శివాజీ గణేషన్ ఇంటి జప్తును రద్దు చేయాలి
● శివాజీ గణేషన్ కొడుకు చైన్నె హైకోర్టులో పిటిషన్
తమిళసినిమా: దివంగత నటుడు శివాజీ గణేషన్ ఇంటిని జప్తు చేయాలన్న చైన్నె హైకోర్టు తీర్పు సినీ పరిశ్రమలోనే కాకుండా ఆయన అభిమానుల్లోనూ తీవ్ర కలవరానికి దారి తీసింది. కాగా కోర్టు తీర్పును రద్దు చేయాలని ఆయన పెద్ద కుమారుడు రామ్‌కుమార్ బుధవారం చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివాజీ గణేషన్ మనవుడు, రామ్‌కుమార్ కొడుకు దుశ్యంత్ ఆయన భార్య అభిరామి నిర్మాతలుగా మారి ఈశన్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు విష్ణు విశాల్, నివేద పేతురాజ్ జంటగా జగజాల కిల్లాడి అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. అందుకోసం ధనభాగ్యం ఎంటర్ ప్రైజస్ సంస్థ నుంచి రూ.3 .74 కోట్లను ఏడాదికి 30 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణం, వడ్డీ రూ.9.39 కోట్లు తిరిగి చెల్లించక పోవడంతో ధనభాగ్యం ఎంటర్ ప్రైజస్ సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం విచారణ అనంతరం శివాజీ గణేషన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా తీర్పు ఇచ్చింది. కాగా కోర్టు తీర్పుపై శివాజీ గణేషన్ పెద్ద కొడుకు రామ్ కుమార్ చైన్నె హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన తండ్రి శివాజీ గణేషన్ ఇంటిలో తనకు భాగం లేదన్నారు.ఆ ఇల్లు తన సోదరుడు ప్రభు పేరుతో ఉందన్నారు. కాబట్టి ఆ ఇంటిని ఎలా జప్తు కు ఆదేశిస్తారు అని ప్రశ్నించారు. అందుకు ఏకీభవించిన న్యాయమూర్తి భాగస్వామ్యం లేని ఇంటిని జప్తు చేయాలని తీర్పు ఇవ్వడం సరికాదని, అయితే ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చేసుకోవాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment