ఆమె అదృశ్యం..! | Phone Call Audio Woman Missing In Warangal | Sakshi
Sakshi News home page

ఆమె అదృశ్యం..!

Published Sun, Sep 23 2018 9:01 AM | Last Updated on Sat, Sep 29 2018 2:47 PM

Phone Call Audio Woman Missing In Warangal - Sakshi

ఆమె, అతను పగులబడి నవ్వుతూ.. ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్‌ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్‌ ఏవ్వా.  ఏవ్వా.. ఏవ్వా..’ అంటూ సరసపు సంభాషణతో సోషల్‌ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్‌ ఇటీవల హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. స్వర పోలికను బట్టి ఆ మహిళ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఓ గ్రామానికి  చెందినట్లు తెలిసింది. అయితే.. ఆడియో క్లిప్పింగ్‌ వెలుగులోకి
వచ్చిన నాటి నుంచి ఆమె అదృశ్యమైంది.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య గొంతును పోలిన వ్యక్తితో ఫోన్‌లో సరదాగా మాట్లాడిన మహిళ కనిపించకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సదరు మహిళ తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని వెల్లడించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు నేతల భవితవ్యం ఈ ఆడియో క్లిప్పింగ్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో మహిళ అదృశ్యం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏం జరిగింది..?
ఓ మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా  ఉంటోంది. నిరుపేద కుటుంబానికి  చెందిన సదరు మహిళను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక వెసులుబాటు కోసం కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారం కోరవచ్చని.. టీఆర్‌ఎస్‌ స్థానిక దిగువ శ్రేణి  నేతలను పట్టుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో  డబ్బు ఇప్పిస్తారని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుతెలుస్తోంది. దీంతో ఆమె స్థానిక నాయకులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆమాయకత్వాన్ని, ఆర్థికలేమిని ఆసరా చేసుకున్న స్థానిక నాయకులు ఆమె జీవితంతో ఆడుకున్నట్లు  ప్రాథమికంగా తెలిసింది. ఆ తర్వాత వారి నుంచి ఎగువ శ్రేణి నాయకుడికి చేరువైనట్లు స్థానికులు చెబుతున్నారు. చురుకుగా ఉండే ఆమెకు మండల స్థాయిలో ఒక పోస్టు ఇస్తామని చెప్పి, ఆ మేరకు ఇచ్చినట్లు  సమాచారం. దీంతో ఇంకొంత చనువు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన్ని స్థానికంగా ఉన్న నాయకులు ఆమెతో సెల్‌ఫోన్‌లో సంభాషణ చేశారు (బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్‌లో వారి పేర్లు ఉన్నాయి).  చైనా తయారీ సెల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న సదరు మహిళ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాయిస్‌ రికార్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

సోమదేవరపల్లి నుంచే లీకైందా..?
5.43 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో స్త్రీ, పురుషులిద్దరూ పగులబడి నవ్వుతూ సంభాషణ సాగిస్తారు. ఫోన్‌లో సహజంగానే ఈ సంభాషణ రికార్డు అయింది. ఆడియో క్లిప్పింగ్‌లోని పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ తాజామాజీ ఎమ్మెల్యే రాజయ్య స్వరంను పోలి ఉండడంతో.. రాజకీయంగా తనను అణగదొక్కటానికి తన గొంతును మిమిక్రీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అతను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, మహిళతో పరిచయం ఉన్న  సోమదేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  దాదాపు 8 నెలల కిందట çఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. ఆడియో స్టోర్‌ నుంచి వాయిస్‌ రికార్డ్‌ క్లిప్పింగ్‌ను ఆమెకు తెలియకుండా  తన ఫోన్‌లోకి పంపుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక అక్కడి నుంచి వాయిస్‌ రికార్డు ముందుగా ఎక్కడికి వెళ్లిందనే వివరాలు తెలియరాలేదు.

నైతికతపై దాడి నేపథ్యంలో..
రాజయ్యకు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కేటాయించిన నాటి నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవువుతున్నాయి. తొలుత రాజా రపు  ప్రతాప్‌తో మొదలైన అసమ్మతి.. క్రమంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా  ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడియో క్లిప్పింగ్‌ బయటికి వచ్చింది. అదే రోజు సదరు మహిళ హుటాహుటిన హన్మకొండకు వెళ్లినట్లు, అప్పటి నుంచే ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. కడియం శ్రీహరినే పోటీలో ఉండాలని కోరుతూ ఇటీవల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున వరంగల్‌ సర్క్యూట్‌ హౌస్‌ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీని మీద అధినాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. చివరి అస్త్రంగా ప్రత్యర్థి నైతికత మీద దెబ్బ తీయడానికి, అవసరమైనప్పుడు ము ఖ్యమంత్రి ముందుకు తీసుకుపోవటానికి కడి యం శ్రీహరి అనుచరులు ఆమెను తీసుకుపోయి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు  మహిళపై ఒత్తిడి తెచ్చి ఒక వేళ ఆడియో క్లిప్పింగ్‌లో ఉన్న పురుష గొంతు తమ నేతది కాకు న్నా.. ఆయనదే అని చెప్పిస్తారేమోననే ఉద్దేశంతో రాజయ్య అనుచరులు తీసుకెళ్లి ఉండవచ్చనే మరో ప్రచారం సైతం జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీ సు యంత్రాంగం స్పందించి.. ఎక్కడున్నా ఆమె ను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement