
అజిత్‌కు ధనుష్ చెప్పిన కథ నచ్చిందట
తమిళసినిమా: నటుడు ధనుష్ ఇటీవల నటనపైనే కాకుండా దర్శకత్వంపైనా ఆసక్తి చూపుతున్నారనిపిస్తోంది. కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూనే దర్శకత్వంపై కూడా మక్కువ చూపుతున్నారు. ఈయన ఇప్పటికి నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో మూడు చిత్రాల్లో ఆయనే కథానాయకుడిగా నటించారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలావుక్కు ఎన్‌మేల్ ఎన్నడీ కోపం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, పర్వాలేదనిపించింది. కాగా ఇప్పుడు ఏకంగా అజిత్ వంటి స్టార్ హీరోనే డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. తాజాగా ఈయన నటుడు అజిత్‌ను కలిసి కథ చెప్పినట్లు ప్రచారం జోరందుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని పూర్తి చేసిన నటుడు అజిత్ కార్ రేస్‌పై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే విదేశాల నుంచి చైన్నెకి తిరిగొచ్చిన అజిత్ చైన్నెలో రెండు రోజులు గడిపి మళ్లీ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. కాగా ఆ రెండు రోజుల్లో ఒక రోజును కుటుంబ సభ్యులతో గడపగా, రెండో రోజున నటుడు ధనుష్ ఆయన్ని కలిసి కథ చెప్పినట్లు ,ఆ కథ అజిత్‌ను బాగా ఇంప్రెస్ చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. అంతేకాదు తాను మరో చిత్రం చేసిన తరువాత మీ దర్శకత్వంలో నటిస్తానని ధనుష్‌కు ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అజిత్ నటుడు ధనుష్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అజిత్‌కు ధనుష్ చెప్పిన కథ నచ్చిందట