నిబంధనల సడలింపుపై దృష్టి పెట్టండి
సాక్షి, చైన్నె: యావజ్జీవ ఖైదీల విడుదలకు సంబంధించిన నిబంధనల సడలింపునకు సంబంధించి పునర్ పరిశీలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో యావజ్జీవ ఖైదీలను సత్ ప్రవర్తన కారణంగా ముందుగా విడుదల చేసే దిశగా ప్రభుత్వంలో నిబంధనలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కేసులలో ముందస్తు విడుదలకు కొన్ని అడ్డంకులు తప్పడం లేదు. ఆ దిశగా రాజ్‌కుమార్ అనే వ్యక్తి తనను ముందుగా విడుదల చేయాలని పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. వరకట్న కేసులో అరెస్టయిన రాజ్‌కుమార్ తన విడుదల కోసం కోర్టును అభ్యర్థించాడు. అయితే 2023 నాటికి 14 సంవత్సరాలు జైలు శిక్షను రాజ్‌కుమార్ అనుభవించ లేదంటూ కోర్టుకు ప్రభుత్వం సూచించింది. అలాగే వరకట్న కేసు వివరాలను పేర్కొంది. ఈ పిటిషన్ న్యాయమూర్తులు రమేష్, సెంథిల్‌కుమార్ బెంచ్‌లో శనివారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ వరకట్న కేసులో అరెస్టయిన రాజ్‌కుమార్ విచారణలో ఉండగానే రెండేళ్లు జైలు శిక్షను అనుభవించినట్టుగా పిటిషనర్ పేర్కొనడాన్ని పరిగణించారు. ఇలాంటి కేసులలో తక్కువ కాలం శిక్షను అనుభవించిన పక్షంలో సంబంధిత యావజ్జీవ ఖైదీని విడుదల చేయవచ్చు అని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నట్టు గుర్తు చేశారు. ఈ కేసులో రాజ్‌కుమార్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, ఇలాంటి కేసులలో ఉన్న చిక్కుముడులు, చట్ట సెక్షన్లు, ముందుగా విడుదల అర్హతకు సంబంధించి ఉన్న నిబంధనలలో మార్పులు, సవరణల దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు ఇదే మంచి అవకాశంగా సూచించారు.
ఇష్టం లేకుండానే
రాజకీయాల్లోకి వచ్చా!
సేలం : ఎండీఎంకే పార్టీ కార్యాలయ నిర్వాహక కార్యదర్శి, ఎంపీ దురై వైగో మదురైలో శనివారం మీడియాతో మాట్లాడారు... ఎందుకోసం విద్యార్థులు మూడో భాషను చదువుకోవాలి? మూడవదిగా హిందీని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. మూడవ భాషను ఎంపిక చేసుకుంటే హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారన్నారు. గత వారం రోజుల్లో రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపారు. వ్యక్తిగత క్రమశిక్షణ అనేది అందరిలోనూ ఉండాలన్నారు. తప్పు చేసే వారిని ప్రభుత్వం దండిస్తుందని తెలిపారు. తాను ఇష్టం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. రాజకీయాలలో తాను ఒక పిల్లవాడినని అభిప్రాయపడ్డారు. రాజకీయాలను, రాజకీయ నేతలను వ్యతిరేకించిన వాడిని, పార్లమంట్ ఎన్నికల్లో కూడా తమ ప్రత్యేక చిహ్నంతోనే పోటీపడినట్టు తెలిపారు. ఐడియాలు ఇవ్వడానికి అనేక మంది ఉన్నారు. తనను రాజకీయాలలోకి లాక్కొచ్చిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని తెలిపారు.
హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు
సాక్షి, చైన్నె: మద్రాసు హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా రామ స్వామిశక్తి వేల్, పి. ధనపాల్, చిన్న స్వామికుమరప్పన్, కందస్వామి, రాజ శేఖర్ ఉన్నారు. వీరిని తాజాగా శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బెంగళూరు ఎయిర్‌పోర్టులో పొగ మంచు
● చైన్నెలో సరుకు విమానం ల్యాండ్
సేలం : బెంగళూరు విమానాశ్రయాన్ని శనివారం పొగ మంచు కమ్మేసింది. ఈ కారణంగా బెంగళూరులో ల్యాండ్ కావాల్సిన కొన్ని విమానాలు చైన్నె, తిరువనంతపురం, కోవై వంటి విమానాశ్రయాలలో ల్యాండ్ అయ్యాయి. ముంబై నుంచి శనివారం ఉదయం 7 గంటలకు బెంగళూరుకు వెళ్లిన సరుకు రవాణా విమానం అక్కడ తీవ్రమైన పొగ మంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. దీంతో ఇది చైన్నె విమానాశ్రయానికి ఉదయం 8 గంటలకు వచ్చి ల్యాండ్ అయ్యింది. బెంగుళూరులో వాతావరణం సరి అయిన తర్వాత ఈ సరకు విమానాన్ని బెంగుళూరుకు చైన్నె నుంచి తీసుకువెళ్లారు.
నిబంధనల సడలింపుపై దృష్టి పెట్టండి
Comments
Please login to add a commentAdd a comment