గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కార్తీ
తమిళసినిమా: నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన మెయ్యళగన్ చిత్రం సద్విమర్శలతో పాటు, ప్రేక్షకాదరణ అందుకుంది. తాజాగా కార్తీ నటించిన వా వాద్ధియార్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సర్ధార్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రంలో కార్తీ నటించనున్నారు. అదే విధంగా డానాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. దర్శకుడు మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబందించిన కథా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా మరో చిత్రానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ప్రస్తుత సమాచారం. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించనున్నారన్నదే ఆ న్యూస్. దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంతకు ముందు నటుడు సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క, వారణం ఆయిరం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మరో చిత్రం రూపొందాల్సి ఉండగా సూర్య, గౌతమ్ మీనన్‌ల మధ్య అభిప్రాయబేధాలు కారణంగా ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా సూర్య సోదరుడు, ప్రముఖ కథానాయకుడు కార్తీ , దర్శకుడు గౌతమ్ మీనన్ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషం. గౌతమ్ మీనన్ ఇటీవల కార్తీకి కథ చెప్పినట్లు, అది నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రముఖ రచయిత జయమోహన్ రాసిన కథనే గౌతమ్‌మీనన్ కార్తీకి చెప్పినట్లు తెలిసింది. ఇది దర్శకుడు గౌతమ్ మీనన్ స్టైల్‌లోనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాఫోన్ పట్టి చాలా కాలం అయ్యింది. ఈయన నటుడిగా బిజీ అయ్యారు.నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ధృవనక్షత్రం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విదుదలకు ఎదురు చూస్తోంది. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ ఒక మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment