
హద్దుమీరితే.. వాతే!
ట్రాఫిక్ పోలీసు చూడ లేదుగా?
అంటూ చైన్నె నగర రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే, ఇకపై
ఆటోమేటిక్‌గా జరిమానా మోగనుంది. ఈ మేరకు ఏఐ నిఘా నేత్రాలు వాహన
దారులకు చుక్కలు చూపించనున్నాయి. ఐదు మార్గాలలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలతో ఆటో
మెటిక్‌గా జరిమానా సమాచారాన్ని
ఎస్‌ఎంఎస్ రూపంలో వాహనదారులకు చేర వేస్తుండడం గమనార్హం.
సాక్షి, చైన్నె : చైన్నె నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పీక్ అవర్స్‌లలో కూడా ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ పోలీసులు వాహన దారుల భరతం పట్టేవిధంగా జరిమానాల మోత మోగిస్తున్నారు. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తరహా ప్రత్యేక పరికరం ఆధారంగా తమకు పట్టబడే వారికి జరిమానాలు విధిస్తూ , తక్షణం రశీదులను అందజేస్తూ వస్తున్నారు. అలాగే, నగరంలో నేరగాళ్ల మీద నిఘా వేయడమే కాకుండా, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా చైన్నె చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ నిఘా కెమెరాలు పోలీసులకు మరింత ఉపయోగకరంగా మారాయి. ఈ పరిస్థితులలో నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి నడ్డి విరిచే విధంగా మరో అడుగు ముందుకు వేశారు. తమ చేతుల నుంచి నిబంధనలు అతిక్రమించే వాళ్లు తప్పించుకున్నా, ఇక ఏ ఐ నిఘా కెమెరాల నుంచి మాత్రం తప్పించుకోలేని విధంగా చర్యలు చేపట్టారు.
ఐదు మార్గాలలో..
కర్ణాటక రాజధాని బెంగళూరు, కేరళ రాజధాని తిరువనంతపరం నగరాలలో వాహనదారుల భరతం పట్టే విధంగా ఏర్పాటు చేసిన ఏఐ నిఘా కెమెరాల పనితీరును ఇటీవల చైన్నె పోలీసులు వెళ్లి పరిశీలించి వచ్చారు. దీనిని చైన్నెలోనూ ప్రస్తుతం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది తెలియక వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్టుగా జరీమానాల మెస్సేజ్‌ల మీద మెస్సేజ్‌లను అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక ప్రధాన మార్గాలు, కూడళ్లులో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,వారి కళ్లుగప్పి తప్పించుకునే వాళ్లు ఇక, ఏఐ నిఘా కెమెరాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాల కట్టడి, వాహన దారులందరూ తప్పనిసరిగా నిబంధనలు అనుసరించే విధంగా ఈ ఏఐ నిఘా కెమెరాలు వెంటాడుతున్నాయి. అంతే కాదు, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో ప్రజలే స్వయంగా తమ సెల్ ఫోన్ ద్వారా ఆయా వాహనాల నెంబర్లను చిత్రీకరించి ఎక్స్ పేజీ ద్వారా తమకు పంపిస్తే, ఏఐ నిఘా నేత్రాలలో పరిశీలించి చర్యలు తీసుకునేందుకు సైతం ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. చైన్నెలో అన్నా సాలైలోని స్పెన్సర్ ప్లాజా, ఈగా థియేటర్ వద్ద తొలుత ఏర్పాటు చేసిన ఏఐ నిఘా నేత్రాల రూపంలో అద్బుత ఫలితాలు రావడంతో ఐదు మార్గాలలతో వీటిని ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్నారు. అన్నాసాలై, కామరాజర్ సాలై, జీఎస్టీ రోడ్డు, ఈవేరా రోడ్డులలో రోడ్డుకు మధ్యలో ఆర్చీ తరహా సెట్టింగ్‌లో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కేవలం ట్రాఫిక్‌నిబంధనలు ఉల్లంఘించే వారి ఫొటోలను చిత్రీకరించి పోలీసులకు సమాచారం పంపించే విధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఉన్నారు.
చైన్నె రోడ్లపై ఏఐతో నిఘా
ఐదు మార్గాలలో ఏర్పాటు
వాహనదారులకు ఆటోమెటిక్‌గా చెలానాలు
ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దు?
ఆటోమేటిక్‌గా..
సీటు బెల్టూ ధరించకుండా, హెల్మెట్ ధరించకుండా వెళ్లే వాళ్లు,ట్రాపిక్ సిగ్నల్స్‌లో నిబంధనలు అతిక్రమించే వారి వాహన నెంబరు, వారి ఫొటో సహా ఈ కెమెరాలు చిత్రీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కెమెరాలకు చిక్కిన కాసేపటికి సంబంధిత వాహన దారుడికి జరిమాన వివరాలతో ఎస్‌ఎంఎస్ వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు, ఆయా వాహన దారుడు ఏ మేరకు నిబంధనలు ఉల్లంఘించి ఉన్నాడో అన్నది యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. తమకు తెలియకుండానే ఆయా మార్గాలలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జంప్ చేసిన వారెందరికో ఎస్‌ఎంఎస్‌లు వెళ్లడం గమనార్హం. వచ్చే ఎస్‌ఎంఎస్‌ల ఆధారంగా జరిమానాను ట్రాఫిక్ పోలీసులు చైన్నెలో ఏర్పాటు చేసి ఉన్న సహాయ కేంద్రాలకు లేదా, ఆన్‌లైన్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నిఘా కెమెరాలను చైన్నెవ్యాప్తంగా విస్తరించేందుకు ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇది వాహనదారుల పాలిట వెంటాడే నిఘా నేత్రంగా మారి ఉండటంతో ఇక, తస్మాత్ జాగ్రత్త అన్నట్టు వాహనాలు నడిపేతే సరి లేదా జరిమానా అంటూ ఎస్‌ఎంఎస్‌లు మొబైల్ ఫోన్లకు రావడం తథ్యం. ఎక్కువ సార్లు నిబంధనలు ఉల్లంఘించి, జరిమాన చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారి లైసెన్సులు మున్ముందు ఆటోమెటిక్ రద్దు చేయడానికి సైతం కసరత్తు చేపట్టినట్లు సమాచారం.