అనుమానాస్పద స్థితిలో తల్లీ బిడ్డలు మృతి
● భర్త పరార్ ● లేఖ లభ్యం ● నామక్కల్‌లో కలకలం
సేలం: నామక్కల్‌లోని ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు..నామక్కల్ – సేలం రోడ్డులోని పతినగర్‌లో ప్రేమ్‌రాజ్ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్ బీమా కంపెనీలో ఉద్యోగి. ఇతని భార్య మోహన ప్రియ (33). వీరికి ప్రినితిరాజ్ (6), ప్రినిరాజ్ (2) కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ పరిస్థితిలో మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రేమ్‌రాజ్ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అనుమానించిన ఇరుగుపొరుగు ఇంటి కిటికీలోంచి చూశారు. మోహనప్రియ, ఆమె ఇద్దరు పిల్లలు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడం చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న నామక్కల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో ప్రేమ్‌రాజ్ ‘ఆన్‌న్‌లైన్ యాప్ నుంచి రూ.50 లక్షలు రుణం తీసుకున్నాడని, ఆ రుణాన్ని ఎలా తిరిగి చెల్లించాలో వివరిస్తూ లేఖ రాసి అదృశ్యమయ్యాడని తేలింది. అతని భార్య, పిల్లలు మరణించడంతో, పోలీసులు భర్త ప్రేమ్‌రాజ్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment