Phone Call Voice
-
నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో ఫోన్ కాల్ రికార్డ్ కలకలం రేపుతోంది. నవీన్‌ను హత్యచేసిన అనంతరం హరిహర తన ఫ్రెండ్‌తో ఫోన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. నవీన్‌ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన ప్రేయసి విషయంలో తగాదా వచ్చిందని డ్రగ్స్ తాగుతానని నవీన్ అన్నట్లు.. నవీన్ ఫ్రెండ్‌తో హరిహర సంభాషించాడు. నవీన్‌పై మిస్సింగ్ కేసు పెడతామంటూ నవీన్ ఫ్రెండ్‌కు హరిహర సలహా కూడా ఇచ్చాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’
Vande Mataram While Answering Calls.. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారులు, కార్మికులకు కీలక సూచన చేశారు.. వీరంతా తమ ఫోన్లు లిఫ్ట్ చేసిన వెంటనే హలో అని కాకుండా వందేమాతరం సమాధానం ఇవ్వాలని ఆర్డర్ వేశారు. కాగా, హలో అనే ఇంగ్లీష్ పదం.. అందుకే దాన్ని వదులుకోవడం మంచిది. వందేమాతరం అనేది కేవలం పదం కాదు, ప్రతీ భారతీయుడు అనుభవించే అనుభూతి అని ఆయన స్పష్టం చేశారు. భారతీయులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నారు. అందుకే, అధికారులు హలో బదులుగా ఫోన్లో 'వందేమాతరం' అని చెప్పాలని తాను కోరుకుంటున్నాను అని తెలిపారు అయితే, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పోర్ట్‌ఫోలియోలను అప్పగించిన కొద్దిసేపటికే మంత్రి సుధీర్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరోవైపు.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదివారం మంత్రులకు శాఖలను అప్పగించారు. ఇందులో డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక శాఖలను దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించి.. పట్టణ అభివృద్ధి శాఖ, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ప్రాజెక్ట్స్) పోర్ట్‌ఫోలియోలను సీఎం షిండే తీసుకున్నారు. బీజేపీ మంత్రి రాధాక్రిష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ శాఖ బాధ్యతలు, బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్ అటవీ శాఖను అప్పగించారు. #Maharashtra minister Sudhir Mungantiwar directed his officials in the department to start telephonic conversations with 'Vande Mataram' instead of greeting a phone call with a 'hello' (@sahiljoshii) https://t.co/yUaWLV17oE — IndiaToday (@IndiaToday) August 15, 2022 ఇది కూడా చదవండి: 75 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు.. పేదలకు సాయం నా లక్ష్యం: ప్రధాని మోదీ -
యువతితో సంబంధం.. నిజమే !
యువతితో సంబంధం, గర్భం, అబార్షన్ ప్రయత్నం, మగ బిడ్డకు జననం అంటూ రచ్చకెక్కిన ఆడియో వ్యవహారంలో మంత్రిజయకుమార్ చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మీద చర్చకు మహిళా కమిషన్‌లో న్యాయవాది సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.ఆడియోలో మాట్లాడింది మంత్రి జయకుమారే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: ఓ యువతితో ఏర్పడ్డ సంబంధం, ఆమె గర్భం దాల్చడం, అబార్షన్ చేయించేందుకు ప్రయత్నాలు చేయడం, చివరకు ఆ యువతి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా, దీనిని దాచి పెట్టే రీతిలో చేసిన ప్రయత్నాలను వెలుగులోకి తెస్తూ, మంత్రి జయకుమార్‌ను టార్గెట్ చేసిన ఆడియోలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఆడియోలో పేర్కొంటున్న ఆ యువతి బ్రాడ్వేకు చెందినట్టు వెలుగులోకి వచ్చింది. కోవలం నుంచి ఈ ఎపిసోడ్ మొదలైనట్టుగా ప్రచారం ఊపందుకుంది. పూజల పేరిట ఓ స్వామిజీ సాగించిన వ్యవహారం, మోసం, న్యాయం కోసం మంత్రి ఇంటి తలుపులు తట్టడం వంటి పరిణామాలతో ఈ సంబంధం కొనసాగినట్టు ఆరోపణలు, ప్రచారం గుప్పుమంటోంది. ఇది సంబంధం, ఆడియో వ్యవహారం 2016లో సాగినా, ఇన్నాళ్లు దాచి పెట్టి, ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి ఉండటం గమనార్హం. ఆడియోలో ఉన్న గళం తనది కాదని మంత్రి జయకుమార్ పేర్కొంటున్నా, ఆయన విచారణకు సిద్ధం కావాలని, ముందుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు తనకు ఏ సంబంధం లేదంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నా, ఈ వ్యవహారాన్ని అంత సులభంగా వదలిపెట్టే పరిస్థితుల్లో కొందరు లేనట్టుగా ఉంది. సురేష్ బాబు అనే న్యాయవాది ఏకంగా జాతీయ మహిళా కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వివరణ కోరుతూ ఒకటి రెండు రోజుల్లో మంత్రి జయకుమార్‌కు సమన్లు సైతం జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో మంత్రి జయకుమార్‌కు మున్ముందు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు దినకరన్, సెంథిల్ బాలాజి, తంగ తమిళ్ సెల్వన్ డిమాండ్ చేస్తున్నారు. ఆడియోలో ఉన్న గళం జయకుమార్దే అని స్పష్టం చేస్తున్నారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు జరిగాయని, దినకరన్ మీద మంత్రి ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని తంగతమిళ్ సెల్వన్ హెచ్చరించారు. ఈ ఆడియో వ్యవహారంలో అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉప్పు తిన్న వాడు.. నీళ్లు తాగాల్సిందేనని, ఆ దిశగా మంత్రి తీరు ఉందంటూ దినకరన్ మండిపడ్డారు. ఆడియోలో ఉన్నది ఆయన గళం కానప్పుడు, పదవికి రాజీనామా చేసి, విచారణకు సిద్ధం కావచ్చుగా అని సవాల్ చేశారు. కాగా, సమాచార మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, పెద్దాయన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకే పనిగట్టుకుని ఎవరో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
మగ బిడ్డకు తండ్రైన మంత్రి : ఆడియో రచ్చ!
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆడియోలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. ఓ యువతితో సీనియర్ మంత్రి ఒకరికి సంబంధం ఏర్పడినట్టు, గర్భం దాల్చిన ఆ యువతి తల్లితో ఆయన సంభాషణలు సాగించినట్టు వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే, ఆ యువతి ప్రస్తుతం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు, ఆ మంత్రి పేరును తండ్రిగా పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నట్టు ఆడియోలో ఉన్న సంభాషణలు రచ్చకెక్కాయి. తొలుత ఓ సీనియర్ మంత్రి అన్న ప్రచారం సాగినా, చివరకు అది జయకుమార్ అన్న చర్చ తెరమీదకు వచ్చింది. దీంతో జయకుమార్ మేల్కొన్నారు. ఆ వాయిస్ తనది కానే కాదని, పోలీసులకు ఫిర్యాదుచేస్తా.. కేసు వేస్తా అంటూనే, చిన్నమ్మ శశికళ కుటుంబం మీదవిరుచుకుపడ్డారు. సాక్షి, చెన్నై : మత్స్య శాఖ మంత్రి జయకుమార్ రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరు. మీడియా ముందుకు వచ్చే తొలి మంత్రి. ఎల్లవేళలా మీడియాతో టచ్‌లో ఉండే ఈయన గళంతో ఆదివారం రాత్రి నుంచి ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో రెండు ఆడియోలు హల్చల్ చేయడం మొదలైంది.వైరల్‌గా మారిన ఈ ఆడియో మీద విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు, ఆగ్రహాల్ని వ్యక్తంచేసే నెట్టిజన్లు పెరిగారు. రసవత్తర సంభాషణలు రెండు రకాలుగా ఉన్న ఆడియోలో మంత్రికి ఓ యువతితో సంబంధం ఏర్పడినట్టు, ఆ యువతి గర్భం దాల్చినట్టు, అబార్షన్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సంభాషణలు ఉన్నాయి. మంత్రి ఆ యువతి తల్లితో మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో వ్యాఖ్యలు ఉండడం రచ్చకెక్కింది. అలాగే, ఆ యువతికి పండంటి మగ బిడ్డ పుట్టినట్టు, మంత్రిని తండ్రిగా పేర్కొంటూ, బర్త్ సర్టిఫికెట్ సైతం పొందినట్టుగా సంభాషణలు ఉండడం రచ్చకు దారితీసింది. ఆ గొంతు పలానా మంత్రిదిలా ఉందని కొందరు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొందరు మంత్రి ఫొటోల్ని సైతం సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో, ఆయన మేల్కొన్నారు. గతంలో ఇలాంటి ఆరోపణల కారణంగానే ఆయన మీద అమ్మ జయలలిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా, ఆ సమయంలో మంత్రి పదవి ఊడినట్టుగా ప్రచారం అయ్యింది. ఆ మంత్రి ఈ మంత్రి ఒక్కరే అన్నట్టు చర్చ జోరందుకుంది. ఎట్టకేలకు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆ మంత్రి మీడియా ముందుకు వచ్చారు. ఆయనే మత్స్యశాఖ మంత్రి జయకుమార్. ఇదో కుట్ర మీడియాతో మాట్లాడిన జయకుమార్, గతంలో తనకు వ్యతిరేకంగా సాగిన ప్రచారాలను గుర్తుచేశారు. గతంలో తానెవరితోనో సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టారని, ఆ కేసులో అప్పట్లో ముగ్గుర్ని పోలీసులు అరెస్టుచేసినట్టు పేర్కొన్నారు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లే, ఇప్పుడు కూడా మరో కుట్రకు సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. ఆ కుటుంబానికి తాను అంటే గిట్టదని, అందుకే తన పేరుకు కళంకం తీసుకు వచ్చే రీతిలో మార్ఫింగ్ చేసిన ఆడియోను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన ఈ ఆడియో వెనుక ఆ కుటుంబమే ఉందంటూ, అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మన్నార్‌కుడి మాఫియా గతంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉందని మండిపడ్డారు. ఈ ఆడియో వారి కుట్రే అని, ప్రధానంగా ఇలాంటి కుట్రలు, వ్యూహాలు రచించడం దినకరన్‌కు అలవాటేనని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడనని పేర్కొన్నారు. తాను సింహం లాంటి వాడ్ని అని, తనను భయపెట్టాలని చూస్తే, తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఈ ఆడియో గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. కేసులు వేస్తా.. అంటూ, ఆ ఆడియోలోని గళం తనది మాత్రం కానే కాదు అని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. -
ఆమె అదృశ్యం..!
ఆమె, అతను పగులబడి నవ్వుతూ.. ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా..’ అంటూ సరసపు సంభాషణతో సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. స్వర పోలికను బట్టి ఆ మహిళ వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినట్లు తెలిసింది. అయితే.. ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆమె అదృశ్యమైంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య గొంతును పోలిన వ్యక్తితో ఫోన్లో సరదాగా మాట్లాడిన మహిళ కనిపించకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సదరు మహిళ తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల భవితవ్యం ఈ ఆడియో క్లిప్పింగ్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో మహిళ అదృశ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏం జరిగింది..? ఓ మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా ఉంటోంది. నిరుపేద కుటుంబానికి చెందిన సదరు మహిళను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక వెసులుబాటు కోసం కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారం కోరవచ్చని.. టీఆర్ఎస్ స్థానిక దిగువ శ్రేణి నేతలను పట్టుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో డబ్బు ఇప్పిస్తారని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుతెలుస్తోంది. దీంతో ఆమె స్థానిక నాయకులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆమాయకత్వాన్ని, ఆర్థికలేమిని ఆసరా చేసుకున్న స్థానిక నాయకులు ఆమె జీవితంతో ఆడుకున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఆ తర్వాత వారి నుంచి ఎగువ శ్రేణి నాయకుడికి చేరువైనట్లు స్థానికులు చెబుతున్నారు. చురుకుగా ఉండే ఆమెకు మండల స్థాయిలో ఒక పోస్టు ఇస్తామని చెప్పి, ఆ మేరకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇంకొంత చనువు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన్ని స్థానికంగా ఉన్న నాయకులు ఆమెతో సెల్ఫోన్లో సంభాషణ చేశారు (బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్‌లో వారి పేర్లు ఉన్నాయి). చైనా తయారీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న సదరు మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో వాయిస్ రికార్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సోమదేవరపల్లి నుంచే లీకైందా..? 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో స్త్రీ, పురుషులిద్దరూ పగులబడి నవ్వుతూ సంభాషణ సాగిస్తారు. ఫోన్లో సహజంగానే ఈ సంభాషణ రికార్డు అయింది. ఆడియో క్లిప్పింగ్‌లోని పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజామాజీ ఎమ్మెల్యే రాజయ్య స్వరంను పోలి ఉండడంతో.. రాజకీయంగా తనను అణగదొక్కటానికి తన గొంతును మిమిక్రీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అతను స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, మహిళతో పరిచయం ఉన్న సోమదేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 8 నెలల కిందట çఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. ఆడియో స్టోర్ నుంచి వాయిస్ రికార్డ్ క్లిప్పింగ్‌ను ఆమెకు తెలియకుండా తన ఫోన్లోకి పంపుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక అక్కడి నుంచి వాయిస్ రికార్డు ముందుగా ఎక్కడికి వెళ్లిందనే వివరాలు తెలియరాలేదు. నైతికతపై దాడి నేపథ్యంలో.. రాజయ్యకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిన నాటి నుంచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవువుతున్నాయి. తొలుత రాజా రపు ప్రతాప్‌తో మొదలైన అసమ్మతి.. క్రమంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడియో క్లిప్పింగ్ బయటికి వచ్చింది. అదే రోజు సదరు మహిళ హుటాహుటిన హన్మకొండకు వెళ్లినట్లు, అప్పటి నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. కడియం శ్రీహరినే పోటీలో ఉండాలని కోరుతూ ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వరంగల్ సర్క్యూట్ హౌస్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీని మీద అధినాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. చివరి అస్త్రంగా ప్రత్యర్థి నైతికత మీద దెబ్బ తీయడానికి, అవసరమైనప్పుడు ము ఖ్యమంత్రి ముందుకు తీసుకుపోవటానికి కడి యం శ్రీహరి అనుచరులు ఆమెను తీసుకుపోయి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు మహిళపై ఒత్తిడి తెచ్చి ఒక వేళ ఆడియో క్లిప్పింగ్‌లో ఉన్న పురుష గొంతు తమ నేతది కాకు న్నా.. ఆయనదే అని చెప్పిస్తారేమోననే ఉద్దేశంతో రాజయ్య అనుచరులు తీసుకెళ్లి ఉండవచ్చనే మరో ప్రచారం సైతం జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీ సు యంత్రాంగం స్పందించి.. ఎక్కడున్నా ఆమె ను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మిమ్మల్ని సస్పెండ్ చేయకపోతే.. సీఎండీకి ఉంటది!
‘‘సిమ్‌లు వెనక్కిస్తామని నన్నే బెదిరిస్తారా? అశాంతి నెలకొల్పుతున్నారంటూ మీ మీద సీఎండీకి లెటర్ పెట్టానంటే వెంటనే సస్పెండ్ అవుతారు జాగ్రత్త! ఒకవేళ చేయకపోతే సీఎండీకి మళ్లీ వేరే విధంగా ఉంటుంది. వీరేష్ మీద నేనే ఏసీబీ వారికి చెప్పి నిలబెట్టాను. ఇలాగైతే నేనే మళ్లీ చెప్పాల్సి వస్తుంది.. పోయి పడిపోండని. సిమ్‌కార్డు తిరిగిచ్చి చూడండి!’’అంటూ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కర్నూలు జిల్లా ఎస్ఈ భార్గవరాముడు కిందిస్థాయి ఉద్యోగితో ఫోన్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ భార్గవరాముడు వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఏకంగా సీఎండీని ఉద్దేశించి..తాను చెప్పినట్లు చేయకపోతే ‘వేరే విధంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించడం ఆయన తీరుకు అద్దం పడుతోంది. కిందిస్థాయి అధికారిపై ఏసీబీ దాడులు చేయకుండా తానే ఆపానని, మళ్లీ తాను చెబితే దాడులు చేస్తారని చెప్పడం కూడా కలకలం రేపుతోంది. ఏసీబీ తన చెప్పుచేతల్లో ఉందనే రీతిలోఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో ఆదోని డివిజన్‌కు చెందిన ఒక ఇంజినీరుతో ఎస్ఈ చేసిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం.. అందులోనూ ఆయన వ్యాఖ్యల తీరుపై ఆ శాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. మేం పనిచేయలేం! ఎస్ఈ భార్గవరాముడు తమను సాటి ఇంజినీర్లని కూడా చూడకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ఆదోని డివిజన్‌కు చెందిన డీఈతో పాటు ఏడీఈ, ఏఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై నేరుగా సీఎండీతో పాటు వివిధ ఇంజినీర్ల సంఘాలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలను సహించడం తమ వల్ల కాదని, మరీ బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాము పనిచేయలేమంటూ సెలవుపై వెళ్లాలని భావిస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో డీఈ, ఏడీఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈ ఒక ఇంజినీరుకు ఫోన్ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా ఏసీబీ పేరు కూడా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. తన మాట విని ఏసీబీ అధికారులు మీరు అవినీతి చేస్తున్నా చూడకుండా వదిలేశారనే అర్థంలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ ఆడియోటేపు ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో సదరు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. వేధింపుల పర్వం విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యవహారశైలి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంటోంది. ఉద్యోగులతో ప్రవర్తించే తీరు సరిగా లేదని, వారితో మాట్లాడే భాష చాలా అసహ్యంగా ఉంటోందనే విమర్శలున్నాయి. ఆయన వాడిన బూతు పదాలను కూడా పేర్కొంటూ ఈ ఎస్ఈ కింద తాను పనిచేయలేనని, బదిలీ చేయాలంటూ ఆదోని డివిజన్ డీఈ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదే తరహాలో పలువురు ఇంజినీర్లు కూడా ఎస్ఈ వ్యవహారశైలిపై లోలోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. చెప్పడానికి వీలులేని భాషలో తిడుతూ తమను కించపరుస్తున్నారని వారు వాపోతున్నారు. మొత్తమ్మీద ఎస్ఈ భార్గవరాముడు మాట్లాడిన ఆడియోటేపు ఇప్పుడు ఈ శాఖలో కలకలం రేపుతోంది. -
బాగా హర్ట్ అయిన..మంచి మొబైల్ ఇప్పియ్యి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పోలీసుల అవినీతి, అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలవడంతోపాటు భూ వివాదాల్లో ఇరువర్గాల మధ్య సెటిల్మెంట్లు చేసి నజరానాలు తీసుకోవడం సర్వసాధారణమై పోయింది. మంచి ర్యాల పట్టణంలోని సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ కార్యాలయం వెనుక స్థలానికి సంబంధించిన భూ వివాదంలో మంచిర్యాల ఏసీపీ చెన్నయ్య, బదిలీ అయిన సీఐ సుధాకర్ ఏసీబీ విచారణ ఎదుర్కొం టున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భూ వివాదంలో నస్పూరు సబ్ ఇన్స్పెక్టర్ దత్తాత్రి తెరపైకి వచ్చారు. నస్పూరు రాళ్లవాగు సమీపంలోని ఓ భూ వివాదంలో ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సెటిల్మెంట్ చేసినందుకు మంచి ఫోన్ ఇప్పించమంటూ ఫోన్లో మాట్లాడినట్లుగా చెపుతున్న వాయిస్ రికార్డింగ్ ఇప్పు డు వైరల్‌గా మారింది. నస్పూరులోని ఓ భూ వివాదంలో ఎస్పీ చెబితే పని చేసినందుకు తనను పట్టించుకోలేదని, తాను హర్ట్ అయ్యానని సంజీవరెడ్డి అనే ఓ రియల్టర్‌తో మాట్లాడినట్లుగా రికార్డులో ఉంది. కనకయ్య అనే వ్యక్తికి సంబంధించిన వివాదంలో సంజీవరెడ్డికి మేలు చేసినట్లుగా ఫోన్ రికార్డును బట్టి తెలుస్తోంది. అయితే నస్పూరు ఎస్ఐగా పనిచేస్తున్న దత్తాత్రిని ఇరికించేందుకే ఫోన్ రికార్డు చేసినట్లు పోలీస్ వర్గాలు చెపుతున్నప్పటికీ, సంజీవరెడ్డి ఎక్కడా దత్తాత్రి పేరును ఉటంకించకపోవడం గమనార్హం. దీనిపై ‘సాక్షి ప్రతినిధి’ ఎస్ఐ దత్తాత్రిని సంప్రదించగా ‘నాకైతే ఏమీ తెలియదు. నేను ఎలాంటి ఫోన్ తీసుకోలేదు. సంజీవరెడ్డి లోకల్‌గానే ఉంటడు కదా. ఆయన్నే అడగండి చెపుతడు’ అని సమాధానమిచ్చారు. తాను సాయంత్రం వరకు కోర్టులో ఉన్నానని, తనకు కూడా ఇప్పుడే తెలిసిందని పేర్కొన్నారు. ‘నా గురించి మీకు తెలుసు గదా. నేనెలాంటోన్ని అడిగి ఉంటరు కదా’ అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంచిర్యాలలో ఆగని పోలీస్ సెటిల్మెంట్లు మంచిర్యాల పట్టణం పరిధిలోని సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం షరా మామూలుగా సాగుతోంది. తాజాగా మారుతినగర్‌లోని మూడు ప్లాట్లకు సంబంధించి ఓ ఎస్ఐ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వివాదంలో ఓ వ్యక్తి తనకు సంబంధించిన భూమిగా ఇంజెక్షన్ ఆర్డర్‌తో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, సీఐకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. కానీ అదే స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒకరు అవతలి వర్గానికి మద్ధతుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓ భూ వివాదంలో ఏసీపీ, సీఐలు ఇరుక్కోగా, అనూహ్యంగా ఓ ఎస్ఐ బదిలీ అయ్యారు. తాజాగా మరో ఎస్ఐ సివిల్ తగాదాల్లో తలదూర్చడం వివాదాస్పదమవుతోంది. ఎస్ఐ– సంజీవరెడ్డిల మధ్య ఫోన్‌కాల్ ఇలా సాగింది... సంజీవరెడ్డి: సంజీవరెడ్డి మాట్లాడుతున్న సర్.. ఎస్ఐ: సంజీవరెడ్డి చెప్పూ.. సంజీవరెడ్డి: సార్ సార్ మొన్న అంటిరి గదా.. కనకయ్య విషయంలో... ఒకటేసారి డిసప్పాయింట్ అయిన ఎస్ఐ: అవునయ్యా చెప్పూ నేను అంతగనం కష్టపడి చేస్తే ఏం లాభం చెప్పు. మీరు సెట్ జేసుకొనీ... అది భావ్యమా చెప్పు.. సంజీవరెడ్డి: అయితే ఏంలేదూ. నేను మల్ల గలుద్దామనుకుంటున్న. మా పార్టనర్స్ ఉండిరి. సర్ప్రైజ్ అయిన మీరట్లనెసరికి. నేనేదో మిస్సయిన్నా ఏంది మీతోని అని. ఎస్ఐ: నేను బాగ హర్ట్ అయిన. ఎస్పీ గారు జెపితె నేను జేసిన. కనీసం గిట్ల జేసుకుంటున్నం సార్ అని గుడ జెప్పలేదు నువ్వు నాకు.. సంజీవరెడ్డి: సార్ సార్ ... మరిప్పుడు కలుత్త మరి. ఎంతో జెప్పలేరు సార్... ఎస్ఐ: అరే మొబైల్ ఇప్పియ్యి బై మంచిది సంజీవరెడ్డి: సార్ సార్...(రెట్టించి అడిగాడు) ఎస్ఐ: ఓ మొబైల్ ఇప్పియ్యి మంచి మొబైలు సంజీవరెడ్డి: ఆ ఆ... మొబైల్ ఇప్పియ్యంటరా? సార్ సార్ ఒకే సార్ ఒకే ఎస్ఐ: ఒకేనా నీకు ఇబ్బంది లేకుంటె...ఇప్పుడె.. సంజీవరెడ్డి: ఏమీ లేదు సార్ మొన్న గట్లనెసరికి డిసప్పాయింట్ అయిన. ఎప్పుడు కమ్యునికేషన్ల ఉండెటోల్లం మరి ఎస్ఐ: లేదు గట్లని కాదు గని నేను బాగ హర్టయిన. నేనింత జేసిన. నువ్వు రాంగనె కూసొబెట్టి నువ్వు పిటిషన్ తప్పురాసినా మావోనితోటి మంచిగ రాపించలే? తిరుపతిరెడ్డి తోటి రాయించలేదా? పిటిషన్ మంచిగ రాయించిన. సంజీవరెడ్డి: ఆ... రాయించిన్రు ఎస్ఐ: రాయించిన. గంత ఫోర్స్ జెత్తెనే గద మల్ల మీదగ్గరికొచ్చింది మల్ల. సంజీవరెడ్డి: అవునవును... ఎస్ఐ: నీకు ఇబ్బంది లేకుంటెనె. ఇబ్బంది ఉండద్దు. ఇత్తె పలిగిపోయింది సంజీవరెడ్డి: సార్ సార్.. సరే సార్ అలాగే సార్. సార్ ఇగ మీరేమన్న జేసుకోన్రి. అద్దెచ్చి మీకిత్త. మీరెంతనన్న తీసుకోన్రి. ఎస్ఐ: ఇప్పుడత్తవా. మంచిరాలల ఉన్న దా. ఎంత సేపట్ల వస్తవ్ సంజీవరెడ్డి: మీరెక్కడున్నరు సార్. నేనింట్లనె వున్న. పదినిమిషాలల్ల స్టాటయిత ఎస్ఐ: గణేష్ మొబైల్. మంచిరాలల ఉన్నదా. వత్తనంటె ఉంట. లేదంటె ఎల్లిపోత మరి సంజీవరెడ్డి: మల్లొక్క ఐదు నిమిషాలల్ల జేత్త. మా పెద్దబిడ్డచ్చింది. మనవరాలుతోటి మాట్లాడుతున్న. మీరు మంచిరాలలనె ఉన్నరు గద. ఐదు నిమిషాలల్ల కాల్ బ్యాక్ చేస్త. -
తొలిసారి దావూద్ ఇబ్రహీం మాట్లాడాడు
న్యూఢిల్లీ: కరడుగట్టిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ 1993లో భారత్‌లోని ముంబయిలో పేలుళ్లకు కీలక సూత్రదారుడు దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నట్లు స్పష్టమైంది. ఆయనతో నేరుగా ఓ టీవీ చానెల్ ఫోన్లో మాట్లాడింది. దాదాపు 13 నిమిషాలపాటు సాగిన ఫోన్ సంభాషణలో తొలుత రెండు మాటలు మాత్రమే మాట్లాడిన దావూద్ ఆ తర్వాత తన అనుచరుడికి ఫోన్ ఇచ్చాడు. మొన్నటి వరకు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ వచ్చిన వార్తలకు భిన్నంగా అతడి గొంతు వింటుంటే చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. సీఎన్ఎన్ చానెల్ కరాచీలోని క్లిఫ్టన్లోగల పలాటియల్ బంగ్లాకు నేరుగా ఫోన్ చేసింది. అది దావూద్ ఇబ్రహీం ఉంటున్న బంగ్లా. తొలుత ఫోన్ చేసిన సీఎన్ఎన్ ప్రతినిధి ఏం మాట్లాడారంటే.. మీడియా ప్రతినిధి : హలో.. హలో దావూద్ : హా.. హాజీ(చెప్పండి) మీడియా ప్రతినిధి : దావూద్ సాబ్ దావూద్ : నువ్వెవరు? (ఆప్ కౌన్) మీడియా ప్రతినిధి : గుడ్ ఈవినింగ్.. మాట్లాడుతుంది సీఎన్ఎన్ ప్రతినిధి దావూద్ : నీతో చొటానీ మాట్లాడతాడు మీడియా ప్రతినిధి: ఏంటండీ.. అంటుండగానే దావూద్ తన ఫోన్‌ను కీలక అనుచరుడు 2013ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన జావెద్ చోటానికి ఫోన్ ఇచ్చారు. జావెద్ చోటానీ : హలో ఎవరు? మీడియా ప్రతినిధి: కొంచెం దావూద్ సాబ్‌కు ఫోన్ ఇస్తారా జావెద్ చోటానీ : దావూద్ ఎవరు? మీడియా ప్రతినిధి : దావూద్ ఇబ్రహీ సాబ్. మీరు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నరన్నమాట. జావెద్ చోటానీ : ఎవరు చెప్పారు? మీడియా ప్రతినిధి : ఇది పాకిస్థాన్ ఫోన్ నెంబర్ దావూద్: సమయం వృధా చేయకు(నేరుగా ఫోన్లో చెప్పకుండా చొటానీకి దావూద్ ఈ మాట చెబుతుండగా ఫోన్లో వినిపించింది) జావెద్ చోటానీ : సమయం వృధా చేస్తున్నావ్. మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు నువ్వు? నీకు అసలు ఏమన్నా తెలుసా? నువ్వు చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు.. ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మీడియా ప్రతినిధి : దావుద్ తో ఈ మాట విన్నాక చోటానీ దేవుడిని తలుచుకుంటూ దావూద్‌ని ఇలాగేనా అనేది, ఇలా పిలుస్తూనే ఇంటర్వ్యూ తీసుకుంటావా? అసలు ఈ ఫోన్ నెంబర్ ఎవరిచ్చారని ప్రశ్నించాడు. వెంటనే నెంబర్ తొలగించమని, మీడియా ప్రతినిధి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. నెంబర్ ఇస్తే మాట్లాడిస్తానని చెప్పాడు. దీంతో నెంబర్ ఇవ్వగా, నేరుగా స్టూడియోలో ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ప్రశ్నించాడు. దీంతో తాను కరాచీకి కెమెరా పంపిస్తానని ప్రతినిధి చెప్పగా.. కరాచీనా? ఎందుకు.. ఇంటర్వ్యూ లేదు ఏమి లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు. దీని ద్వారా దావూద్ బతికే ఉన్నాడని, అది కూడా కరాచీలోనే ఉన్నాడని స్పష్టమైంది.