ఇది గాలి కుంటు వ్యాధి కాలం
నేటి నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు
పశుశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం పశువులకు గాలికుంటు వ్యాధి సోకే కాలమని, చికిత్స కన్నా వ్యాధి నివారణే ముఖ్యమని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ముందస్తుగా ఉచిత టీకాలు కార్యక్రమం నేటి (శనివారం) నుంచి చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన నెల రోజుల పాటు (సెప్టెంబర్ 19వ తేదీ వరకు) 10 లక్షల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు.. నివారణ మార్గాలను వివరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు : వ్యాధి వ్యాపిస్తే పశువుల్లో మరణాలు తక్కువైనా పాల ఉత్పత్తులు బాగా తగ్గిపోతాయి. ఏవోటీ, ఆసియా–1, ఆసియా–22, ఆసియా–10, పిటార్నో లాంటి వైరస్ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో ఉత్పాదకశక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగకారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు.
గర్భంతో ఉన్న పశువులు అబార్షన్‌కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గ్రుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. మంచి ఎద్దులు సైతం వ్యాధి సోకితే బలహీనమై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
నివారణ ఇలా.. : వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అÄñæ¬డైజ్డ్ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. ముందస్తు నివారణలో భాగంగా పశుశాఖ ద్వారా ఉచితంగా టీకాలు వేయించుకోవాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకాలు వేయించుకుంటే మంచిది.