డీఎంకే, అన్నాడీఎంకే.. ఈ రెండు పార్టీల చరిత్రే.. మొత్తం తమిళనాడు రాజకీయ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. సిద్ధాంత పరంగానే కాదు.. భావజాలం పరంగానూ విభేదించుకునే ఈ పార్టీలకు చెందిన నాయకులు బద్ధ శత్రువుల కంటే దారుణంగా వ్యవహరిస్తుంటారు. నిప్పుకు చెద పట్టదు అన్నది ఎంత నిజమో.. వీరు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లరు అనేది కూడా అంతే నిజమని భావిస్తుంటారు. ఎందుకంటే అత్యంత అరుదైన పరిస్థితుల్లోనూ వారు తమ సిద్ధాంతాలను వదులుకుని ప్రత్యర్థి పార్టీలో చేరేందుకు ఇష్టపడరు.
అలాంటిది ఇప్పుడు కాలం మారింది. అమ్మ మరణంతో దారీతెన్నులేని అన్నాడీఎంకే నుంచి నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి బీజేపీ రెడ్ కార్పెట్ పరిచేందుకు యత్నిస్తోంది. తద్వారా తమిళనాట బలపడాలని పావులు కదుపుతోంది. దీంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న స్టాలిన్ అన్యమనస్కంగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు పచ్చజెండా ఊపేశారు. దీంతో ఈ అరుదైన పరిస్థితి ఒకవిధంగా.. ‘‘నమ్మక తప్పని నిజం’’.. అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలను గురి పెట్టి తమ పార్టీలోకి ఆహ్వానించాలని అధికార డీఎంకే భావిస్తోంది. అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ వైపుగా చూడకుండా ఉండేందుకే స్టాలిన్ ప్రస్తుతం కొంత.. రాజీ ఫార్ములాను అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. అన్నాడీఎంకే జిల్లా స్థాయి నేతలను డీఎంకేలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు సాధారణంగా ఇష్టపడారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేర్చుకోవాల్సి వస్తే.. సవాలక్ష కట్టుబాట్లు ఉండేవి. పారీ్టలోకి వచ్చినా.. వారికి తగిన ప్రాధాన్యం కూడా ఉండేది కాదు. దీంతో ఒక పార్టీలోకి వారు మరోపార్టీలోకి వచ్చేవారు కాదు.
చదవండి: ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్‌ఎస్ కార్యాలయం సిద్ధం
సీనియారిటీ, సామాజిక, ఆర్థిక బలం కలిగిన కొన్ని వర్గాలకు మాత్రం మినహాయింపు ఉండేది. ఇలా.. జయలలిత మరణం తర్వాత ఒకరిద్దరు అన్నాడీఎంకే ముఖ్య నాయకులు డీఎంకే గూటికి వచ్చారు. తర్వాత పరిస్థితి యథా ప్రకారం ఉప్పు..నిప్పులాగా ఉండేది. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే అసంతృప్తి నేతలను తమ వైపునకు తిప్పుకోవాల్సిన అవసరం డీఎంకేకు ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం డీఎంకే సీనియర్లు కొన్ని కీలక జిల్లాలోని అన్నాడీఎంకే నేతలపై గురిపెట్టి అక్కున చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కోవై సెల్వరాజ్(ఫెల్)
బీజేపీ వైపు వెళ్లకుండా..
అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య నెలకొన్న విభేదాలతో అనేక మంది అసంతృప్తి నేతలు పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. అయితే డీఎంకే నుంచి వీరికి పిలుపు రాకపోవడంతో బీజేపీలో చేరుతున్నారు. ఫలితంగా బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతోంది. ఇది డీఎంకేకు గట్టి దెబ్బగా మారుతోంది. దీంతో అన్నాడీఎంకే నుంచి వచ్చే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు డీఎంకే సిద్ధమైంది. ప్రధానంగా కొంగు మండలంగా భావించే కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్, నామక్కల్, నీలగిరి తదితర జిల్లాలు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు డీఎంకే సిద్ధమైంది.
ఈ ఆపరేషన్ ఆకర్ష్ పనిని.. ఆయా జిల్లాలోని డీఎంకే సీనియర్లకు అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి.. అక్కడ అన్నాడీఎంకే నాయకులకు వల వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోవై సెల్వరాజ్‌ను డీఎంకేలోకి ఆహ్వనించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాకతో కోయంబత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న అన్నాడీఎంకే నేతలు డీఎంకే వైపుగా క్యూ కట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే ఊపుతో పెద్దఎత్తున అన్నాడీఎంకే నాయకులను డీఎంకేలోకి ఆహా్వనించే దిశగా ఆ పార్టీ సీనియర్లు స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment