తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు! | Government Vidyasagar Rao seeks 'a factual report' on Tamil Nadu Assembly incidents | Sakshi
Sakshi News home page

తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!

Published Mon, Feb 20 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!

తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!

బలపరీక్ష సమయంలో సభలోకి రావడంపై వివాదం
► పళని విశ్వాస పరీక్షపై సమగ్ర నివేదిక సమర్పించండి
► తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్‌ ఆదేశం
► స్టాలిన్ , పన్నీర్‌ ఫిర్యాదుల నేపథ్యం

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. వాస్తవానికి అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్  ఆదివారం ఉదయమే ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంలు వేర్వేరుగా తనతో భేటీ అయ్యి ఇచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్‌ పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సభలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా జరిగిన ఓటింగ్‌పై వివరాలు అందజేయాలని కోరినట్లు తెలిసింది.

మరోవైపు శనివారం  నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్  ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిశారు. స్టాలిన్  తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ పై దాడిని వివరించడంతో పాటు బలపరీక్షలో పళనిస్వామి గెలుపును రద్దు చేయాలని, మరోమారు బల పరీక్షకు ఆదేశించాలని విన్నవించారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం గవర్నర్‌ను కలసి అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, స్పీకర్‌ వ్యవహరించిన తీరును వివరించారు. పళనిస్వామి గెలుపు చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  సీఎం పళని స్వామి కూడా ఆదివారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో డీఎంకే పనిగట్టుకుని వీరంగాన్ని సృష్టించిందని విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.

22న డీఎంకే దీక్షలు
స్టాలిన్  మీద జరిగిన దాడిపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్  సమావేశం అయ్యారు. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్  నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరనున్నామని స్టాలిన్  తెలిపారు. మెరీనా తీరంలో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి నిరసన దీక్ష నిర్వహించారంటూ ఇద్దరు డీఎంకే ఎంపీలు, స్టాలిన్ తో పాటు 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు.

ఐపీఎస్‌ల గుర్తింపు!
తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎస్‌ అధికారులు ప్రవేశించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. శనివారం నాడు డీఎంకే సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు తరలించేందుకు మార్షల్స్‌ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్షల్స్‌ యూనిఫామ్‌లో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లుగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో తేలినట్టు తెలిసింది. సభలో ప్రవేశించిన 9 మంది ఐపీఎస్‌ అధికారులను గుర్తించినట్టు కూడా తెలిసింది. ముందస్తు పథకం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దింపారని, ప్రతిపక్ష నేత స్టాలిన్ పై దాడి కూడా పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

శనివారం నాటి పరిణామాలపై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. మార్షల్స్‌ యూనిఫామ్‌ ధరించి పలువురు ఐపీఎస్‌ అధికారులు సభలో ప్రవేశించారని, అదికూడా స్పీకర్‌ సభలో లేని సమయంలో ప్రవేశించారని తెలుస్తోంది. వీరిలో చెన్నైలో అసిస్టెంట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్‌ కుమార్, ఆర్‌.సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌లను గుర్తించినట్లు తెలిసింది. సభలో చెలరేగిన గందరగోళం నేపథ్యంలో ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.  ఇలావుండగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉన్న గవర్నర్‌ ముంబైకి బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement