
ఆవడి పోలీసు కమిషనర్ కారుకు ప్రమాదం
– డ్రైవర్‌కు తీవ్ర గాయం
– కమిషనర్ కాలుకు గాయం
తిరువళ్లూరు: చోళవరం సమీపంలో ట్రాఫిక్‌లో ఆగి వున్న ఆవడి కమిషనర్ కారు ప్రమాదానికి గురి కావడంతో వాహనం పూర్తిగా దెబ్బతినింది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, కమిషనర్ కాలుకు స్వల్ప గాయమైంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని పెరుంజేరి ఆండాల్‌మఠం ప్రాంతంలో ఏప్రల్ 19న ముఖ్యమంత్రి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందజేయడంతోపాటు రోడ్‌షోను సైతం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభ జరగనున్న ప్రాంతం ఆవడి పోలీసు కమిషనర్ పరిధిలో ఉండడంతో గత రెండు రోజుల నుంచి ఆవడి కమిషనర్ శంకర్ నేతృత్వంలోని పోలీసులు భద్రత చర్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్బంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత, వాహనాల పార్కింగ్‌తో పాటు ఇతర చర్యలపై కమిషనర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం మరోమారు సభ, రోడ్‌షో జరగనున్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ శంకర్, చోళవరం మీదుగా ఆవడికి బయల్దేరారు. చోళవ రం సమీపంలోని చెంబులివరం ప్రాంతం వద్ద వస్తున్న సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కమిషనర్ కారు ట్రాఫిక్‌లో ఆగింది. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ టైర్ పేలడంతో అదుపు తప్పి కమిషనర్ కారుకు వెనుక ఆగి వున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో లారీ కమిషనర్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతినగా కమిషనర్ శంకర్ కాలుకు గాయమైంది. కమిషనర్ సహాయకుడు మారిసెల్వం, డ్రైవర్‌కు గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు గాయపడ్డ కమిషనర్‌తోపాటు ఇతర సిబ్బందిని రక్షించి చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు.