
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
● బైక్‌ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు ● తల్లి, తండ్రి, కుమార్తె దుర్మరణం
సేలం : సెంజి సమీపంలో ఉన్న రాజంపుల్లియూర్ గ్రామానికి చెందిన దురైకన్ను (50) ఇటుక పని చేసే కార్మికుడు. చైన్నెలోని మదురవాయల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన భార్య పచ్చయ్యమ్మాళ్ (46). వీరికి కుమార్తె గోపిక (18), కుమారుడు గుణశేఖర్ (21) ఉన్నారు. ఈ పరిస్థితిలో, మరణించిన దురైకన్ను సోదరుడు నందగోపాల్ అంత్యక్రియలకు హాజరు కావడానికి దురైకన్ను, గుణశేఖర్ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైక్‌లో సెంజికి బయలుదేరారు. దురైకన్ను, అతని భార్య పచ్చయ్యమ్మాళ్, కూతురు గోపిక బైక్‌పై వస్తుండగా, గుణశేఖర్ మరో బైక్ మీద వెళ్లాడు. వారు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, విల్లుపురం జిల్లా సెంజి తిండివనం రోడ్డులోని వల్లం తొండియట్టు వంతెన వద్దకు చేరుకుంటుండగా, తిరువణ్ణామలై నుంచి చైన్నె వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న దురైకన్ను, పచ్చయమ్మాళ్, గోపికలు ముగ్గురు కింద పడి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సెంజి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మరణించిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సెంజి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment