తిరుత్తణి: తిరుత్తణి కోర్డు ఆవరణలో చీటీలు నడిపి మోసగించిన మహిళను బాధితులు చుట్టుముట్టి దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. తిరుత్తణి కమ్మర్ వీధికి చెందిన రేవతి(60) పాతికేళ్ల నుంచి చీటీలు నడుపుతోంది. ఆమె వద్ద చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు చీటీలు కట్టారు. ఈ క్రమంలో ఏడాది కిందట అకస్మాత్తుగా చీటి కట్టిన వారికి డబ్బులు చెల్లించకుండా రేవతి పరారైంది. మునుస్వామి అనే వ్యక్తికి ఇచ్చిన రూ.12 లక్షల చెక్ బౌన్స్ కావడంతో తిరుత్తణి కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కోసం రేవతి శుక్రవారం తిరుత్తణిలోని క్రిమినల్ కోర్టుకు చేరుకుంది. విషయం తెలిసి కోర్టు వద్దకు చేరుకున్న బాధితులు కోర్టు నుంచి వెలుపలికి వచ్చిన రేవతిని చుట్టిముట్టి దాడికి యత్నం చేవారు. ఇంతలో పోలీసులు అడ్డుకుని రేవతిని కాపాడి అటోలో పంపారు. దీంతో కోర్టు ఆవరణలో కలకలం చోటుచేసుకుంది.