ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌కు చేదు అనుభవం | Brawl Between TN Minister Rajakannappan And MP Navas Kani Viral Video | Sakshi
Sakshi News home page

వీడియో: ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌ను ఒక్కతోపు తోయడంతో.. 

Published Sun, Jun 18 2023 5:56 PM | Last Updated on Sun, Jun 18 2023 6:29 PM

Brawl Between TN Minister Rajakannappan And MP Navas Kani Viral Video - Sakshi

చెన్నై: వారిద్దరూ ప్రజాప్రతినిధులు.. పక్కవారికి మంచి చెప్పాల్సిందిపోయి చిన్న విషయానికే గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యలోకి వచ్చి సర్ధిచెప్పే ప్రయత్నం చేసిన కలెక్టర్‌ను ఒక్క తోపు తోయడంతో కిందపడిపోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అంతకుముందే ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రమంత్రి రాజ కన్నప్పన్‌కు, స్థానిక ఎంపీ నవాస్‌ ఖనికి ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలో సరైన సమయానికి మంత్రి రాజ కన్నప్పన్‌ హాజరయ్యారు. కానీ, ఎంపీ నవాస్‌ ఖని మాత్రం సమయానికి రాలేదు. దీంతో, మంత్రి కన్నప్పన్‌, జిల్లా కలెక్టర్‌ విష్ణు చంద్రన్‌ కలిసి అవార్డుల ప్రదానోత్సం ప్రారంభించారు. అర్హులైన వారికి అవార్డులు ప్రదానం చేస్తుండగా ఎంపీ ఖని అక్కడికి వచ్చారు. 

ఈ క్రమంలో తాను లేకుండా అవార్డులు ప్రదానం చేయడంపై సీరియస్‌ అయ్యారు. తాను రాకముందే కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా మంత్రికి, ఎంపీకి, ఆ ఇద్దరి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కలెక్టర్‌ వారిద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆవేశంలో ఉన్న ఇద్దరు నేతలు.. ఆయనను తోసిపడేశారు. దీంతో, అక్కడే సోఫా ఉండటంతో ఆయన కింద పడిపోకుండా ఆ సోఫాలో కూలబడిపోయారు. కలెక్టర్‌ కిందపడిపోయినా మంత్రి, ఎంపీ మాత్రం తమ గొడవను ఆపలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై స్పందించారు. వారిద్దరూ కలెక్టర్‌తో వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. డీఎంకే పాలన అప్రజాస్వామికమని విమర్శించారు. ఇది ద్రావిడ అభివృద్ధి నమూనానా? అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: విమానం గాల్లో ఉండగా సడెన్‌గా డోర్‌ ఓపెన్‌.. ప్రముఖ సింగర్‌ టీమ్‌కు తప్పిన ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement