాల్గొన్నారు. ఇదిలావుండగా త్వరలో ఎన్నికలు వస్తాయంటూ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రులు జయకుమార్, దిండుగల్ శ్రీనివాసన్ ఎద్దేవా చేశారు.