కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని 53వ వార్డు పీఎంకే కార్పొరేటర్‌గా ఉన్న బేబీ కదిరవన్. ఈమె తన వార్డుకు చెందిన సుమారు 20 మంది సభ్యులతో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ఉన్న ఫలంగా వార్డు సభ్యులతో కలిసి కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని 53వ వార్డులో గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి సౌకర్యాలు కల్పించడంలేదని, కేవలం డీఎంకే కార్పొరేటర్‌లు ఉన్న వార్డుల్లో మాత్రం అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని వీటిపై పలుమార్లు నిలదీసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాను వార్డులో ప్రజలకు సమాధానం చెప్పలేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆరోపించారు. అయితే కూలీ పనులు చేసుకుంటున్న కార్మికులకు కూడా రూ. 15 వేలు చొప్పున ఇంటి పన్ను వేసి వసూలు చేస్తున్నారని.. అభివృద్ధి పనులను మాత్రం చేయడం లేదని ఆరోపించారు. తాను పీఎంకే కార్పొరేటర్ కావడంతోనే తన వార్డుపై అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ సవతి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రోజున కూడా తాను ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో చర్చలు జరిపి ధర్నాను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment