మంత్రిజయకుమార్
యువతితో సంబంధం, గర్భం, అబార్షన్ ప్రయత్నం, మగ బిడ్డకు జననం అంటూ రచ్చకెక్కిన ఆడియో వ్యవహారంలో మంత్రిజయకుమార్ చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మీద చర్చకు మహిళా కమిషన్‌లో న్యాయవాది సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.ఆడియోలో మాట్లాడింది మంత్రి జయకుమారే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ స్పష్టం చేశారు.
సాక్షి, చెన్నై: ఓ యువతితో ఏర్పడ్డ సంబంధం, ఆమె గర్భం దాల్చడం, అబార్షన్ చేయించేందుకు ప్రయత్నాలు చేయడం, చివరకు ఆ యువతి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా, దీనిని దాచి పెట్టే రీతిలో చేసిన ప్రయత్నాలను వెలుగులోకి తెస్తూ, మంత్రి జయకుమార్‌ను టార్గెట్ చేసిన ఆడియోలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఆడియోలో పేర్కొంటున్న ఆ యువతి బ్రాడ్‌వేకు చెందినట్టు వెలుగులోకి వచ్చింది. కోవలం నుంచి ఈ ఎపిసోడ్ మొదలైనట్టుగా ప్రచారం ఊపందుకుంది. పూజల పేరిట ఓ స్వామిజీ సాగించిన వ్యవహారం, మోసం, న్యాయం కోసం మంత్రి ఇంటి తలుపులు తట్టడం వంటి పరిణామాలతో ఈ సంబంధం కొనసాగినట్టు ఆరోపణలు, ప్రచారం గుప్పుమంటోంది. ఇది సంబంధం, ఆడియో వ్యవహారం 2016లో సాగినా, ఇన్నాళ్లు దాచి పెట్టి, ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి ఉండటం గమనార్హం. ఆడియోలో ఉన్న గళం తనది కాదని మంత్రి జయకుమార్ పేర్కొంటున్నా, ఆయన విచారణకు సిద్ధం కావాలని, ముందుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు.
మహిళా కమిషన్‌లో ఫిర్యాదు
తనకు ఏ సంబంధం లేదంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నా, ఈ వ్యవహారాన్ని అంత సులభంగా వదలిపెట్టే పరిస్థితుల్లో కొందరు లేనట్టుగా ఉంది. సురేష్ బాబు అనే న్యాయవాది ఏకంగా జాతీయ మహిళా కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వివరణ కోరుతూ ఒకటి రెండు రోజుల్లో మంత్రి జయకుమార్‌కు సమన్లు సైతం జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో మంత్రి జయకుమార్‌కు మున్ముందు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు దినకరన్, సెంథిల్ బాలాజి, తంగ తమిళ్ సెల్వన్ డిమాండ్ చేస్తున్నారు. ఆడియోలో ఉన్న గళం జయకుమార్‌దే అని స్పష్టం చేస్తున్నారు.
తప్పును కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు జరిగాయని, దినకరన్ మీద మంత్రి ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని తంగతమిళ్ సెల్వన్ హెచ్చరించారు. ఈ ఆడియో వ్యవహారంలో అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉప్పు తిన్న వాడు.. నీళ్లు తాగాల్సిందేనని, ఆ దిశగా మంత్రి తీరు ఉందంటూ దినకరన్ మండిపడ్డారు. ఆడియోలో ఉన్నది ఆయన గళం కానప్పుడు, పదవికి రాజీనామా చేసి, విచారణకు సిద్ధం కావచ్చుగా అని సవాల్ చేశారు. కాగా, సమాచార మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, పెద్దాయన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకే పనిగట్టుకుని ఎవరో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment