
స్టేషన్‌ఘన్‌పూర్: ‘నిరుపేద కుటుంబానికి చెందిన అనాథలం.. ‘దళిత బంధు పథకం మంజూరు చేసి ఆదుకుంటే చెల్లి వివాహం చేస్తాను’.. అంటూ లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన తిప్పారపు అనూష అనే యువతి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాళ్లు మొక్కి వేడుకుంది. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.
తిప్పారపు అనూష, అశ్విని అక్కా చెల్లెళ్లు. పదేళ్ల క్రితం తల్లిదండ్రులు పరశురాములు, పుష్ప అనారోగ్యంతో మృతి చెందాక.. నానమ్మ వద్దే ఉంటున్నారు. పదో తరగతి వరకు చదివిన అనూష కూలి పనిచేస్తూ నానమ్మకు తోడుగా ఉండేది. మూడేళ్ల క్రితం అనూషకు జనగామకు చెందిన కార్తీక్‌తో వివాహమైంది. ఆరునెలల తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు.
అప్పటి నుంచి అనూష నానమ్మ వద్దే ఉంటోంది. డిగ్రీ ఫస్టియర్ వరకు చదివిన అశ్విని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసింది. ‘కూలి పనులు చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది.. చెల్లికి వివాహం చేయాలి.. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకం మంజూరు చేసి ఆదుకోవాలి’.. అంటూ అనూష.. ఘన్‌పూర్‌లో ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తున్న ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment