స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
⇒ రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆందోళనలు
⇒ గవర్నర్‌కు ఫిర్యాదు
⇒ ఇక ప్రజాఉద్యమం: స్టాలిన్
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ నిరసనకారుల్ని అరెస్టు చేయడంతో ఏదేని అల్లర్లు బయలు దేరవచ్చన్న ఉత్కంఠ బయలుదేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసన
స్టాలిన్ అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి నేరుగా మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టడం ఉత్కంఠను రేపింది. ఆయన్ను ఆగమేఘాలపై అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేసినా, ఒక్కసారిగా ఆ పరిసరాల్లో డీఎంకే వర్గాలు దూసుకురావడంతో పోలీసులు సంయమనం పాటించాల్సి వచ్చింది.
ఎమ్మెల్యేలను అరెస్టు చేసినా, స్టాలిన్‌ను అరెస్టు చేయడానికి వెనక్కు తగ్గారు. వేలాదిగా మెరీనా వైపుగా జనసందోహం సైతం తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న ఆందోళన బయలు దేరింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్టాలిన్‌ను బుజ్జగించారు. మరో జల్లికట్టు ఉద్యమం బయలు దేరనున్నదా అన్నంతగా జనం తరలి వస్తుండడం, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదాన్ని గ్రహించిన స్టాలిన్ పోలీసులకు సహకరించక తప్పలేదు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీలో పాతిపెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలను ఏకంచేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు.