మాదక ద్రవ్యాల సరఫరా
● ఆరుగురి అరెస్టు ● రూ.6 లక్షల మాదకద్రవ్యాలు స్వాధీనం
సేలం: కోవైలో కళాశాల విద్యార్థులకు ఎల్‌ఎస్‌డీ స్టాంప్, మెతబేటమైన్ మాదక ద్రవ్యం విక్రయం కేసులో ప్రత్యేక బృందం పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే మెతబేటమైన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కోవై పందయసాలై పోలీస్‌స్టేషన్ నగర డిప్యూటీ కమిషనర్ దేవనాథన్ మీడియాతో మాట్లాడారు. గత వారం శరవణపట్టి ప్రాంతంలో కళాశాల విద్యార్థులు బస చేసిన హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీల్లో కొంతమంది విద్యార్థులు సింథటిక్ మత్తు పదార్థాలు వాడుతున్నట్టు తేలిందన్నారు. గంజాయి కంటే అతి ప్రమాదకరమైన సింథటిక్, మెతబేటమైన్ వంటి మత్తు పదార్థాల వాడకం వలన తల నరాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దీనికి సంబంధించిన ముందు ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసు అదనపు విచారణ నిమిత్తం మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పోలీసులు జరిపిన విచారణలో 69 గ్రాముల మెతబేటమైన్, 20 ఎల్‌ఎస్‌డీ స్టాంప్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన అశ్విన్, అమల్, రియాస్, అబ్దుల్ సలీమ్, అనక్షాత్, అజారుద్దీన్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6 లక్షల విలువ గల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా గత కొన్ని రోజుల క్రితం కోవై కునియముత్తూర్ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీలలో ఒక ప్రత్యేక గదిలో కళాశాల విద్యార్థులు 24 గంజాయి మొక్కలను పెంచుతున్న ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment