సీఎం పదవి కోసం రాలేదు!
సాక్షి, చైన్నె: సీఎం పదవిపై ఆశతో తాను రాజకీయాలలోకి రాలేదని, మార్పు నినాదంతోనే వచ్చినట్టు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో మక్కల్ నీదిమయ్యం 8వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది. చాలాకాలం తర్వాత కేడర్‌లోకి వచ్చిన కమల్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణమే, బంధమే, తమిళమే వనక్కం అంటూ జీవితంలో ఉన్నతమైన వ్యాఖ్యలు ఇవేనని వివరించారు. తన ఆలోచనలకు తమిళ ప్రజలే కారణం అని పేర్కొంటూ, కొన్ని బంధాలు పది సంవత్సరాలు ఉంటాయని, మరికొన్ని బంధాలు రెండురోజులలో ముగుస్తాయని వ్యాఖ్యలు చేశారు. స్నేహితుడ్ని అంటూ వచ్చే వాడు కొన్ని రోజుల తర్వాత ప్రత్యర్థిగా మారిపోతాడని పేర్కొంటూ, 50 సంవత్సరాలుగా తాను అన్నింటినీ చూస్తున్నానని తన దైన శైలిలో స్పందించారు. తన తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల తర్వాత ఇంతకాలం తనతో ఉన్న బంధం మీరే అంటూ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పెరియార్, గాంధీ శిష్యుడే అంటూ, సినిమాలలో తనకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే అభిమానం వేరు, ఓటర్లు వేరు అనే విషయాన్ని అనుభవం తనకు నేర్పిందన్నారు. హిందీని బలవంతంగా రుద్దేప్రయత్నం చేస్తే అడ్డుకున్న వాళ్లంతా ప్రస్తుతం వయస్సు మీద పడి ఉన్నారని, భాష కోసం ప్రాణత్యాగం చేసిన గడ్డ తమిళనాడు అని గుర్తు చేశారు. అలాంటప్పుడు, సున్నిత విషయాలలో ఆటలు వద్దని, తనకు ఏ భాష కావాలో.. వద్దో అన్న నిర్ణయం తీసుకునే మేధాతత్వం తమిళుడికి ఉందన్నారు. ఈ ఏడాది రాజ్యసభలో మక్కల్ నీది మయ్యం గళం జ్వలించబోతోందని, 2026లో అసెంబ్లీలోనూ ప్రతిబింబిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం అయ్యేందుకు రాజకీయాలలోకి రాలేదని, ఒక మార్పు అన్నది తీసుకొచ్చేందుకే వచ్చినట్టు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకు హిందీ రాకున్నా, హిందీ చిత్రంలో నటించానని గుర్తు చేస్తూ, భాషా, జ్ఞానం అందరికీ సొంతం అంటూ తన దైనశైలిలో స్పందించారు. ముందుగా ఓ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్య వీడియో వైరల్‌గా మారింది. ఇందులో సినిమా అనే స్కూల్‌కు నటి త్రిషాతోనూ వెళ్తాను..ఆమె కుమార్తెతోనూ పోతాను అంటూ చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment