తొలిసారి దావూద్ ఇబ్రహీం మాట్లాడాడు
న్యూఢిల్లీ: కరడుగట్టిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ 1993లో భారత్‌లోని ముంబయిలో పేలుళ్లకు కీలక సూత్రదారుడు దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నట్లు స్పష్టమైంది. ఆయనతో నేరుగా ఓ టీవీ చానెల్ ఫోన్‌లో మాట్లాడింది. దాదాపు 13 నిమిషాలపాటు సాగిన ఫోన్ సంభాషణలో తొలుత రెండు మాటలు మాత్రమే మాట్లాడిన దావూద్ ఆ తర్వాత తన అనుచరుడికి ఫోన్ ఇచ్చాడు.
మొన్నటి వరకు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ వచ్చిన వార్తలకు భిన్నంగా అతడి గొంతు వింటుంటే చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. సీఎన్‌ఎన్ చానెల్ కరాచీలోని క్లిఫ్టన్‌లోగల పలాటియల్ బంగ్లాకు నేరుగా ఫోన్ చేసింది. అది దావూద్ ఇబ్రహీం ఉంటున్న బంగ్లా. తొలుత ఫోన్ చేసిన సీఎన్‌ఎన్ ప్రతినిధి ఏం మాట్లాడారంటే..
మీడియా ప్రతినిధి : హలో.. హలో
దావూద్ : హా.. హాజీ(చెప్పండి)
మీడియా ప్రతినిధి : దావూద్ సాబ్
దావూద్ : నువ్వెవరు? (ఆప్ కౌన్)
మీడియా ప్రతినిధి : గుడ్ ఈవినింగ్.. మాట్లాడుతుంది సీఎన్ఎన్ ప్రతినిధి
దావూద్ : నీతో చొటానీ మాట్లాడతాడు
మీడియా ప్రతినిధి: ఏంటండీ..
అంటుండగానే దావూద్ తన ఫోన్‌ను కీలక అనుచరుడు 2013ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన జావెద్ చోటానికి ఫోన్ ఇచ్చారు.
జావెద్ చోటానీ : హలో ఎవరు?
మీడియా ప్రతినిధి: కొంచెం దావూద్ సాబ్‌కు ఫోన్ ఇస్తారా
జావెద్ చోటానీ : దావూద్ ఎవరు?
మీడియా ప్రతినిధి : దావూద్ ఇబ్రహీ సాబ్. మీరు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నరన్నమాట.
జావెద్ చోటానీ : ఎవరు చెప్పారు?
మీడియా ప్రతినిధి : ఇది పాకిస్థాన్ ఫోన్ నెంబర్
దావూద్: సమయం వృధా చేయకు(నేరుగా ఫోన్‌లో చెప్పకుండా చొటానీకి దావూద్ ఈ మాట చెబుతుండగా ఫోన్‌లో వినిపించింది)
జావెద్ చోటానీ : సమయం వృధా చేస్తున్నావ్. మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు నువ్వు? నీకు అసలు ఏమన్నా తెలుసా? నువ్వు చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు.. ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
మీడియా ప్రతినిధి : దావుద్ తో
ఈ మాట విన్నాక చోటానీ దేవుడిని తలుచుకుంటూ దావూద్‌ని ఇలాగేనా అనేది, ఇలా పిలుస్తూనే ఇంటర్వ్యూ తీసుకుంటావా? అసలు ఈ ఫోన్ నెంబర్ ఎవరిచ్చారని ప్రశ్నించాడు. వెంటనే నెంబర్ తొలగించమని, మీడియా ప్రతినిధి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. నెంబర్ ఇస్తే మాట్లాడిస్తానని చెప్పాడు. దీంతో నెంబర్ ఇవ్వగా, నేరుగా స్టూడియోలో ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ప్రశ్నించాడు. దీంతో తాను కరాచీకి కెమెరా పంపిస్తానని ప్రతినిధి చెప్పగా.. కరాచీనా? ఎందుకు.. ఇంటర్వ్యూ లేదు ఏమి లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు. దీని ద్వారా దావూద్ బతికే ఉన్నాడని, అది కూడా కరాచీలోనే ఉన్నాడని స్పష్టమైంది.