మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జయకుమార్
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆడియోలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. ఓ యువతితో సీనియర్ మంత్రి ఒకరికి సంబంధం ఏర్పడినట్టు, గర్భం దాల్చిన ఆ యువతి తల్లితో ఆయన సంభాషణలు సాగించినట్టు వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే, ఆ యువతి ప్రస్తుతం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు, ఆ మంత్రి పేరును తండ్రిగా పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నట్టు ఆడియోలో ఉన్న సంభాషణలు రచ్చకెక్కాయి. తొలుత ఓ సీనియర్ మంత్రి అన్న ప్రచారం సాగినా, చివరకు అది జయకుమార్ అన్న చర్చ తెరమీదకు వచ్చింది. దీంతో జయకుమార్ మేల్కొన్నారు. ఆ వాయిస్ తనది కానే కాదని, పోలీసులకు ఫిర్యాదుచేస్తా.. కేసు వేస్తా అంటూనే, చిన్నమ్మ శశికళ కుటుంబం మీదవిరుచుకుపడ్డారు.
సాక్షి, చెన్నై : మత్స్య శాఖ మంత్రి జయకుమార్ రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరు. మీడియా ముందుకు వచ్చే తొలి మంత్రి. ఎల్లవేళలా మీడియాతో టచ్‌లో ఉండే ఈయన గళంతో ఆదివారం రాత్రి నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో రెండు ఆడియోలు హల్‌చల్ చేయడం మొదలైంది.వైరల్‌గా మారిన ఈ ఆడియో మీద విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు, ఆగ్రహాల్ని వ్యక్తంచేసే నెట్టిజన్లు పెరిగారు.
రసవత్తర సంభాషణలు
రెండు రకాలుగా ఉన్న ఆడియోలో మంత్రికి ఓ యువతితో సంబంధం ఏర్పడినట్టు, ఆ యువతి గర్భం దాల్చినట్టు, అబార్షన్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సంభాషణలు ఉన్నాయి. మంత్రి ఆ యువతి తల్లితో మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో వ్యాఖ్యలు ఉండడం రచ్చకెక్కింది. అలాగే, ఆ యువతికి పండంటి మగ బిడ్డ పుట్టినట్టు, మంత్రిని తండ్రిగా పేర్కొంటూ, బర్త్ సర్టిఫికెట్ సైతం పొందినట్టుగా సంభాషణలు ఉండడం రచ్చకు దారితీసింది. ఆ గొంతు పలానా మంత్రిదిలా ఉందని కొందరు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొందరు మంత్రి ఫొటోల్ని సైతం సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో, ఆయన మేల్కొన్నారు. గతంలో ఇలాంటి ఆరోపణల కారణంగానే ఆయన మీద అమ్మ జయలలిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా, ఆ సమయంలో మంత్రి పదవి ఊడినట్టుగా ప్రచారం అయ్యింది. ఆ మంత్రి ఈ మంత్రి ఒక్కరే అన్నట్టు చర్చ జోరందుకుంది. ఎట్టకేలకు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆ మంత్రి మీడియా ముందుకు వచ్చారు. ఆయనే మత్స్యశాఖ మంత్రి జయకుమార్.
ఇదో కుట్ర
మీడియాతో మాట్లాడిన జయకుమార్, గతంలో తనకు వ్యతిరేకంగా సాగిన ప్రచారాలను గుర్తుచేశారు. గతంలో తానెవరితోనో సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టారని, ఆ కేసులో అప్పట్లో ముగ్గుర్ని పోలీసులు అరెస్టుచేసినట్టు పేర్కొన్నారు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లే, ఇప్పుడు కూడా మరో కుట్రకు సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. ఆ కుటుంబానికి తాను అంటే గిట్టదని, అందుకే తన పేరుకు కళంకం తీసుకు వచ్చే రీతిలో మార్ఫింగ్ చేసిన ఆడియోను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన ఈ ఆడియో వెనుక ఆ కుటుంబమే ఉందంటూ, అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మన్నార్‌కుడి మాఫియా గతంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉందని మండిపడ్డారు. ఈ ఆడియో వారి కుట్రే అని, ప్రధానంగా ఇలాంటి కుట్రలు, వ్యూహాలు రచించడం దినకరన్‌కు అలవాటేనని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడనని పేర్కొన్నారు. తాను సింహం లాంటి వాడ్ని అని, తనను భయపెట్టాలని చూస్తే, తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఈ ఆడియో గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. కేసులు వేస్తా.. అంటూ, ఆ ఆడియోలోని గళం తనది మాత్రం కానే కాదు అని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment