‘రాజీవ్‌ హంతకులను విడుదల చేయవద్దు’ | Rajiv Convicts will Not be Released: TN Govt Tells HC | Sakshi
Sakshi News home page

‘రాజీవ్‌ హంతకులను విడుదల చేయవద్దు’

Published Wed, Aug 16 2017 6:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

‘రాజీవ్‌ హంతకులను విడుదల చేయవద్దు’

‘రాజీవ్‌ హంతకులను విడుదల చేయవద్దు’

సాక్షి, చెన్నై: ‘పిటిషన్‌దారులు హతమార్చింది సాధారణ వ్యక్తిని కాదు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని. ఆయన దారుణ హత్య దేశం మొత్తాన్ని కుదిపేసింది. పైగా ఇంతటి ఘోరానికి పాల్పడి యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నా ఏమాత్రం పశ్చాత్తాపం పడని వారిని క్షమించి ముందుగా విడుదల చేయడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది’. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో బుధవారం ఒక పిటిషన్‌ దాఖలు చేసింది.

రాజీవ్‌ హత్యకేసులో వేలూరు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న రాబర్ట్‌ పయాస్, జయ కుమార్‌ తమను ముందుగా విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2006లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సెల్వం, పొన్‌ కలైయరసన్‌లు విచారిస్తున్నారు. పిటిషన్‌ దారులను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదు, అలా ముందుగా విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదించింది.

ఈ పిటిషన్‌ న్యాయమూర్తుల ముందుకు బుధవారం మరోసారి విచారణకు రాగా.. తమిళనాడు ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2012లో తయారు చేసిన కౌంటర్‌ పిటిషన్‌నే మరోసారి దాఖలు చేశారు. అప్పట్లో హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజగోపాల్‌ పేరుతో దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. యావజ్జీవ శిక్ష ఖైదీలైన రాబర్ట్‌పయాస్, జయకుమార్‌లు 20 ఏళ్లకు పైగా జైలులో ఉన్నారని, అయితే వారిపై రుజువైన హత్యా నేరం చాలా తీవ్రమైందని, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వారి చేతిలో దారుణ హత్యకు గురికావడం దేశం యావత్తును స్తంభింపజేసిందని ఆయన చెప్పారు.

ముందస్తు విడుదల కోరుతూ 2006లో వారు చేసిన పిటిషన్‌పై 2007లో విచారణ కమిషన్‌ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ కమిషన్‌ అన్ని కోణాల్లో విచారణ జరిపిందని అన్నారు. పిటిషన్‌ దారులు 2009లో జైలులో శాంతి భద్రతల సమస్యలు సృష్టించినట్లుగా విచారణ కమిషన్‌ సమర్పించిన ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో వారిలో మానసిక పరివర్తన చోటు చేసుకున్నట్లుగా అధికారులు పేర్కొనలేదు కాబట్టి ముందుగా విడుదల చేయకూడదని అన్నారు.

అంతేగాక 2010లో ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ సైతం వీరి విడుదలకు సిఫార్సు చేయలేదని తెలిపారు. అలాగే వీరిని ముందుగా విడుదల చేయొచ్చా? లేదా చేయకూడదా? అనే రీతిలో రాజీవ్‌గాంధీ కుటుంబ సభ్యులెవరు ఉత్తరం రాయలేదని చెప్పారు. ఆయా కారణాల దృష్ట్యా రాబర్ట్‌ పయాస్, జయ కుమార్‌లను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు కేసుపై విచారణను ఈ నెల18వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement