అసెంబ్లీలో మళ్లీ బలపరీక్ష జరపాలి
- గవర్నర్‌కు ప్రతిపక్ష డీఎంకే వినతి
- అనుకూల నిర్ణయం వస్తే అన్నాడీఎంకే పని ఢమాల్!
చెన్నై: ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకే పోరాటాన్ని ఉధృతం చేసింది. అక్రమ మార్గంలో విశ్వాసపరీక్ష నెగ్గిన పళని స్వామికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఎమ్మెల్యేల బృందం శనివారం ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసింది. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష నిర్వహించాలని వినతిపత్రం అందించింది.
గవర్నర్‌తో భేటీ అనంతరం తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘పళని స్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని గవర్నర్‌కు ఇచ్చాం. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాల్సిందిగా కోరాం’ అని స్టాలిన్ తెలిపారు.
అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై డీఎంకే దూకుడుగా వెళుతోంది. ముడుపుల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ శుక్రవారం సభలో పట్టుపట్టింది. అందుకు స్పీకర్ ధన్‌పాల్ అంగీకరించకపోవడంతో సభను స్థంభింపజేసే ప్రయత్నం చేసింది. స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే శరవణన్ మాత్రం వీడియోలోని గొంతు తనదికాదని వాదిస్తున్నారు.
(తప్పక చదవండి: ఇదిగో సాక్ష్యం)