బాగా హర్ట్‌ అయిన..మంచి మొబైల్‌ ఇప్పియ్యి | CCC Naspur SI dathatri phone call audio leak | Sakshi
Sakshi News home page

బాగా హర్ట్‌ అయిన..మంచి మొబైల్‌ ఇప్పియ్యి

Published Sat, Oct 28 2017 9:43 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

CCC Naspur  SI dathatri phone call audio leak - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పోలీసుల అవినీతి, అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అండగా నిలవడంతోపాటు భూ వివాదాల్లో ఇరువర్గాల మధ్య సెటిల్‌మెంట్‌లు చేసి నజరానాలు తీసుకోవడం సర్వసాధారణమై పోయింది. మంచి ర్యాల పట్టణంలోని సీపీఐ(ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ కార్యాలయం వెనుక స్థలానికి సంబంధించిన భూ వివాదంలో మంచిర్యాల ఏసీపీ చెన్నయ్య, బదిలీ అయిన సీఐ సుధాకర్‌ ఏసీబీ విచారణ ఎదుర్కొం టున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భూ వివాదంలో నస్పూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దత్తాత్రి తెరపైకి వచ్చారు. నస్పూరు రాళ్లవాగు సమీపంలోని ఓ భూ వివాదంలో ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సెటిల్‌మెంట్‌ చేసినందుకు మంచి ఫోన్‌ ఇప్పించమంటూ ఫోన్‌లో మాట్లాడినట్లుగా చెపుతున్న వాయిస్‌ రికార్డింగ్‌ ఇప్పు డు వైరల్‌గా మారింది.

నస్పూరులోని ఓ భూ వివాదంలో ఎస్‌పీ చెబితే పని చేసినందుకు తనను పట్టించుకోలేదని, తాను హర్ట్‌ అయ్యానని సంజీవరెడ్డి అనే ఓ రియల్టర్‌తో మాట్లాడినట్లుగా రికార్డులో ఉంది. కనకయ్య అనే వ్యక్తికి సంబంధించిన వివాదంలో సంజీవరెడ్డికి మేలు చేసినట్లుగా ఫోన్‌ రికార్డును బట్టి తెలుస్తోంది. అయితే నస్పూరు ఎస్‌ఐగా పనిచేస్తున్న దత్తాత్రిని ఇరికించేందుకే ఫోన్‌ రికార్డు చేసినట్లు పోలీస్‌ వర్గాలు చెపుతున్నప్పటికీ, సంజీవరెడ్డి ఎక్కడా దత్తాత్రి పేరును ఉటంకించకపోవడం గమనార్హం. దీనిపై ‘సాక్షి ప్రతినిధి’ ఎస్‌ఐ దత్తాత్రిని సంప్రదించగా ‘నాకైతే ఏమీ తెలియదు. నేను ఎలాంటి ఫోన్‌ తీసుకోలేదు. సంజీవరెడ్డి లోకల్‌గానే ఉంటడు కదా. ఆయన్నే అడగండి చెపుతడు’ అని సమాధానమిచ్చారు. తాను సాయంత్రం వరకు కోర్టులో ఉన్నానని, తనకు కూడా ఇప్పుడే తెలిసిందని పేర్కొన్నారు. ‘నా గురించి మీకు తెలుసు గదా. నేనెలాంటోన్ని అడిగి ఉంటరు కదా’ అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మంచిర్యాలలో ఆగని పోలీస్‌ సెటిల్‌మెంట్లు
మంచిర్యాల పట్టణం పరిధిలోని సివిల్‌ తగాదాల్లో పోలీసుల జోక్యం షరా మామూలుగా సాగుతోంది. తాజాగా మారుతినగర్‌లోని మూడు ప్లాట్లకు సంబంధించి ఓ ఎస్‌ఐ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వివాదంలో ఓ వ్యక్తి తనకు సంబంధించిన భూమిగా ఇంజెక్షన్‌ ఆర్డర్‌తో పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, సీఐకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. కానీ అదే స్టేషన్‌లో పనిచేసే ఎస్‌ఐ ఒకరు అవతలి వర్గానికి మద్ధతుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓ భూ వివాదంలో ఏసీపీ, సీఐలు ఇరుక్కోగా, అనూహ్యంగా ఓ ఎస్‌ఐ బదిలీ అయ్యారు. తాజాగా మరో ఎస్‌ఐ సివిల్‌ తగాదాల్లో తలదూర్చడం వివాదాస్పదమవుతోంది.

ఎస్‌ఐ– సంజీవరెడ్డిల మధ్య ఫోన్‌కాల్‌ ఇలా సాగింది...
సంజీవరెడ్డి: సంజీవరెడ్డి మాట్లాడుతున్న సర్‌..
ఎస్‌ఐ: సంజీవరెడ్డి చెప్పూ..
సంజీవరెడ్డి: సార్‌ సార్‌ మొన్న అంటిరి గదా.. కనకయ్య విషయంలో... ఒకటేసారి డిసప్పాయింట్‌ అయిన
ఎస్‌ఐ: అవునయ్యా చెప్పూ నేను అంతగనం కష్టపడి చేస్తే ఏం లాభం చెప్పు. మీరు సెట్‌ జేసుకొనీ... అది భావ్యమా చెప్పు..
సంజీవరెడ్డి: అయితే ఏంలేదూ. నేను మల్ల గలుద్దామనుకుంటున్న. మా పార్టనర్స్‌ ఉండిరి. సర్‌ప్రైజ్‌ అయిన మీరట్లనెసరికి. నేనేదో మిస్సయిన్నా ఏంది మీతోని అని.
ఎస్‌ఐ: నేను బాగ హర్ట్‌ అయిన. ఎస్‌పీ గారు జెపితె నేను జేసిన. కనీసం గిట్ల జేసుకుంటున్నం సార్‌ అని గుడ జెప్పలేదు నువ్వు నాకు..
సంజీవరెడ్డి: సార్‌ సార్‌ ... మరిప్పుడు కలుత్త మరి. ఎంతో జెప్పలేరు సార్‌...
ఎస్‌ఐ: అరే మొబైల్‌ ఇప్పియ్యి బై మంచిది
సంజీవరెడ్డి: సార్‌ సార్‌...(రెట్టించి అడిగాడు)
ఎస్‌ఐ: ఓ మొబైల్‌ ఇప్పియ్యి మంచి మొబైలు
సంజీవరెడ్డి: ఆ ఆ... మొబైల్‌ ఇప్పియ్యంటరా? సార్‌ సార్‌ ఒకే సార్‌ ఒకే
ఎస్‌ఐ: ఒకేనా నీకు ఇబ్బంది లేకుంటె...ఇప్పుడె..
సంజీవరెడ్డి: ఏమీ లేదు సార్‌ మొన్న గట్లనెసరికి డిసప్పాయింట్‌ అయిన. ఎప్పుడు కమ్యునికేషన్ల ఉండెటోల్లం మరి
ఎస్‌ఐ: లేదు గట్లని కాదు గని నేను బాగ హర్టయిన. నేనింత జేసిన. నువ్వు రాంగనె కూసొబెట్టి నువ్వు పిటిషన్‌ తప్పురాసినా మావోనితోటి మంచిగ రాపించలే? తిరుపతిరెడ్డి తోటి రాయించలేదా? పిటిషన్‌ మంచిగ రాయించిన.
సంజీవరెడ్డి: ఆ... రాయించిన్రు
ఎస్‌ఐ: రాయించిన. గంత ఫోర్స్‌ జెత్తెనే గద మల్ల మీదగ్గరికొచ్చింది మల్ల.
సంజీవరెడ్డి: అవునవును...
ఎస్‌ఐ: నీకు ఇబ్బంది లేకుంటెనె. ఇబ్బంది ఉండద్దు. ఇత్తె పలిగిపోయింది
సంజీవరెడ్డి: సార్‌ సార్‌.. సరే సార్‌ అలాగే సార్‌. సార్‌ ఇగ మీరేమన్న జేసుకోన్రి. అద్దెచ్చి మీకిత్త. మీరెంతనన్న తీసుకోన్రి.
ఎస్‌ఐ: ఇప్పుడత్తవా. మంచిరాలల ఉన్న దా. ఎంత సేపట్ల వస్తవ్‌
సంజీవరెడ్డి: మీరెక్కడున్నరు సార్‌. నేనింట్లనె వున్న. పదినిమిషాలల్ల స్టాటయిత
ఎస్‌ఐ: గణేష్‌ మొబైల్‌. మంచిరాలల ఉన్నదా. వత్తనంటె ఉంట. లేదంటె ఎల్లిపోత మరి
సంజీవరెడ్డి: మల్లొక్క ఐదు నిమిషాలల్ల జేత్త. మా పెద్దబిడ్డచ్చింది. మనవరాలుతోటి మాట్లాడుతున్న. మీరు మంచిరాలలనె ఉన్నరు గద. ఐదు నిమిషాలల్ల కాల్‌ బ్యాక్‌ చేస్త.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement