అక్కడ సీఎంగా చంద్రబాబు, ఇక్కడ కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 361మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారు. ఒక్క స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కడియం వేసిన శిలాఫలకాలకు నేనే స్వయంగా పిండాలు పెట్టా. కేవలం పదవుల కోసం ఇక్కడికి వస్తున్నారు.. ఓటమి చెందగానే కనిపించకుండా పోతారు. స్టేషన్‌ఘనపూర్ నా అడ్డా .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను.
– చిన్నపెండ్యాలలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ఒకేపార్టీలో పనిచేస్తున్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. క్రమశిక్షణ కూడిన పార్టీలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నా.. స్టేషన్ ఘన్‌పూర్ నా గడ్డ అని చెప్పుకుంటున్న నువ్వు, నేను కలిసి నియోజకవర్గంలో ఓ సర్వే నిర్వహిద్దాం. ప్రజల తీర్పునకు కట్టుబడి ఉంటావా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేస్తున్నా.. భవిష్యత్‌లో కూడా సీఎం ఆదేశాల మేరకు పని పనిచేస్తా.. ఎన్‌కౌంటర్లను ఎప్పుడూ ప్రోత్సహించలేదు.
– స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల పోరు ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడం గులాబీ గూటిలో కలకలం రేపుతోంది. నర్మగర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే ఇద్దరు నేతలు.. ఇప్పుడో అడుగు ముందుకేశారు. సోమవారం చిల్పూరులో ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ శ్రీహరి మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు వాగ్భానాలు వదలడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు..
స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరిలు.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో సుమారు ఆరు నెలల కిందట మళ్లీ ఎమ్మెల్సీగా నియమితులైన కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఇదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ రాబోతుందన్న శ్రీహరి ప్రచారం కూడా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య తప్పుబట్టారు.
తాజాగా సోమవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య... చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో స్టేషన్‌ఘన్‌పూర్ దళిత బిడ్డలు ఎక్కువగా చనిపోయారని వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి తెర తీసింది. స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను అని కామెంట్ చేయడంపై మంగళవారం మీడియా సమావేశంలో స్పందించిన కడియం శ్రీహరి.. ‘ప్రజల మద్దతు కోల్పోతున్న నువ్వు నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా’అని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎవరి అడ్డా కాదన్నారు.
చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా?
రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలని అన్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రాజయ్య తాను ప్రభుత్వాల తీరుపై మాట్లాడే క్రమంలో టీడీపీ, చంద్రబాబు హయాంలో ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. ‘అవును ముమ్మాటికీ స్టేషన్‌ఘన్‌పూర్ అడ్డా.. నా గడ్డా... ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే వైద్యం చేశా.. నేను చస్తే కూడా నా సమాధి ఇక్కడే’ అంటూ వ్యాఖ్యానించారు.
తారస్థాయికి చేరిన విభేదాలు
ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యల మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఒకే పా ర్టీలో ఉన్న ఇద్దరి మధ్య కొంతకాలంగా ఆధిప త్య పోరు కొసాగుతోంది. ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా... ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనే ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర అప్పటి నుంచి ఉప్పు.. నిప్పులా ఉన్న వారిద్దరి మధ్య విభేదాలు ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి.
‘స్టేషన్ ఘన్‌పూర్’ వార్’పై అధిష్టానం ఆరా..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరిల మధ్య జరిగిన వార్‌పై పార్టీ అధిష్టానం మంగళవారం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన నలుగురు ముఖ్య నేతలు, ఓ మంత్రిని తాజా వివాదంపై హైదరాబాద్‌నుంచి ఓ కీలక నేత వివరాలు అడిగినట్లు తెలిసింది. పార్టీకి తలనొప్పిగా మారిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment