
మన ఊరు.. మన బడి నినాదానికి మద్దతు
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వ మన ఊరు..మన బడి నినాదానికి బలాన్ని చేకూర్చే విధంగా చైన్నె లేడీ వెల్లింగ్టన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో అధునాతన ల్యాబ్ సౌకరాలు, కొత్త వంట గది, డైనింగ్ హాల్ తదితర నిర్మాణాలను విర్చుసా ఫౌండేషన్ పూర్తి చేసింది. వీటిని గురువారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ ప్రారంభించారు. డిజిటల్ ఇంజినీరింగ్ , టెక్నాలజీ రంగంలో ఉన్న విర్చుసా కార్పొరేషన్ తన సేవలను విస్తరించే విధంగా చైన్నెలోని లేడీ వెల్లింగ్టన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌ను ఎంపిక చేసుకుంది. మన వూరు..మన బడి నినాదానికి బలాన్ని చేకూర్చు విధంగా అధునాతన ల్యాబ్ సౌకర్యాలు, విద్య, పర్యావరణ అంశాలతో పాటూ అనేక నిర్మాణాలను పూర్తి చేసింది. 1922లో స్థాపించబడిన చైన్నె మైలాపూర్‌లోని లేడీ విల్లింగ్‌డన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఒక శతాబ్దానికి పైగా ఉచిత ప్రభుత్వ విద్యను అందిస్తోంది. 103 సంవత్సరాల పాటూ విద్యాసేవలలో ఉన్న ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దింది. ప్రధానంగా సత్యనగర్, కన్నగి నగర్, పెరుంబాక్కంలోని వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు సైతం సేవలు అందిస్తోంది. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ బడిలో పురాతనత చెక్కు చెదరకుండా రూ.3.65 కోట్లతో రూపుదిద్దుకున్న నిర్మాణాలను ఉదయనిధి స్టాలిన్ అన్బిల్ మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విర్చుసా సీటీఓ రామ్ మీనాక్షిసుందరం, గ్లోబల్ హెడ్ టెక్నాలజీ సర్వీస్ లైన్ ఈవీపీ వెంకటేశన్ విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు.