'సీఎం పళనిస్వామి, స్పీకర్ రాజీనామా చేయాలి'
- సీఎం, గవర్నర్, స్పీకర్ తమ పదవులను దుర్వినియోగ పరుస్తున్నారు
- మా కార్యాచరణ ఏంటో రేపు ప్రకటిస్తాం: డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాట తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం సమావేశమైంది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలను ఆమోదించారు. రాజకీయాలకు ప్రభుత్వాన్ని వాడుకోవడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని, స్పీకర్, గవర్నర్, ముఖ్యమంత్రి తీరును వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని చేశారు. స్పీకర్, సీఎం, గవర్నర్ అధికార, రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేస్తున్నారని డీఎంకే ఈ సందర్భంగా మండిపడింది.
దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటువేసి అడ్డదారిలో మెజారిటీ నిరూపించుకోవాలని పళనిస్వామి సర్కారు ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపించింది. సీఎం పళనిస్వామి, స్పీకర్ ధనపాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ భేటీ అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వమే ఆడిస్తోందని, అందుకే తాము బలపరీక్ష కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంపై స్పందిస్తూ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
'తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు , సీఎం పళనిస్వామి, స్పీకర్ ధనపాల్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సీఎం పళనిస్వామి బలనిరూపణ చేసుకోవాలని కోసం డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్షాలు గవర్నర్ను కోరాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేసిన రోజే పళనిస్వామి సర్కార్ అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయింది' అని డీఎంకే ఓ ప్రకటనలో పేర్కొంది.
మా వ్యూహాలు మాకున్నాయి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు ప్రజలతో ఆడుకుంటున్నాయని డీఎంకే సీనియర్ ఎమ్మెల్యే శేఖర్‌బాబు విమర్శించాయి. పళని సర్కారు బలపరీక్ష డిమాండ్, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపథ్యంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని, తమిళనాడు అసెంబ్లీలో వెంటనే అవిశ్వాస తీర్మానం అంశంపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దినకరన్ వర్గంపై వేటు నేపథ్యంలో డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే కార్యాచరణ ఏవిధంగా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.