
నిరుపేద గుడిసె.. కాంక్రీట్ ఇల్లుగా మారింది
– సాయం చేసిన విజయ్
తమిళసినమా: నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈయన తన పార్టీ తరఫున ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిరుపేదలకు ఇళ్లు కటించనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిందిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు అధ్యక్షుడు విజయ్ ఆదేశాల మేరకు తమ ప్రాంతాల్లోని నిరుపేదలను గుర్తించి పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. వాటిని పార్తీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పరిశీలించి నిరుపేదలకు వారి పేర్లను విజయ్‌కు పంపుతున్నారు. అలా రాష్ట్రంలోని పలువురు నిరుపేదలకు ఇళ్లు కట్టించే పనికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చైన్నె, విల్లివాక్కం, సిడ్కో నగర్‌కు చెందిన గణపతి, ప్రేమ దంపతులు తమ కొడుకు రితిక్ రోషన్‌తో కలిసి గుడెసెలో జీవిస్తున్నారు. వారు తమిళగ వెట్రికళగం కార్యాలయానికి తమ పరిస్థితిని తెలుపుతూ వినతి పత్రాన్ని పంపారు. ఆ పత్రాన్ని బుస్సీ ఆనంద్ నటుడు విజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన గణపతి దంపతులకు కొత్త ఇంటిని కట్టించే విధంగా ఆదేశించారు. దీంతో నిరుపేద అయిన గణపతి గుడెసెను కాంక్రీట్‌తో నూతన ఇంటిని నిర్మించి వారికి అందించారు. అదే విధంగా ఆ ప్రాంతంలోని సుమారు 300 మందికి నిత్యావసర వస్తువులను అందించారు.