కొలనులో దూకి వివాహిత ఆత్మహత్య
అన్నానగర్: ఆలయ కొలనులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వడపళని, కవరై వీధికి చెందిన వినాయగం. ఇతని భార్య శాంతి (60). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వినాయగం నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ స్థితిలో సోమవారం ఇంటి నుంచి వెళ్లిన శాంతి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ తెలియక పోవడంతో వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం వెతికారు. ఈస్థితిలో మంగళవారం ఉదయం వడపళని మురుగన్ ఆలయ కొలనులో శాంతి శవమై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కేకే నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపం చెంది శాంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. శాంతి పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండవ కుమార్తెకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈసమయంలో భర్త మృతి చెందడంతో శాంతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసు ఆత్మహత్య
– ఈరోడ్ సాయుధ దళంలో కలకలం
సేలం ః ఈరోడ్ ఆనైక్కల్ పాళయంలో ఉన్న సాయుధ దళ విభాగంలో పోలీసుగా పని చేస్తున్న నవీన్‌కుమార్ (35)కు వేలూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వీరికి 11 ఏళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం డ్రైవర్ పనిలో నిమగ్నమై ఉన్న నవీన్ కుమార్ పని ముగించుకుని సాయుధ దళంలో బస చేసి ఉన్న గదికి వెళ్లారు. ఈ స్థితిలో నవీన్‌కుమార్‌కు ఆయన తండ్రి ఫోన్ చేశాడు. అయితే నవీన్ కుమార్ తీయకపోవడంతో ఆయన సాయుధ దళం కార్యాలయ విభాగానికి ఫోన్ చేశాడు. దీంతో అధికారులు అక్కడికి వెళ్లి చూడగా నవీన్ కుమార్ తలుపు లోపల గడియ పెట్టుకున్నాడు. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా నవీన్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవీన్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం పెరుందురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
పులల్ జైలులో ఖైదీ వద్ద
గంజాయి స్వాధీనం
తిరువొత్తియూరు: చైన్నె పులల్ జైలులో ఖైదీ వద్ద పోలీసులు గంజాను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె, జైలులో సుమారు 1,100 పైగా ఖైదీలు ఉన్నారు. మంగళవారం ఎప్పటిలాగే జైలు వార్డన్లు ఒక్కొక్కరి గదిలో తనిఖీ చేశారు ఆ సమయంలో దిండుకల్ బాల కృష్ణాపురం ప్రాంతానికి చెందిన ఖైదీ జగదీష్ గదిలో చిన్నచిన్న ప్యాకెట్లలో 3 గ్రాముల గంజాయి ఉన్నట్లు తెలిసింది. జగదీష్ హత్యా కేసులో అరెస్టు చేయబడి గత 2022వ సంవత్సరం అక్టోబర్ నెలనుంచి యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు. దీని గురించి జైలు తరఫున పులల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసి గట్టి భద్రత ఉన్నప్పటికీ గంజా ఎలా లభ్యమైనదని పలు కోణములలో విచారణ చేస్తూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment